వచ్చేస్తోంది మస్కీట్


Sat,September 21, 2019 02:11 AM

-దోమల అంతు తేల్చేందుకు బల్దియా నయా ప్రయోగం
-500 మీటర్ల చుట్టూ ఉన్న దోమలను ఆకర్షించే యంత్రం
-ప్రయోగాత్మకంగా 3 చోట్ల బిగింపు
-ఫలితాలు బాగుంటే.. నగరమంతా ఏర్పాటు
-పెద్ద ఎత్తున జరుగుతున్న ఫాగింగ్
-వారానికి రెండుసార్లు యాంటిలార్వా పిచికారీ
-గణనీయంగా తగ్గుతున్న రోగుల సంఖ్య
-60శాతం రోగులు మూసీ పరిసరాల నుంచే
-జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ దోమల ద్వారా వ్యాప్తిచెందుతున్న వ్యాధులను అరికట్టేందుకు విస్తృతస్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా దోమలను నివారించడంతోపాటు వ్యాధులను అదుపుచేసేందుకు పలురకాల విధానాలను అవలంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దోమలను పట్టుకొని అవి ఏ రకమైన దోమలో విశ్లేషించే అత్యాధునిక యంత్రాలను దిగుమతి చేసుకోనున్నట్లు, ఒకటి రెండు రోజుల్లోనే వాటిని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు.

వైరల్ జ్వరాలు, డెంగీని అదుపుచేసేందుకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం కమిషనర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో దోమల నివారణ చర్యలు చేపట్టడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. దోమలను నిర్మూలించేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ల నిర్వహణ, నిల్వ నీటిలో మందు పిచికారీ, ఫాంగింగ్ తదితర చర్యలు చేపడుతున్నటు, అంతేకాకుండా 500మీటర్ల పరిధిలో ఇండ్లు, ఇంటి బయట ఎక్కడ ఉన్నా దోమలను ఆకర్షించి పట్టుకునే మస్కీట్‌అనే అత్యాధునిక యంత్రాలను కొనుగోలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆ యంత్రం దోమలను పట్టుకోవడమే కాకుండా అవి ఏ రకం దోమలో విశ్లేషిస్తుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. పైలెట్ ప్రాజక్టు కింద జోన్‌కు ఒకటి చొప్పున కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలోని హైరిస్క్ ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. ప్రయోగం సఫలమైతే సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో వీటిని ఏర్పాటుచేస్తామన్నారు.

ఫాగింగ్ మరింత పెంచాం..
నిల్వ నీటిని తొలగించుకుంటే సరిపోదని, పాత్రలను శుభ్రంగా కడుకున్నప్పుడే లార్వా నిర్మూలన పూర్తిగా జరుగుతుందన్నారు. పాత్రలపై తప్పనిసరిగా మూతలు వేసుకోవాలని, లేక గుడ్డలను కప్పుకోవాలన్నారు. ఫాగింగ్ నిర్వహణకు రెట్టింపు చేసినట్లు, ఫాగింగ్ యంత్రాలకు రోజుకు తొమ్మిదికి బదులు 18లీటర్ల డీజిల్ ఇస్తున్నామన్నారు. నగరంలోని 9400 కిలోమీటర్ల రోడ్లకు గాను 3400కిలోమీటర్ల ప్రధాన రోడ్లపై ఇప్పటికే విస్తృతస్థాయిలో ఫాగింగ్ నిర్వహిస్తుండగా, తాజాగా ఇంటర్నల్ రోడ్లలోనూ ఫాగింగ్, సోమ, గురువారాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు.

తగ్గిన రోగుల సంఖ్య
జ్వరాలతో వస్తున్న రోగులనుంచి బస్తీ దవాఖానాల్లో కూడా రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు, పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వీటితో మంచి ఫలితాలు వస్తున్నాయని, కొద్దిరోజుల క్రితం రోజుకు 200 లకుపైగా రోగులు నమోదవుతుండగా, ఇప్పుడు వారి సంఖ్య రోజుకు 70-80కి పడిపోయిందన్నారు. నగరంలో నమోదవుతున్న వ్యాధుల్లో మూసీ పరిసర ప్రాంతాలవారే 60శాతం మంది ఉంటున్నట్లు వెల్లడించారు. దోమల నివారణ మందులు కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్నాయన్నారు. దోమల నివారణ మందుల పిచికారీ, ఫాగింగ్ కోసం 1040 మిషన్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు.

నిధుల కొరత స్వల్పమే
నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రస్తుతం రూ. 147 కోట్లు అవసరం కాగా, తమవద్ద రూ. 115 కోట్లు ఉన్నట్లు, మిగిలిన నిధుల కోసం వివిధ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగం గా అన్‌అసెస్డ్, అండర్ అసెస్డ్ ఆస్తుల గుర్తింపు కోసం సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం రూ.మూడు లక్షలకన్నా ఎక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తున్న ఆస్తులపై సర్వే కొనసాగుతుందని కమిషనర్ లోకేశ్ కుమార్ వివరించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...