నిఘా నీడలో.. సాగర తీరం..!


Fri,September 20, 2019 01:56 AM

-హుస్సేన్‌సాగర్ చుట్టూ ..280 సీసీ కెమెరాలు
-మూడు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు
-డీజీపీ, హెచ్‌ఎండీఏ కార్యాలయంలో..నిరంతర పర్యవేక్షణ
-పర్యాటకుల భద్రతకు పెద్ద పీట వేస్తున్న హెచ్‌ఎండీఏ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం కానున్నది. పర్యాటక క్షేత్రమైన సాగర తీరాన్ని నిఘా నీడలో ఉంచి పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. దేశ, విదేశీయులతో పాటు పలు రాష్ర్టాల నుంచి వచ్చే పర్యాటకులతో హుస్సేన్‌సాగర్ కళకళలాడుతుంది. సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ స్టేడియం, లుంబినీ పార్కు, నెక్లెస్‌రోడ్, సాగర్ బోటింగ్, భారీ జాతీయ జెండా ఇలాంటి అందాలను వీక్షించేందుకుగానూ ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులు, సందర్శకుల భద్రతను పరిగణలోకి తీసుకున్న హెచ్‌ఎండీఏ అధికారులు హుస్సేన్‌సాగర్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మూడు కోట్ల అంచనాతో 280 సీసీ కెమెరాల ఏర్పాటు పనులను ఏజీసీ సంస్థ చేపడుతున్నది. హెచ్‌ఎండీఏ తరఫున 250 సీసీ కెమెరాలతో పాటు పోలీస్ శాఖ నుంచి అదనంగా మరో 30 సీసీ కెమెరాలను సాగర్ చుట్టూ అమర్చనున్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నిఘా నీడలో నిరంతరం పర్యవేక్షించనున్నారు.

పోలీస్ శాఖ ఆదేశాలతో అప్రమత్తం
నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్ చుట్టూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ) పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. అంచెలంచెలుగా వాటిని విస్తరిస్తూ పర్యాటకులను ఆకర్శిస్తున్నది. అయితే ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు, లేజర్ షో, సంజీవయ్య పార్కు, సాగర్‌లో బోటింగ్, అతి భారీ జెండాను వీక్షించేందుకుగానూ నిత్యం వేల సంఖ్యలో సందర్శిస్తుంటారు. కాగా ఈ పర్యాటక ప్రాంతంలో నిఘా మరింత పెంచాలని పోలీస్ శాఖ హెచ్‌ఎండీఏకు సూచించింది. నెక్లెస్‌రోడ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడం, పర్యాటక ప్రాంతంలో భద్రత డొల్ల ఉన్న తరుణంలో పోలీస్ శాఖ ఆదేశాలతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు అడుగులు వేశారు. బీపీపీఏ కార్యాలయంలో ఓఎస్డీ, డీజీపీ కార్యాలయంలో ఈ సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండనుంది.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...