గ్రామానికో గ్రీన్‌ప్లాన్ సిద్ధం


Tue,September 17, 2019 02:25 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : సోమవారం నుంచి జిల్లాలోని 61 గ్రామాల్లో గ్రీన్‌ప్లాన్ సిద్ధమైంది. సుమారు ఆరు రోజుల పాటు గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపుల విరివిగా మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా ఈ నెల 16నుంచి సుమారు ఏడు రోజుల పాటు అంటే ఈ నెల 21 వరకు అన్ని గ్రామాల్లో మొక్కలు నాటనున్నారు. ఇందులో భాగంగా గ్రీన్‌ప్లాన్‌ను సిద్ధం చేయడంతో పాటు గ్రామాల్లో నర్సరీ, మొక్కలను నాటేందుకు గుంతలు, ఐకానిక్ ప్లాంటేషన్, నాటిన మొక్కల చుట్టూ కలుపు తీయడం, పాదులు , ఎరువు వేయడం, క్రమం తప్పకుండా నీరు పోయడం వంటి పనులు చేయనున్నామని తెలిపారు. 61 గ్రామాల్లో 15,30,536 మొక్కలు నాటామని తెలిపారు.

సర్పంచ్, కార్యదర్శికి షోకాజ్ నోటీసులు...
ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మూడుచింతలపల్లిలోని పలు కాలనీల్లో పర్యటించిన కలెక్టర్ రోడ్లపై మురుగునీరు ప్రవహించడంపై అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శికి షోకాజ్ నోటీసులను జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ను ఆదేశించారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసే వరకు ఉన్న మురికి కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ కౌటిల్య, డీఎఫ్‌ఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లాలో...
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : పచ్చదనం ..పరిశుభ్రత.. పల్లెల ప్రగతిపై సీఎం కేసీఆర్ 30 రోజుల కార్యక్రమం 12 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన అధికారులు... యాక్షన్ ప్లాన్‌ను డ్యాష్‌బోర్డులో పొందుపర్చారు. ఈనెల 20 నుంచి వారం రోజుల పాటు జరిగే పవర్‌వీక్‌లో 9,775 విద్యుత్ సమస్యలను గుర్తించారు. వంగిన స్తంభాలు, వేలాడుతున్న వైర్లు తదితర సమస్యలుండగా వాటి విషయమై గ్రామాల వారీగా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు జాబితా సమర్పించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం మొయినాబాద్ మండలం ముర్తూజాగూడ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ హరీశ్ ఆ గ్రామం పరిస్థితి చూసి పది రోజుల నుంచి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజుల్లో ప్రణాళికలో ప్రగతి కనిపించకపోతే సంబంధిత అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...