తాళం కనపడితే.. పగలాల్సిందే


Tue,September 17, 2019 02:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ. 25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ సమీర్ అలియాస్ లాలా కారు డ్రైవర్. 10 ఏండ్ల క్రితం యాఖత్‌పురాలో నివాసమున్న సమయంలో దొంగిలించిన ద్విచక్రవాహనాలను కొంటూ చార్మినార్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తరువాత సౌదీ అరేబియాకు వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేశాడు. కొన్నాళ్లకే తిరిగి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. సునాయసంగా డబ్బు సంపాదించేందుకు ఇండ్లలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. స్క్రూ డ్రైవర్, సుత్తె తీసుకుని ఒక్కడే కాలనీల్లో తిరుగుతుంటాడు. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల చాం ద్రాయణగుట్ట ఠాణా పరిధిలో దొంగతనాలు జరగడంతో అదనపు డీసీపీ రషీద్ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ రుద్రభాస్కర్, డీఎస్సై కొండల్‌రావుతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ బృందం కాలనీల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎర్రకుంట ఎక్స్ రోడ్డు వద్ద లాలా పోలీసులకు చిక్కాడు. అతన్ని తనిఖీ చేయగా జేబులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించ గా దొంగతనాల విషయం బయటపడింది. 2015 నుంచి చాంద్రాయణగుట్ట ప్రాంతంలో 9 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 520 గ్రాముల బంగారు ఆభరణాలు, 1040 గ్రాముల వెండి, సోనీ టీవీ , 2 వేల సౌదీ కరెన్సీ రియాల్, ఒక స్క్రూ డ్రైవర్, సుత్తెలను స్వాధీనం చేసుకున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...