జయమంగళం నిత్య శుభ మంగళం


Fri,September 13, 2019 02:26 AM

-ఏకదంతుడికి భక్తకోటి వీడ్కోలు
-ఆబాలగోపాలాన్ని మురిపించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు
-ప్రశాంతంగా సాగిన శోభాయాత్ర
-సంప్రదాయ నృత్యాలతో, విభిన్న వేషధారణలతో ఆకట్టుకున్న ఊరేగింపులు
-ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న 25 లక్షల మంది భక్త జనం
-మధ్యాహ్నం 1:45కు గంగ ఒడికి చేరిన ద్వాదశాదిత్య మహా గణపతి
-ట్యాంక్‌బండ్‌పై.. ఇసుకేస్తే రాలనంత జనం
-కేరింతలతో, భక్త జయ ధ్వానాలతో మహా ఉత్సవాన్ని తలపించిన సాగర్ పరిసర ప్రాంతాలు
-వేలాది గణపతుల రాకతో ప్రత్యేక ఆకర్షణగా మారిన మొజాంజాహీ కూడలి
-లక్షలు పలికిన లంబోదరుడి లడ్డూలు
-బాలాపూర్ రికార్డును బద్దలు కొట్టిన బండ్లగూడ వినాయకుడు
-18.51 లక్షలకు వేలం పాట
-17.75 లక్షలతో రెండో స్థానంలో ఫిలింనగర్ వినాయకనగర్ లడ్డూ
-అడుగడుగునా ఏర్పాట్లు చేసి.. ఇబ్బందులు కలగకుండా చేసినజీహెచ్‌ఎంసీ
-ఏ చిన్న ఘటనకూ తావివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు
-కిటకిటలాడిన ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రోస్టేషన్లు

ఖైరతాబాద్/సిటీబ్యూరో : పది రోజుల పాటు నిష్టగా పూజలందుకున్న ద్వాదశాదిత్యుడు గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు గంగమ్మ ఒడికి చేరాడు. 61 అడుగుల ఎత్తు... 27 అడుగుల వెడల్పుతో ఉన్న మహా గణపతిని సుమారు 25 లక్షల మంది దర్శించుకున్నారు. ఉదయం ఖైరతాబాద్‌లో గణేశుడి మండపం వద్ద నుంచి అశేష భక్త జన నిరాజనాల మధ్య శోభయాత్ర సాగింది. ఈ యాత్రను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక అడుగు ముందుకు కదులుతూ శోభయాత్ర సాగింది. దారి పొడవునా ఊరిగింపులో భక్తు లు పూల వర్షం కురిపిస్తూ జయజయధ్వానాలు పలికారు.

అర్ధరాత్రి నుంచే ఏర్పాట్లు

బుధవారం అర్ధరాత్రి నుంచే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాత్రి 12 గంటలకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. 12.30 గంటలకు అర్చకులు మహదేవ్, రంగరాజాచార్యుల నేతృత్వంలో స్వామి వారికి కలశ, విసర్జన పూజ నిర్వహించారు. అదే సమయంలో చిన్న క్రేన్ సాయంతో మహాగణపతి కుడివైపు ఏకాదశి దేవి సమేత విష్ణుమూర్తి ఉప మండపాన్ని ప్రత్యేక ట్రాలీలోకి తరలించారు. ఒంటి గంటకు ఖైరతాబాద్ గణేశుడిని ట్రాలీమీద చేర్చేందుకు మోడ్రన్ క్రేన్ మండపానికి చేరుకోగా, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి సింగరి రాజ్‌కుమార్, శిల్పి రాజేంద్రన్‌లు పూజలు నిర్వహించారు. అనంతరం 1.30 నుంచి 2.30గంటల వరకు గణేశుడి విగ్రహానికి క్రేన్ కొక్కాలను తగిలించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు గణనాథుడినిపైకి ఎత్తి 3.40 గంటలకు ట్రాలీపై కూర్చోపెట్టారు. అనంతరం ఉదయం 6 గంటల వరకు విగ్రహం కదలకుండా ట్రాలీపై వెల్డింగ్ పనులు నిర్వహించగా నిమజ్జనానికి స్వామి వారి విగ్రహం సిద్ధమైంది.

ఒగ్గుడోలు విన్యాసాలు.. శివసత్తుల నృత్యాలు

మహాగణేశుడి శోభాయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు.. శివసత్తులు, పోతురాజుల నృత్యాలు..చిన్నారుల ఆటపాటలు.. లయబద్ధంగా సాగిన ఆర్కెస్ట్రా సంగీతం.. దారి పొడవునా అధ్యాత్మికతను పంచింది. జీహెచ్‌ఎంసీ కార్మికులు శోభాయాత్ర వచ్చే రోడ్డులో మండపం నుంచి నిమజ్జన ప్రదేశం వరకు రోడ్లను శుభ్రం చేస్తూ సేవలను అందించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ వద్దకు రాగానే విగ్రహం త్రిశూలం వీధి దీపానికి తగిలింది. టెలిఫోన్ భవన్ వైపునకు వెళ్తుండగా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం వద్ద వీధి దీపానికి తగిలిన కుడి చేతిలో ఉన్న సుత్తి ఓ పక్కకు ఒరిగింది.

గణనాథుడి సేవలో విద్యార్థులు..

వినాయక నిమజ్జన సేవకు విద్యార్థులు సైతం ముందుకొచ్చారు. దోమలగూడ పీఈటీ కళాశాల విద్యార్థులు సుమారు 17 మందికి పైగా సేవలందించారు. గజఈతగాళ్ల కూడా సాగర్ వద్ద సేవలందించారు. యువతీయువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.

ఉద్వేగానికి లోనయ్యా..

దేశంలో ఎక్కడా లేని విధంగా నిమజ్జనోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతుంది. జయజయధ్వానాల మధ్య గణేశుడిని నీళ్లల్లో వదిలేసే సమయంలో కొంత ఉద్వేగానికి లోనయినట్లుగా అనిపిస్తుంది. గణేశుడిని క్రేన్ సాయంతో పైకిలేపి.. భక్తులందరూ మరోసారి దర్శించుకునేలా అందరికి కనిపించేలా తిప్పుతాను.
-దేవేందర్ సింగ్, క్రేన్ ఆపరేటర్

శోభాయాత్ర ఇలా..

-ఉదయం 7.13 గంటలకు మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభం
-7.40 గంటలకు జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం వరకు
-8.30 గంటలకు సెన్సేషన్ థియేటర్ వద్దకు చేరుకున్న గణపతిని కార్పొరేటర్ పి. విజయారెడ్డి దర్శించుకొని శోభయాత్రతో కలిసి నడిచారు.
-8.55గంటలకు లక్డీకాపూల్ చౌరస్తాకు చేరుకున్న ద్వాదశాదిత్యుడిని ఎమ్మెల్యే దానం నాగేందర్ దర్శించుకున్నారు. అనంతరం అక్కడే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
-9.08 గంటలకు టెలిఫోన్ భవన్
-9.23 గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం
-9.30 గంటలకు పాత సచివాలయం గేటు
-10.43 గంటలకు తెలుగుతల్లి ైఫ్లెఓవర్
-11.48కి లుంబినీ పార్కు
-12.24కు క్రేన్ నంబర్ 6కు ద్వాదశాదిత్య మహాగణపతి చేరుకున్నారు
-12.25కు మహాగణపతిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు
-12.45 గంటలకు స్వామి వారికి తుది పూజ
-12.52 గంటలకు ట్రాలీ నుంచి విగ్రహాన్ని వేరు చేసేందుకు వెల్డింగ్ పనులు ప్రారంభం
-1 గంటకు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పూజలు
-1.13గంటలకు గుమ్మడికాయతో స్వామి వారికి దిష్టి తీసిన ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్‌రాజ్
-1.15 గంటలకు స్వామి వారిని నిమజ్జనం చేసే క్రేన్ ఆపరేటర్ దేవేందర్ సింగ్ పూజలు
-1.20 గంటలకు వెల్డింగ్ పనులు పూర్తి
-1.21 శ్రీ ద్వాదశాతిద్యుడిని పైకి ఎత్తిన క్రేన్ ఆపరేటర్
-1.25 గంటలకు భక్త జన కోటికి తుది దర్శనం కోసం విగ్రహాన్ని గాలిలోనే చుట్టూరా తిప్పిన క్రేన్ ఆపరేటర్
-1.30 గంటలకు సాగర్ నీటిని తాకిన స్వామి వారి పాదాలు
-1.45 గంటలకు శ్రీ ద్వాదశాదిత్యుడి నిమజ్జనం పూర్తి

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...