విఘ్నేశ్వరుడికి వీడ్కోలు


Fri,September 13, 2019 02:21 AM

-ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం
-సీసీసీ నుంచి అధికారుల పర్యవేక్షణ
-జియో ట్యాగింగ్‌తో విగ్రహాల కదలికల పరిశీలన
-ప్రధాన విగ్రహాల ట్రాకింగ్
-సహకరించిన వారందరికీ ధన్యవాదాలు : సీపీ అంజనీకుమార్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో సామూహిక వినాయక నిమజ్జనం గురువారం వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిమజ్జనోత్స కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. గత ఐదేండ్ల స్ఫూర్తితో ఈ ఏడాది కూడా శాంతి భద్రతలకు సంబంధించిన చిన్న ఘటన కూడా జరుగకుండా వేడుకలు జరిగాయి. 21వేల మంది పోలీసు బందోబస్తుతోపాటు నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలతో బందోబస్తును పోలీసులు సమీక్షించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)నుంచి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నగరంలో ఉన్న 3లక్షల సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా నిమజ్జనోత్సవం జరిగే ప్రధాన రూట్లు, హుస్సేన్‌సాగర్, ఖైరతాబాద్ మహాగణపతి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12.30 గంటల వరకు ముగించాలనుకున్నా ఒక గంట ఆలస్యంగా జరిగింది. ఉదయం వేళల్లో భారీ సంఖ్యలో భక్తులు మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉండగా, బాలాపూర్ గణేశ్ మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో చార్మినార్ ప్రాంతాన్ని దాటింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ చార్మినార్, మొజాంజాహి మార్కెట్ వద్దకు వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉన్న వేదికల నుంచి సామూహిక నిమజ్జనోత్సవ ర్యాలీకి స్వాగతం పలికారు. సాయంత్రం 4గంటల తరువాత ప్రధాన ర్యాలీతోపాటు ట్యాంక్‌బండ్‌కు వెళ్లే దారిలో భక్తుల రద్దీ పెరిగింది. చీకటిపడే వరకు భారీ సంఖ్యలో భక్తులు హుస్సేన్‌సాగర్ వైపు బారులు తీరారు. దీంతో ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్, అబిడ్స్, మెహింజాహి మార్కెట్ రూట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.

జియో ట్యాగింగ్.. ట్రాకింగ్..!

హైదరాబాద్‌లో ఉన్న 11,198 విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశారు. సీసీసీ నుంచి ఆయా విగ్రహాలు ఎన్ని గంటలకు తరలి వస్తున్నాయి. అక్కడ ఎందుకు ఆలస్యమవుతుందనే విషయాన్ని నేరుగా ఆయా మండపాల వద్ద ఉన్న సిబ్బందితో సీసీసీ నుంచి మాట్లాడారు. విగ్రహాలను తరలించే వాహనాలు ఎక్కడకు వచ్చాయనే విషయాలను జియో ట్యాగింగ్‌తో సీసీసీ నుంచి పరిశీలించారు. దీంతోపాటు ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చిన ట్రాకింగ్ యాప్ ద్వారా 20 ప్రధానమైన గణేశ్ విగ్రహాలను ట్రాక్ చేస్తూ వచ్చారు. విగ్రహాల తరలింపులో ఆలస్యం జరిగితే అందుకు కారణాలను విశ్లేషిస్తూ, కిందిస్థాయి సిబ్బందికి సీసీసీ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చారు.

సహకరించిన వారికి ధన్యవాదాలు

గణేశ్ నవరాత్రి వేడుకలు, నిమజ్జనోత్సవ ర్యాలీలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అందుకు సహకరించిన మండపాల నిర్వాహకులు, ప్రజలు, వలంటీర్లకు ధన్యవాదాలు. 50 గంటల పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. ఒక పక్క పోలీస్ సిబ్బంది, మరో పక్క టెక్నాలజీ పరమైన నిఘాతో ఇన్సిండెంట్ ఫ్రీగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేశాం. సీసీసీ నుంచి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, క్షేత్ర స్థాయిలోని సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేశాం.
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అంజనీకుమార్

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...