సీసీసీ ద్వారా ప్రత్యక్ష వీక్షణం


Fri,September 13, 2019 02:21 AM

-ఏ చిన్న ఘటన లేకుండా చర్యలు
-గూగుల్ మ్యాప్‌ల ద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్
-ఘట్‌కేసర్ సీసీసీని సందర్శించిన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్

సిటీబ్యూరో/ఘట్‌కేసర్, నమస్తే తెలంగాణ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం సజావుగా సాగింది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకున్నది. నిమజ్జనానికి రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ దాదాపు 5500 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. 90 వేల కమ్యూనిటీ సీసీ టీవీలతోపాటు నిమజ్జనానికి దారి తీసే 46 జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రతీ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఘట్‌కేసర్ కమాండ్ కంట్రోల్ ద్వారా రాచకొండ పరిధిలోని 25 చెరువుల వద్ద జరిగిన నిమజ్జనాన్ని సీపీ మహేశ్‌భగవత్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ వీక్షణం ద్వారా అక్కడ ఉన్న బందోబస్తు వివరాలను తెలుసుకుని అవసరం ఉన్న చోట సిబ్బందిని మోహరించుకున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం మఫ్టీలో విధులు నిర్వహించారు. మొత్తం నాలుగు ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును పర్యవేక్షించారు. అనుమానితులను గుర్తించేందుకు ఫేషీయల్ రిైగ్నెజేషన్ సాఫ్ట్‌వేర్‌ను వాడారు.

రాచకొండలో మొత్తం 12 వేల వరకు వినాయకులు ఉండగా, వాటిలో 3, 5, 7, 9 రోజుల్లో దాదాపు 6 వేల వరకు నిమజ్జనం కాగా, గురువారం మిగతా 6 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు మూయించినట్లు తెలిపారు. ఎవరైనా మద్యం విక్రయించినట్లయితే 100 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అనంతరం సీపీ ఏదులాబాద్‌లో లక్ష్మీనారాయణ చెరువు వద్ద గణేశ్‌ఘాట్‌ను సందర్శించి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించి భక్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో సీపీతోపాటు మల్కాజిగిరి అడిషనల్ డీసీపీ సందీప్, మల్కాజిగిరి ఇన్‌చార్జి డీసీపీ నారాయణరెడ్డి, ఎస్‌బీ, ఏసీపీ విశ్వప్రసాద్, స్థానిక సీఐ రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అశ్విక దళాలు, ఇతర జిల్లాల నుంచి పోలీసులతో ప్రశాంతంగా ఊరేగింపు సాగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ 12.25 నిమిషాలకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి దాటి ప్రధాన ఊరేగింపులో చేరింది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...