త్వరలో మంగళ్‌పల్లి, బాటాసింగారం లాజిస్టిక్‌ పార్కులు


Wed,September 11, 2019 12:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాజధాని మణిహారమైన ఔటర్‌ రింగు రోడ్డు లాజిస్టిక్‌ హబ్‌లకు కేంద్రంగా మారింది. వస్తువుల రవాణాకు ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్‌ చుట్టూ లాజిస్టిక్‌ పార్కుల ద్వారా నగరంలో ట్రాఫిక్‌ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరులకు దిగుమతి చేసుకునేందుకు రెండు చోట్ల లాజిస్టిక్‌ పార్కులకు శ్రీకారం చుట్టింది. నాగార్జున సాగర్‌ హైవే, మరోకటి విజయవాడ హైవేలో రెండు లాజిస్టిక్‌ పార్కు పనులకు 2017 అక్టోబరులో మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసిన సంగతి విదితమే. పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో బాటాసింగారంలో రూ. 35కోట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లాజిస్టిక్‌ పార్కు పనులు దాదాపుగా 70 శాతం మేర పూర్తి చేసుకున్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, గోదాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీలోగా కార్యకలాపాలను సేవలకు సర్వం సిద్ధం చేసేందుకు నిర్ధేశిత లక్ష్యంతో పనులను పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు. ఇక మంగళ్‌పల్లిలో రూ. 20కోట్లతో 22 ఎకరాల్లో చేపట్టిన పార్కు పనులు పూర్తి చేసుకుని సకల సదుపాయాలతో అందుబాటులోకి వచ్చింది. లాజిస్టిక్‌ పార్కు నుంచి సరుకుల రవాణా, ఎగుమతులు, దిగుమతుల వంటి కార్యకలాపాల సేవలను ఫేజ్‌-1ను త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

అందుబాటులోకి మంగళ్‌పల్లి లాజిస్టిక్‌ పార్కు
22 ఎకరాల విస్తీర్ణంలో మంగళ్‌పల్లి అన్‌కాన్‌ లాజిస్టిక్‌ ‘హబ్‌' రూపుదిద్దుకుంది. మూడు ఎకరాల విస్తీర్ణంలో లక్షా20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన గోదాం (వేర్‌హౌస్‌)నిర్మాణాన్ని ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు. ఎండకాలంలో కూడా వేడిమిని తట్టుకుని చల్లదనాన్ని ఇచ్చేలా ఇన్స్‌లేషన్‌ను ఏర్పాటు చేశారు. లక్షల టన్నుల సరుకులు ఇక్కడ నిల్వ ఉండేలా భారీ గోడౌన్‌ నిర్మాణం పూర్తి కావడంతో దీని సేవలు గత నెల ఒకటి నుంచి కిందట అందుబాటులోకి వచ్చాయి. వంద మంది డ్రైవర్లు ఒకేసారి విశ్రాంతి తీసుకునేందుకు నాలుగు విశాలమైన గదులను నిర్మించారు. డ్రైవర్లు పడుకునేందుకు బెడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. డ్రైవర్లుకు మౌలిక వసతుల్లో భాగంగా టాయిలెట్లు, బాత్‌రూంలు నిర్మించారు. డ్రైవర్లు తమ సామానులను భద్రపరచు కోవడానికి ప్రత్యేకంగా లాకర్లను సౌకర్యాన్ని కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కులు, లారీల డ్రైవర్లు సేద తీరేందుకు విశ్రాంతి భవనంలో సకల సౌకర్యాలను కల్పించారు. 250 ట్రక్కులు పార్కింగ్‌ చేసే సామ ర్థ్యం పాంయిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిలో 200 ట్రక్కులు నిలిచేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. బొంగుళూర్‌లో అన్‌కాన్‌ మోడల్‌ లాజిస్టిక్‌ హబ్‌ సేవలు 30 జనవరి 2020 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామని ఆన్‌కాన్‌ లాజిస్టిక్‌ హబ్‌ ఎండీ రాజశేఖర్‌ తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...