ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జలాలు పారిస్తాం


Wed,September 11, 2019 12:43 AM

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ : ‘ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జలాలు పారిస్తాం.. జిల్లాకు ఏ జలాలు అయితే ఎంటీ.. జిల్లాకు సాగునీరు కావాలి.. నేను, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు సమష్టిగా ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు నీళ్లు తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తాం..మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణాన్ని సీఎం కేసీఆర్‌ ఎంతో విశ్వాసంతో పూర్తి చేశారు. అదే స్ఫూర్తితో..అదే శ్రమతో.. (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల) ద్వారా జిల్లాకు నీళ్లు తీసుకొస్తాం’.. అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాలోని ఆర్కేపురంలో ఉన్న గ్రీన్‌హిల్స్‌ కాలనీ క్యాంపు కార్యాలయంలో ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు గోదావరి, కృష్ణా నీళ్లు వస్తున్నాయని, ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తాగు నీరందిస్తున్నట్లు తెలిపారు. అయితే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో సాగునీరందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ జిల్లాను జోగుళాంబ జిల్లా నుంచి చార్మినార్‌ జోన్‌లో కలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పర్యాటక కేంద్రంగా అనంతగిరి
వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరిని పర్యాటక కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తామని సబితారెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఐటీ ఆధారిత పరిశ్రమలు మరిన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, మరిన్ని పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుదారులను ఆహ్వానించి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని వెల్లడించారు.

త్వరలో జిల్లా రివ్యూ సమావేశం
త్వరలో జిల్లా రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తానని ఆమె తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమం పై ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయనున్నట్లు వివరించారు. ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్డు ఉన్న ప్రతిగ్రామానికి ఆర్టీసీ బస్సులను నడిపించే విధంగా దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 13 మహిళా పరస్పర సంఘాల సమాఖ్య బ్యాంకు (మాక్స్‌)లో ఉన్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

కందిబోర్డు ఏర్పాటుకు కృషి
తాండూరులో కందిబోర్డు ఏర్పాటు చాలా ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు అని.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సహకారంతో కేంద్రంతో మాట్లాడి దాన్ని సాధిస్తామన్నారు. నగరం నుంచి కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ వరకు నిర్మించ తలపెట్టిన నేషనల్‌ హైవే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సబితారెడ్డి తెలిపారు. రోడ్డు వెడల్పులో భాగంగా చెట్ల తొలిగింపుపై కోర్టులో కేసు ఉందని ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తామన్నారు.

విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి
విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి.. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించాలని ప్రభుత్వం పనిచేస్తున్నదని.. వారి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ప్రాంతాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా కృషి చేస్తున్నారో పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కూడా వారు చొరవ చూపాలని సబితారెడ్డి విజ్ఞప్తి చేశారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...