ఉపాధి కోసం..నగర బాట


Wed,September 11, 2019 12:42 AM

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : వారు దరువేస్తే.. కాలు కదపాల్సిందే.. వారు డప్పుపై తీన్మార్‌ వాయిస్తే.. ఒళ్లు పూనకం వచ్చినట్టు ఊగిపోవాల్సిందే... వారి డప్పు మోగిస్తే... ఎదురుగా ఉన్న ప్రతి మనిషి నాట్యం చేయాల్సిందే.... గ్రామీణ డప్పు కళాకారుల తీరు అంతేమరి..! గ్రామీణ డప్పు కళాకారుల బీటు అలా ఉంటుంది. ఒక బోనాలు, జాతర ఇలా వివిధ రకాల పండుగలకు సంబంధించి భిన్న రకాల బీటును వాడుతారు గ్రామీణ డప్పు కళాకారులు. వారంతా గణనాథుల నిమజ్జనంలో భాగంగా వలస బాట పట్టారు. ప్రస్తుతం, గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ తంతు గ్రామాల్లో కూడా జరుగుతున్నప్పటికీ కాస్త పట్టణాలు, నగరాల్లో అధికంగా ఉంటుంది. దీనిని పురస్కరించుకొని డప్పు కళాకారులు గ్రామాల నుంచి బతుకు దెరువును వెతుక్కుంటూ పట్ణణాలు, నగరాలకు తరలి వచ్చారు. నగరంలోని బ్యాండ్‌ వాయించే కళాకారులు ఎక్కువ మొత్తంలో పైకాన్ని వసూలు చేయడంతో ఉత్సవ నిర్వాహకుల దృష్టి గ్రామీణ కళాకారులపై పడింది. గ్రామీణ కళాకారులైతే తక్కువకు వస్తారని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్వాహకులు గ్రామీణ కళాకారుల వద్దకు వస్తున్నారు. ఇలా గత కొంత కాలంగా నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలైన మెదక్‌, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి తీన్మార్‌ వాయించే డప్పుల కళాకారులు వస్తున్నారు. అదే కోవలో ఈ సంవత్సరం కూడా వివిధ జిల్లాల నుంచి బృందాలుగా ఏర్పడి వందలాది మంది వచ్చి సికింద్రాబాద్‌లోని జింఖానా పరేడ్‌ మైదానం గోడ పక్కన సేద తీరుతూ ఉపాధిని వెతుక్కుంటున్నారు. ఈ వారం రోజుల పాటు డప్పులు దరువేసి నాలుగు రూపాయలు సంపాదించవచ్చనే ఆశతో పని కోసం ఎదురు చూస్తున్నారు.

గిట్టని కూలీ..
వందల కిలోమీటర్ల దూరం నుంచి వందలాది రూపాయల చార్జీలు పెట్టుకొని కళాకారులు కడుపు చేతబట్టుకొని ఎంతో ఆశతో నగరానికి వచ్చారు. ఈ తరుణంలో గ్రామీణ కళాకారులేగా అని చిన్న చూపు చూస్తూ వారి వద్దకు వచ్చి ఇష్టారాజ్యంగా కళాకారులకు ఒక్కరికి రూ.200 నుంచి రూ.500ల వరకు బేరమాడుతున్నారు. ఒక వేళ బేరం కుదిరినా.. నిమజ్జనం పూర్తయ్యాక ఇస్తామన్న పైకం ఇవ్వకుండా ఉడాయిస్తున్నారు. ఎవరో ఒకరు మాట ప్రకారం కళాకారులు అడిగినంత ఇస్తున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...