పరిశుభ్రమైన పల్లెలు


Wed,September 11, 2019 12:42 AM

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక సత్ఫలితాలిస్తున్నది. గ్రామాలన్నీ పరిశుభ్రతకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. ప్రణాళికలో భాగంగా సుమారు 7 రోజుల పాటు శానిటేషన్‌ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే మేడ్చల్‌ జిల్లా పరిధిలోని 61 గ్రామాల్లో శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కేవలం ఒక్కరోజులోనే ముందస్తుగా గుర్తించిన 304 శానిటేషన్‌ సమస్యలను పరిష్కరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు శానిటేషన్‌ సిబ్బందితో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేశారు. జిల్లాలో సుమారు ఏడు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, జిల్లాలోని ప్రతి గ్రామంను పరిశుభ్రమైన గ్రామంగా మారుస్తామని జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ తెలిపారు. కేవలం రోడ్లను, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా మార్చడమే కాకుండా శిథిలావస్థలోని ఇండ్లను, మట్టికుప్పలను, పశువుల కొట్టాలను తొలిగించడం, పాడుబడిన బావులు, బోర్లను పూడ్చివేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, అయితే నేటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించి మరుగుదొడ్ల నిర్మాణం చేసుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నామని డీపీవో తెలిపారు. అలాగే దోమలను పూర్తిగా నివారించేందుకు 61 గ్రామాల్లోను నిత్యం ఫాగింగ్‌ చేస్తున్నామని, డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు గ్రామాల్లో తడిపొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దాతల సాయంతో ఇంటింటికి చెత్త డబ్బాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డంపింగ్‌ యార్డు షెడ్డును నిర్మించి చెత్తనుతరలించడంతో పాటు కంపోస్టు ఎరువు తయారు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే రోడ్లపై చెత్త వేసేవాళ్లకు సెక్షన్‌ (88) ప్రకారం నోటీసులను జారీ చేయడంతో పాటు జరిమానాలను విధిస్తున్నామని డీపీవో తెలిపారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...