అంటు వ్యాధుల నివారణపై అవగాహన


Tue,September 10, 2019 04:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రేటర్ వ్యాప్తంగా 200 వైద్య శిబిరాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆరోగ్య, వైద్య శాఖ అధికారుల సహకారంతో జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్నది. ఇప్పటికే జూలై, ఆగస్టు మాసాల్లో 950 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. దీంతో దోమల నివారణ ముందు స్ప్రెయింగ్, ఫాంగింగ్ చేపట్టడంతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై మూడు జిల్లాల వైద్యాధికారులు, జీహెచ్‌ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, ఎంటమాలజీ అధికారులతో పలుమార్లు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన ప్రైవేట్ దవాఖానల సాయంతో ప్రతి జోన్లలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా మలేరియా అధికారులు, జీహెచ్‌ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఎంటమాలజీ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ వైద్య శిబిరాలను గ్రేటర్ పరిధిలోని అంటువ్యాధులు ప్రబలే సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. గతసంవత్సరాల్లో అంటు వ్యాధులు ప్రబలిన బస్తీలు, కాలనీల్లో ఈ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంటింటికీ లార్వా నివారణ స్ప్రెయింగ్‌ను జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ బృందాలు చేపట్టడం, ఫాంగింగ్ ఆఫరేషన్లు నిర్వహించడంతో పాటు వర్షకాలం సందర్భంగా వచ్చే వ్యాధుల నిరోధంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్ ఆసిస్టెంట్లు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఎంటమాలజీ విభాగం సిబ్బంది అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ ఆటోలకు మైక్‌లు ఏర్పాటు చేసే ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించడం, తమ ఇళ్లలోని నీటి నిల్వలను తొలగించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...