ఒక్కరోజే ఏడు లక్షలు


Mon,September 9, 2019 01:26 AM

-పోటెత్తిన భక్తులు
-కిక్కిరిసిన ఖైరతాబాద్‌ పరిసరాలు
ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకునేందుకు లక్షలాది భక్త జనం తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో రాష్ట్రంతోపాటు దేశంలోని నలుమూల నుంచి భక్తులు బారులుదీరారు. ఖైరతాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌, సెన్సేషన్‌ థియేటర్‌ రోడ్డు, రైల్వే గేట్‌, ఐమాక్స్‌ వెనుక వైపు దారి నుంచి భక్తులు అశేష సంఖ్యలో తరలిరావడంతో ఖైరతాబాద్‌ జనసంద్రమైంది. కొన్ని బస్తీల నుంచి స్థానికులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బస్టాండ్లు, ఎంఎంటీఎస్‌, మెట్రో రైల్వేస్టేషన్లు కిక్కిరిపోయాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు, బస్సులు నడిచాయి. రాత్రి 10 గంటల వరకు సుమారు ఏడు లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. తెల్లవారుజాము వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అదనపు బలగాలు...స్వచ్ఛంధ సంస్థ సేవలు
ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పోలీసుశాఖ ప్రత్యేక బలగాలను మోహరించింది. ప్రధానంగా మహిళా పోలీసులను విధుల్లో ఉంచి మహిళలు, పిల్లలకు ఇబ్బంది కలుగకుండా చూశారు. ఎన్‌సీసీ, సంఘ సేవకులు, వివిధ స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు తమ సేవలందించారు. జలమండలి ఆధ్వర్యంలో నీటి వసతి కల్పించారు. పలు స్వచ్ఛంధ సంస్థలు భక్తుల కోసం ప్రసాదం, నీటి ప్యాకెట్ల వితరణ చేశారు.

ప్రతిక్షణం పర్యవేక్షణ
ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గణపతి మండపం నుంచి అన్ని దిక్కుల వందమీటర్ల పరిధిలో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలతో ప్రతి క్షణం పోలీసులు పర్యవేక్షించారు. ఏరి యా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తూ నిరంతరం ఫుటీలను పరిశీలించారు. తోపులాటలు జరిగిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడున్న బారికేడ్లను సైతం తొలగించి భక్తులు సాఫీగా దర్శనం చేసుకునే వీలు కల్పించారు.

రద్దీగా మెట్రో రైళ్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఖైరతాబాద్‌ బడా గణేష్‌ సందర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రోరైళ్లల్లో తీవ్ర రద్దీ నెలకొంది. ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో రైళ్లన్నీ భక్తులతో పోటెత్తాయి. ఒక్క ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచే ఆదివారం ఒక్కరోజే 40 వేల మంది దిగడం, 30 వేల మంది ఎక్కడం ద్వారా 70వేల మంది ప్రయాణించినట్లుగా మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగున్న నిమిషాలకొక రైలు చొప్పున అదనపు సర్వీసులు నడపంతోపాటు రాత్రివేళల్లో సైతం రైళ్లను నడిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖైరతాబాద్‌ స్టేషన్‌లో 4 టికెట్‌ కౌంటర్లు, 2 టికెట్‌ వెండిగ్‌ మిషన్లను అందబాటులో ఉంచారు. స్టేషన్‌, స్ట్రీట్‌ లెవల్లో అదనపు సిబ్బందిని, సెక్యూరిటీని నియమించి భక్తులకు సూచనలందించారు.

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
- హోంమంత్రి మహమూద్‌ అలీ
- ఇరువర్గాలు సంయమనం పాటించాలి
మొహర్రం సంతాప దినాలతోపాటు గణేష్‌ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఆదివారం డబీర్‌పురాలోని బీబీకా ఆలంను సందర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మొహర్రం సంతాప దినాలతోపాటు గణేష్‌ నిమజ్జనానికి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని తెలిపారు. మంగళవారం మొహర్రం సంతాప దినాల్లోని పదో రోజున నిర్వహించే మొహర్రం సంతాప ర్యాలీ నిర్వహణతోపాటు ర్యా లీ నిర్వహించే ప్రాంతాల్లోనూ తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొహర్రం ర్యాలీలో పాల్గొనే ఏనుగును కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తెప్పించామని వెల్లడించారు. ఏనుగుకు తగిన తర్ఫీదును అందించి ర్యాలీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసా గే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనం రోజున సాగే ప్రధాన ఊరేగింపులో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 40వేల విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఊరేగింపు కొనసాగే ప్రధాన మార్గంతోపాటు ఇతర సున్నితప్రాంతాల్లో సాయుధ బలగాల మోహరింపుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ర్యాలీని పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర ప్రత్యేక బలగాలను బందోబస్తు కోసం వినియోగిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. అందరూ కలిసికట్టుగా పండుగలను నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయ ర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...