పీసీబీలో బదిలీలకు రంగం సిద్ధం


Mon,September 9, 2019 01:17 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో బదిలీలకు రంగం సిద్ధమైంది. పలువురు పర్యావరణ ఇంజినీర్ల స్థానచలనానికి కసరత్తు మొదలైనది. దీంతో ప్రాధాన్యత గల స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనగా, అప్రాధాన్య పోస్టులవైపు చూసేవారు కరువయ్యారు. ఆశావహులు పోటీపడుతుండటంతో పీసీబీలో బదిలీల ప్రక్రియ హాట్‌ టాపిక్‌గా మారింది. కొందరు తమకున్న పరిచయాలతో వైరవీలు చేసుకుంటుండగా, ఒకే స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో పర్యావరణ ఇంజినీర్‌ (ఈఈ) అంటే చాలా కీలకమైన పోస్టు. ప్రాంతీయ కార్యాలయాలను (ఆర్‌వో) పాలించే ఈ పోస్టు అత్యంత ప్రాధాన్యత గలది. ఈ స్థానం కోసం కొంత మంది పోటీపడుతుండటంతో రసవత్తరంగా మారింది. వాస్తవికంగా పీసీబీలో మూడేండ్లు దాటితే బదిలీచేయడం అనవాయితీగా వస్తున్నది. కాని కొంత మంది ఐదేండ్లు, మరికొందరు మూడేండ్లకు పైగా ప్రాంతీయ కార్యాలయాల్లో కొనసాగుతున్నారు. తాజాగా ఇటీవలే ముగ్గురు అసిస్టెంట్‌ పర్యావరణ ఇంజినీర్లకు పదోన్నతి కల్పించి పర్యావరణ ఇంజినీర్లుగా అవకాశమిచ్చారు. వీరికి పోస్టింగ్స్‌ ఇవ్వాల్సి ఉండటంతో ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వాలన్నది కీలకాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆర్‌వోలుగా కొనసాగుతున్న వారు అక్కడ కొనసాగడానికి అయిష్టత చూపుతున్నారు. ఇటీవల మమ్మల్ని బదిలీచేయాలంటూ ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బదిలీలు తప్పనిసరి అయ్యింది. దీంతో బోర్డు ఉన్నతాధికారులు బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.
గ్రేటర్‌ శివారు స్థానాలకే పోటీ..
తెలంగాణలో పీసీబీకి 10 ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. వీటికి ఒక్కో పర్యావరణ ఇంజినీర్‌ నేతృత్వం వహిస్తారు. ఇలా 10 మందితో పాటు బోర్డు ప్రధాన కార్యాలయంలో ఆరుగురు పర్యావరణ ఇంజినీర్లు ఉంటారు. అయితే ప్రధాన కార్యాలయంతో పాటు కొన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసేందుకు ముందుకురావడం లేదు. దీంతో గ్రేటర్‌ శివారులోని కొన్ని స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. బోర్డ్‌లో లోకల్‌ పోస్టులుగా భావిస్తున్న సంగారెడ్డి -1, సంగారెడ్డి -2, రంగారెడ్డి -2, రంగారెడ్డి -1, నల్గొండ, హైదరాబాద్‌, ఆర్‌వోల్లో ఈఈలుగా వెళ్లేందుకు అత్యధికులు పోటీపడుతున్నారు. ఇక నిజామాబాద్‌, రామగుండం, వరంగల్‌, కొత్తగూడెం ఆర్‌వోలుగా వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని జోరుగా ప్రచారం సాగుతున్నది.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...