అప్రమత్తతే శ్రీరామ రక్ష


Sun,September 8, 2019 12:56 AM

-సైబర్ నేరగాళ్ల తీయటి మాటలకు మోసపోవద్దు
-లాటరీలు, గిఫ్టులు అంటే అనుమానించాల్సిందే
-ఎవరికీ మన బ్యాంకు వివరాలు ఇవ్వొద్దు

లాటరీ టికెట్ కొనుగోలు చేయకున్నా..
ఫోన్‌కు వచ్చిన లాటరీలో 5 వేల పౌండ్లు గెలిచారంటే హైదరాబాద్‌కు చెందిన చైతన్య నిజమేనా , అదృష్టం నా తలుపు తట్టిందని సంతోషించాడు. మెసేజ్‌లో వచ్చిన ఫోన్‌కు మాట్లాడి 8 లక్షల చెల్లించాడు. లాటరీ ప్రైజ్ మనీ ఇంకా రావడం లేదని కండ్ల కాయలు కాసేలా ఎదురు చూశాడు .ఇక్కడ చైతన్య 8 లక్షలు చెల్లించే ముందు స్నేహితులు, ఇంట్లో వారితో మాట్లాడి ఉంటే 8 లక్షలు అతడి వద్ద ఉండేవి.

పెండ్లి చేసుకుందాం..రా!!
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ లెక్చరర్ మ్యాట్రిమొనిలో పెండ్లి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆమెకు లండన్‌లో డాక్టర్‌నంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ ప్రొఫైల్ నచ్చింది. నేను మిమ్మల్ని పెండ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. తనకు చాలా డబ్బు ఉందని, లండన్‌లో ఆసుపత్రి ఉందని, తాను భారతదేశంలో స్థిరపడుదామని మెయిల్ చేశాడు. లెక్చరర్‌కు అతడి ప్రొఫైల్ నచ్చడంతో ఓకే అంది. అంతే ఇక మరుసటి రోజు నుంచి వాట్సాప్ కాల్స్, చాటింగ్‌లకు దిగాడు. మూడు నెలల పాటు ఇది కొనసాగింది. నేను ఇండియాకు వచ్చేస్తున్నాను దాదాపు మన దేశీయ కరెన్సీలో 60 కోట్ల రూపాయలు తీసుకువస్తున్నానని చెప్పాడు. అకస్మాత్తుగా ఓ రోజు ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్‌ను మాట్లాడుతున్నాను మీ ఫ్రెండ్ ఇండియన్ కరెన్సీ విలువ చేసే 60 కోట్ల రూపాయలకు సంబంధించిన పౌండ్స్ తీసుకువచ్చాడని, మీ కోసమే నని చెబుతున్నాడు. కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్టు చేయాల్సి ఉంటుందని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత లెక్చరర్ ఫ్రెండ్ మాట్లాడి నా దగ్గ ఇండియన్ కరెన్సీ లేదు కొంత పంపిస్తే వదిలేస్తారని వివరించాడు. దీంతో లెక్చరర్ పలు దఫాల్లో 12 లక్షల రూపాయలు వివిధ ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఇక్కడ అంతా కరెన్సీ లండన్ నుంచి ఎలా తీసుకువచ్చాడు. ఆ లండన్ పౌండ్స్ ఇక్కడ చట్టబద్ధంగా అంత పెద్ద మొత్తంలో ఎలా బదిలీ చేస్తాడు. కస్టమ్స్ అధికారులు లంచం తీసుకొని ఎందుకు వదిలేస్తారు. అని ఆలోచించి ఉంటే..12 లక్షలు మిగిలేవి.

ఫొటోలు చూసి మోసపోవద్దు..
-ఫొటోలు చూసి మురిసిపోకుండా నేరుగా కలిసి పెండ్లి సంబంధాల విషయం మాట్లాడుకోవాలి. -విదేశీ మొబైల్ నంబర్స్‌ను బట్టి వరుడు నిజంగానే విదేశాల్లో ఉంటాడని నమ్మొద్దు. అక్కడ తెలిసిన వారు ఉంటే వారితో వివరాలను సేకరించుకోవాలి.
-విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీతో పట్టు బడ్డానని ఫోన్ చేస్తే అసలు నమ్మొద్దు.
-కేవలం చాటింగ్‌లతోనే బోల్తాపడొద్దు...అత్యవసరం అని డబ్బు అడగగానే వెంటనే వేయొద్దు.
-డబ్బు పంపమని అడిగినప్పుడు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడండి, స్నేహితులకు తెలపండి. వారి సూచనలు,సలహాలు తీసుకోండి. ఊరికే డబ్బులు ఇవ్వరు..


-లాటరీ పేరుతో కాల్ వస్తే అది చీటింగ్‌గా అనుమానించాలి
-కోకకోలా, కౌన్‌బనేగా కరోడ్‌పతి, పేటీఎం, పెప్సీకోలా పేర్లతో లాటరీలంటూ కోట్లు గెలిచారని వచ్చే ఫోన్‌లకు స్పందించవద్దు. అది నకిలీ లాటరీలుగా గుర్తించాలి.
-లాటరీలు అంటూ ఫోన్ చేసే వారికి డబ్బులు పంపించవద్దు.
-లాటరీ అనగానే మొదటగా మీరు ఏదైనా టికెట్ కొన్నారా....మన దేశంలో అసలు లాటరీ వ్యవస్థ, వాటికి కోట్లాది రూపాయల బహుమతులు ఉన్నాయా అని తెలుసుకోవాలి.
మిలటరీ దుస్తుల్లో ఫొటోలు.. ఒఎల్‌ఎక్స్‌లో వస్తువులు
ఇప్పుడు ఓఎల్‌ఎక్స్‌లో కార్లు, బైక్‌లు, ఫోన్‌లు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నామని కొందరు...కొంటామని ఆర్మీ దుస్తులు, సీఆర్పీఎఫ్ దుస్తుల్లో ఉండే వ్యక్తుల ఫొటోలతో మోసం చేస్తున్నారు. ఈ విధంగానే హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డి రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనం తక్కువ ధరకు ఉందని, మిలటరీ అధికారి బదిలీపై వెళ్తున్నాడు కదా అని కొనడానికి సిద్ధమయ్యాడు. రూ 1.35 లక్షలు అతడు సూచించిన ఖాతాలో జమ చేశాడు.
వాహనం ఎక్కడ ఉందని అడిగితే బదిలీపై యూపీకి వచ్చానని వాహనం ఎయిర్‌పోర్టులో పెట్టానని చెప్పాడు. ఎయిర్‌పోర్టులో బైక్ ఎందుకు పెట్టి ఉంటాడు. ఒక సారి ఆలోచించి ఉంటే మోసపోయేవాడు కాదు. ఇప్పుడు ఓఎల్‌ఎక్స్‌లో అన్ని మోసాలు ఇలానే జరుగుతున్నాయి.
బదిలీలంటూ మోసాలు
-ఆర్మీ దుస్తుల్లో ఫొటోలు పెట్టి విక్రయాలు, కొనుగోలు అంటే అసలు నమ్మకండి.
-కచ్చితంగా వాహనాన్ని ప్రత్యక్షంగా చూడండి.
-వాహనం చూడందే డబ్బులు చెల్లించవద్దు.
-పత్రాలను చూసి, యజమానిని ప్రత్యక్షంగా కలిసిన తర్వాతనే కోనుగోలుకు సిద్ధం కావాలి.
-పరిశీలించకుండా ఎవరికీ నగదును ఇవ్వొద్దు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...