సాయంత్రం సేవలు


Sat,September 7, 2019 03:11 AM

-రోజూ 2వేల నుంచి 2500 వరకు పేషెంట్లు
-ఇబ్బందులు కలుగకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు
-అదనపు కౌంటర్లు ఏర్పాట్లు, అదనపు డాక్టర్ల నియామకం
-మందులకు కొరత లేకుండా చర్యలు
-ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపీ, టెస్టులు

అంబర్‌పేట, నమస్తే తెలంగాణ: జ్వరాలతో బాధపడుతున్న రోగులతో నల్లకుంట ఫీవర్ దవాఖాన కిక్కిరిసిపోతున్నది. నిత్యం వేల సంఖ్యలో రోగులు దవాఖానకు తరలివస్తుండడంతో రద్దీ ఏర్పడుతున్నది. ఉదయం ఆరు గంటలకే రోగులు దవాఖానకొచ్చి లైను కడుతున్నారు. నెల రోజులుగా రోగుల రద్దీ కొనసాగుతున్నది. ఇందులో ఆగస్టు 23వ తేదీ నుంచి రద్దీ అధికమైంది. ఒక్క ఆగస్టులోనే 51,117మంది రోగులు ఔట్ పేషంట్లుగా చికిత్స పొందారు. ఇందులో వైరల్ జ్వరాలు 751, సాధారణ జ్వరాలు 113కాగా, డెంగీ 48, మలేరియా 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే నిత్యం 1200లోపు ఉండే ఓపీ అమాంతం 2500లకు పెరిగింది.

దీంతో దవాఖానపై భారంపడింది. కౌంటర్లు తక్కువ ఉండటం, వైద్య పరీక్షల దగ్గర, రిజిస్ట్రేషన్ దగ్గర, డాక్టర్ దగ్గర బాగా ఆలస్యమవుతుండడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మణిక్‌రాజ్, డీఎంఈ రమేష్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటి దవాఖానను సందర్శించిన రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్‌తో ఆలోచనలు చేసి అదనంగా కౌంటర్లు, డాక్టర్లను పెంచితే బాగుంటుందని నిర్ణయించారు. ఎక్కడ ఈ కౌంటర్లను పెడితే బాగుంటుందని ఆలోచన చేసి లెక్చర్ హాల్, లైబ్రరీ భవనంలలో వీటిని ఏర్పాటు చేస్తే రద్దీ తగ్గి రోజులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావించి అక్కడ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

రోగులకు ఇబ్బందులు కలుగకుండా...
-అదనపు ఓపీ కౌంటర్లను పెంచారు. రెగ్యులర్ ఓపీ వద్ద రద్దీ ఉండి రిజిస్ట్రేషన్‌కు రెండు, మూడు గంటలకు, డాక్టర్ దగ్గర కు వెళ్లేందుకు మరో రెండు గంటలు పట్టేది. పురుషులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు అంతా ఒకటే లైన్‌లో వెళ్లేవారు. ఇప్పుడు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ ఓపీ భవనంలో కేవలం పురుషలకు మాత్రమే కౌంటర్లు పెట్టి, లెక్చర్‌హాల్‌లో మహిళలు, పిల్లలకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.
-రిజిస్ట్రేషన్‌ను కూడా కౌంటర్ల దగ్గరే ఏర్పాటు చేశారు. అక్కడే కంప్యూటర్ ఆపరేటర్ ఓపీ స్లిప్‌ను అందించిన వెంటనే డాక్టర్‌కు చూయించుకునే సౌకర్యం పెట్టారు. అరగంటలోపే పేషంటు డాక్టర్‌కు చూపించుకొని బయటకు వెళ్ళవచ్చును.
-లెక్చర్‌హాల్‌లో మహిళలకే ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టారు. లెక్చర్‌హాల్‌ను ఆనుకొని లోపల ఉండే గదిలో చిన్నారులకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రోగులకు ఇబ్బందులు కలుగకుండా కుర్చీలు ఏర్పాటు చేశారు.
-రివ్యూ అంటే ఒకసారి చూయించుకున్న తర్వాత మళ్లీ వచ్చే పేషంట్లకు కూడా ప్రత్యేకంగా లైబ్రరీ భవనంలో కౌంటర్లను ఏర్పటు చేశారు. సుమారు రోజు వీరిసంఖ్య 200 నుంచి 400 వరకు ఉంటుంది. ప్రస్తుతం వీరంతా ప్రత్యేక కౌంటర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడే ఉండే డాక్టర్లకు చూయించుకుంటున్నారు.
-ఉస్మానియా, నిలోఫర్, గాంధీ దవాఖానల నుంచి అదనంగా 15 నుంచి 20 మంది డాక్టర్లను రప్పించారు. వీరంతా క్వాలిఫైడ్ డాక్టర్లు. మరో నలుగురు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా వచ్చారు.
-రోగులకు ల్యాబ్ పరీక్షలు చేసేందుకు రెగ్యులర్ పరీక్షల కేంద్రంతోపాటు నేరుగా ల్యాబ్‌లోనే రక్త నమూనాలు, ఇతర నమూనాలు తీసుకుంటున్నారు. అదనంగా ఈ సౌకర్యం కల్పించారు.
-ఫాథాలజీ ల్యాబ్‌లో అదనపు సిబ్బందిని పెంచుతున్నారు.
-ఫార్మసీలో కూడా మందులు ఇవ్వడానికి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
-రోగుల రద్దీకి సరిపోను మందులు అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైతే హెచ్‌డీఎస్ ఫండ్ నుంచి అవసరమైన మందులు కొనుగోలు చేయమని ప్రభుత్వం సూపరింటెండెంట్‌కు ఆదేశాలు ఇచ్చారు.
-దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బంది కలుగకుండా సెక్యూరిటీ సిబ్బంది చూస్తున్నారు. పార్కింగ్‌ను క్రమబద్దీకరించి ఒకచోట పేషంట్లకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
-ఓపీని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఆదివారం కూడా ఓపీని పెట్టారు. ఓపీతోపాటు రోగికి అవసరమైన టెస్టులు కూడా చేస్తున్నారు. ఫార్మసీ పని చేస్తున్నది. మందులు ఇస్తున్నారు.
-డెంగీ, మలేరియాతోపాటు అన్ని పరీక్షలను ఉచితంగానే చేస్తున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...