రవాణా శాఖ పరిధిలోకి ఉబర్, ఓలా క్యాబ్‌లు


Sat,August 24, 2019 03:11 AM

-ఎడాపెడా చార్జీలకు ముకుతాడు పడే అవకాశం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇప్పటివరకు ఎటువంటి నియంత్రణ లేకుండా నడుస్తున్న క్యాబ్‌లకు రవాణాశాఖ ముకుతాడు వేయనుంది. ఉబర్, ఓలా వంటి క్యాబ్ సేవలను రవాణాశాఖ పరిధిలోకి తేనున్నారు. వీటిని నడుపాలంటే రవాణాశాఖ నుంచి ఆపరేటర్లు లైసెన్సు పొందాల్సి ఉంటుంది. కొత్తగా తెస్తున్న రవాణాశాఖ చట్ట సవరణల్లో ఈ విషయాన్ని పొందు పరిచారు. క్యాబ్ ఓనర్లు మాత్రమే ట్యాక్స్‌ప్లేట్‌పై రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రయాణికులను చేరవేస్తుండేవారు. అయితే క్యాబ్ సమన్వయకర్తలుగా మాత్రమే ఉంటూ చాలా కంపెనీలు క్యాబ్‌లను నడుపుతున్నాయి. వీటిమీద రవాణాశాఖకు ఎటువంటి నియంత్రణ అధికారం లేదు. కొత్తగా తెస్తున్న నిబంధనల ప్రకారం లైసెన్సు పొందాలంటే రవాణాశాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సేవల విషయంలో కూడా హామీ ఇవ్వాల్సి ఉంది. కొత్త మార్గదర్శకాల ప్రకారమే క్యాబ్ సర్వీసులను ఆపరేట్ చేయాలి.


కొత్తగా వచ్చే విధానం వల్ల వినియోగదారులైన ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. నగరంలో దాదాపు 60 వేల క్యాబ్‌లు తిరుగుతుండగా వీటన్నింటినీ ఎన్‌ఫోర్స్ చేయడానికి రవాణాశాఖకు అధికారం ఉంటుంది. ప్రయాణికుల హక్కులకు లేదా సౌకర్యాలకు ఇబ్బందులు ఏర్పడితే తక్షణమే రవాణాశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు తీవ్రత ఆధారంగా చర్యలుంటాయి. అవసరమైతే లైసెన్సును రద్దు చేసే అధికారం కూడా రవాణాశాఖకు ఉంటుంది. దీనివల్ల ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగి ప్రయాణ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నదని రవాణాశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆటో ప్రయాణ చార్జీల మాదిరిగా నియంత్రణ కూడా ఉండే అవకాశముందని తెలిపారు. అంతేగాకుండా ఇష్టారీతిన చార్జీలు వసూలు చేసే పద్ధతికి కూడా కొత్త విధానం వల్ల ఫుల్‌స్టాప్ పడుతుంది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...