ప్రకటనలతో బురిడీ


Mon,August 19, 2019 02:19 AM

-ఓఎల్‌ఎక్స్, క్వికర్ సైట్ల ప్రకటనలతో మోసాలు
-లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు
-ప్రకటనలు చూసి కొందామంటే..ఆర్మీ పేరుతో బోల్తా కొట్టిస్తారు
-రాజస్థాన్ సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కష్టమే..!
-గతంలో పట్టుకునే ప్రయత్నం...విఫలమైన వైనం
-మరోసారి ఆపరేషన్ భరత్‌పురా చేపడుతారా? చేతులెత్తేస్తారా?

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేవలం హైదరాబాద్‌లోనే ఈ పరిస్థితి ఉంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుం ది. కేవలం దక్షణభారతదేశంలోని రాష్ర్టాలపై ఈ సైబర్‌నేరగాళ్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. కనీసం నెలకు దక్షణ భారతదేశం నుంచి 2 వేల వరకు మోసాలు చేస్తున్న ఈ ముఠాలను మాత్రం పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఇక్కడి సైబర్‌నేరగాళ్లు ఆర్మీకార్డును ఉపయోగించి భారీ ఎత్తున్న అమాయకులను మోసం చేస్తున్నారు.

కానిస్టేబుల్‌కు బురిడీ..!

రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన భరత్‌పూర్ సైబర్‌నేరగాళ్లు నగరానికి చెందిన ఒక కానిస్టేబుల్‌ను మోసం చేసిన తీరు ఇలా ఉంది.. వెస్ట్‌జోన్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న శివకోటేశ్వర్‌రావు ఈనెల 5న క్వికర్‌యాప్‌లో సెకెండ్ హ్యాండ్ కారు కొనేందుకు.. అందులో ఉన్న ప్రకటనలను పరిశీలించాడు.. షిప్ట్ డిజైర్ 2015 మోడల్ కారు రూ.1.6 లక్షల ధర నిర్ణయించి.. అందులో యజమాని పేరు జోగర్‌సింగ్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు.. దీంతో శివ ఆ నంబర్‌కు ఫోన్‌చేసి కారు బేరం చేశాడు. అయితే కారు కొనేముందు నీవెవరివో నీకు సంబంధించిన ఐడీ, ప్యాన్ కార్డు ప్రూప్స్ కావాలంటూ విక్రయించే వ్యక్తి కోరడంతో దానికి శివ నిరాకరించాడు. అయితే వాహనాన్ని విక్రయించే వ్యక్తే తాను బెంగళూర్‌లో ఆర్మీలో పనిచేస్తున్నానని నమ్మిస్తూ అందుకు సంబంధించిన ఐడీ కార్డు, క్యాంటిన్ కార్డులను వాట్సాప్‌లో పంపించడంతో కానిస్టేబుల్ అవి నిజమేనని నమ్మి, అమ్మే వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నాడనే నిర్ధారణకు వచ్చాడు. ఆ తర్వాత శివనే జోగర్‌సింగ్‌గా చెప్పుకున్న నకిలీ అర్మీ అధికారికి ఫోన్ చేసి కారు ధరలో ఎదైనా తగ్గుదల ఉందా అంటూ బేరం చేశాడు.

దీంతో చివరకు రూ.1.45లక్షలు కారు కొనేందుకు శివకు, జోగర్‌సింగ్‌కు ఒప్పందం కుదిరింది. అయితే కారు గోడౌన్‌లో ఉందని, దానిని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కొరియర్‌లో పంపిస్తానని, అందుకయ్యే కొరియర్ ఖర్చులు రూ. 13,050 చెల్లించాలంటూ సూచించాడు. దీంతో శివ ఆ డబ్బులు ఆన్‌లైన్‌లో పంపించాడు. ఆ తర్వాత గేట్ పాస్ అంటూ రూ.16,770 జోగర్‌సింగ్ వసూ లు చేశాడు. మీకు కారు ఒక రోజులో ఇంటికి వచ్చేస్తుందని.. కొరియర్ బాయ్ నంబరంటూ ఒక నంబర్‌ను శివకు ఇచ్చాడు.. మరుసటి రోజు కొరియర్ బాయ్ షాహిల్‌కుమార్ పేరుతో ఫోన్ చేశాడు.. ఆర్మీ గోడౌన్స్ నుంచి మీ కారు రిలీజ్ కావాలంటే ముం దుగా రూ.35వేలు చెల్లించాలంటూ సూచించడంతో వాటిని కూడా చెల్లించాడు, అయి తే ఆ డబ్బు తమకు అందలేదంటూ కొరియర్ బాయ్ చెబుతూ.. అయినా కూడా మరో రూ.40వేలు చెల్లించాల్సిందేనని అప్పుడే మీకు కారు డెలివరీ అవుతుందంటూ ఒత్తిడి పెంచడంతో ఆ డబ్బు ను కూడా శివ చెల్లించాడు.. ఇలా మొత్తం రూ.1,45,200 వరకు శివ సైబర్ నేరగాళ్లకు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తూ వెళ్లాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..

పని పడుతారా..? వదిలేస్తారా..?

ఓఎల్‌ఎక్స్‌లో ఆర్మీ అధికారులుగా నమ్మించి వస్తువులను విక్రయిస్తామంటూ నమ్మిస్తూ వందల సంఖ్యలో భరత్‌పూర్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. గతేడాది నెలకు 200 వరకు మోసాలుండగా ఈ ఏడది వాటి సంఖ్య రెట్టింపయింది. గతేడాది డిసెంబర్‌లోనే హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ భరత్‌పురా పేరుతో ఈ సైబర్‌ఛీటర్లను ఎలాగైన పట్టుకోవాలని భారీ స్కెచ్‌తో వెళ్లారు. 30మంది బృందంతో ప్రత్యేక కార్యాచరణతో సైబర్‌క్రైమ్ పోలీసులు అక్కడకు వెళ్లారు. హైదరాబాద్ పోలీసులు ప్లాన్ ప్రకా రం వెళ్లినా.. అక్కడి పోలీసుల నుంచి పూర్తి సహకారం లభించలేదు. హైదరాబాద్ పోలీసులు వెళ్లిన సమయంలోనే రాజస్థాన్‌లో ప్రభుత్వం మారింది, బీజేపీ ప్రభుత్వం నుంచి అధికారం కాంగ్రెస్‌కు మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సమయంలోనే మన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడి పోలీసులు సైతం తాము ఇప్పుడు ఎలాంటి సహకారం అందించలేమని చేతులెత్తేశారు. దీంతో అక్కడకు వెళ్లిన బృందాలు తిరిగి వచ్చేశాయి. అయితే ఇక్కడి సైబర్‌నేరగాళ్లను పట్టుకోవడం కోసం ఎవరు వెళ్లినా అక్కడి పోలీసుల నుంచి అనుకున్న స్థాయిలో ఇతర రాష్ర్టాల పోలీసులకు సహకారం లభించదని హైదరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడకు వెళ్లి నిందితులను పట్టుకుంటారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

చేతులెత్తేస్తే పరిస్థితి..!

ప్రతి నిత్యం పెద్దసంఖ్యలో ఓఎల్‌ఎక్స్, క్వికర్, ఫేస్‌బుక్ ప్రకటనలను చూసి మోసాలకు గురవుతున్న బాధితులు సైబర్‌క్రైమ్ ఠాణాలకు వస్తుండడంతో పోలీసులు కేసులు నమోదు చేయడానికే పరిమితమవుతున్నారు. ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా.. మార్పురావడం లేదని, ప్రజల్లో మార్పు రాకపోవడంతో సైబర్‌నేరగాళ్లు రెట్టింపు మోసాలకు పాల్పడుతున్నారనే భావనలో పోలీసులున్నాయి. దాంతోపాటు ప్రతిరోజు వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, కేసులను నమోదు చేయడానికే ఉన్న సమయం పూర్తవుతుంది, మిగతా కార్యక్రమాలు ఎలా చేయాలనే ధోరణిలో సైబర్‌క్రైమ్ పోలీసులున్నారు. దీంతో ఓఎల్‌ఎక్స్, క్వికర్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ ప్రకటనల వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తూ ఆర్మీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాలను పట్టుకోవడం కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తారా? లేక ఇతర రాష్ర్టాల పోలీసుల మాదిరిగానే మన సైబర్‌క్రైమ్ పోలీసులు కూడా చెతులెత్తేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముఠాలను అణిచివేయాలంటే ఉన్నతస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...