రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం


Mon,August 19, 2019 02:11 AM

- ఐదుగురికి తీవ్ర గాయాలు ..వృద్ధురాలి పరిస్థితి విషమం
- దవాఖానకు తరలింపు
- మైనర్ డ్రైవింగ్‌తోనే ప్రమాదం : బాధితులు
కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ : ఓ మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ అభంశుభం తెలియని బాలుడు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, బాధితుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన చంద్రశేఖర్, సంధ్యకిరణ్‌లు భార్యభర్తలు. వీరికి ఇద్దరు 14 నెలల మాధవ్, మహాదేవ్ కవల పిల్లలు. వీరు గత కొంతకాలంగా కేపీహెచ్‌బీలోని భాగ్యనగర్‌కాలనీ రోడ్డు నం.2లో నివాసముంటున్నారు. కాగా, సంధ్య ఇద్దరు పిల్లలు, తల్లి నాగమణితో కలిసి యాప్రాల్‌లో నివాసముంటున్న బంధువు రజిత ఇంటికి వెళ్లాలని ఆదివారం నిర్ణయించుకున్నది. ఈ క్రమంలోనే కూకట్‌పల్లిలో ఆటోను అద్దెకు తీసుకొని ఈ నలుగురు బయలుదేరారు. బోయిన్‌పల్లిలోని మిలిటరీ డెయిరీఫామ్ రోడ్డు మీదుగా యాప్రాల్ వెళ్లేందుకు లాల్‌బజార్‌వైపు వెళ్తుతున్నారు. ఇంతలోనే ఇందిరానగర్ నుంచి అతివేగంగా రాంగ్‌రూట్‌లో దూసుకువచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో సంధ్య, నాగమణి, ఇద్దరు పిల్లలు మాధవ్, మహాదేవ్‌లతోపాటు ఆటో డ్రైవర్ కొర్ర రాజు(23), ఆటో వెనుక ద్విచక్ర వాహనాలపై వస్తున్న మరో ఇద్దరు వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో చికిత్స నిమిత్తం సుచిత్రలోని ఓ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మహాదేవ్(14 నెలల) మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాగమణి పరిస్థితి విషమంగా ఉందని, సంధ్య, మాధవ్, ఆటో డ్రైవర్ రాజు, ద్విచక్ర వాహనదారుడు రాములు, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. సంధ్య ఇచ్చిన ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు నడుపుతూ.. ప్రమాదానికి కారకుడైన అల్వాల్ మానస సరోవర్ హైట్స్‌కు చెందిన నూరుద్దీన్ కుమారుడు హసన్(16) మైనర్ అని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా కారు నడుపడం వల్లనే తన బాబు చనిపోయాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంధ్య ఫిర్యాదులో పేర్కొంది.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...