వెస్ట్‌జోన్ పరిధిలో బీటీ ప్లాంట్


Mon,August 19, 2019 02:10 AM

-శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జంట జోన్ల అవసరాలు తీర్చేందుకు..
-రహదారుల మరమ్మతులు ఇక వేగవంతం
-రూ.48లక్షలతో చకచకా జరుగుతున్న ఏర్పాట్లు
హైదర్‌నగర్: రహదారుల మరమ్మతుల్లో నెలకుంటున్న జాప్యానికి తెరపడనున్నది. వేలాది వాహనాల రాకపోకలు...వర్షాలకు రహదారులపై ఏర్పడుతున్న గుంతలతో ప్రజలు నానాఅవస్థలు పడుతుండగా... వాటిని సకాలంలో పూడ్చివేసేందుకు అవసరమైన వనరును సేకరించటంలో ఇప్పటివరకూ నెలకొన్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. దూర ప్రాంతాలకు వెళ్లి బీటీమిక్స్ తెచ్చుకునే అవసరం లేకుండా శేరిలింగంపల్లి వెస్ట్‌జోన్ పరిధిలో బీటీ ప్లాంట్ ఏర్పాటువుతున్నది. నగరం మొత్తానికి ఇప్పటివరకూ రహదారులపై గుంతలను పూడ్చే బీటీమిక్సింగ్‌ను చుడీబజార్ నుంచే తీసుకువస్తుండగా... జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ దీప్తిశ్రీనగర్‌లో ఏర్పాటవుతున్న బీటీప్లాంట్‌తో ఆ కష్టాలకు చెక్‌పడనున్నది. మరోవైపు పెద్దమొత్తంలో ఆయా రహదారులపై గుంతలు పడుతుండగా....వాటిని పూడ్చివేసేందుకు తగిన పరిమాణంలో వనరు లేక ఇప్పటివరకూ కొంత ఆలస్యం సైతం చోటుచేసుకుంటున్నది. కొద్దిరోజుల్లో అందుబాటులోకి రాను న్న ఈ ప్లాంట్ శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జంట జోన్ల కష్టాలను తీర్చనున్నది. అవసరమైనంత బీటీ మిక్స్ ఇక్కడి ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేసి ఈ రెండు జోన్ల పరిధిలోని అవసరమైన సర్కిళ్లకు వేగంగా సరఫరా చేస్తారు.

నిర్మాణం కూకట్‌పల్లి జోన్...నిర్వహణ శేరిలింగంపల్లి జోన్‌ది...
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ దీప్తిశ్రీనగర్‌లో ఏర్పాటు కాబోతున్న బీటీ ప్లాంట్ నిర్మాణాన్ని కూకట్‌పల్లి జోన్ చేపట్టనుండగా...నిర్వహణ బాధ్యతలను శేరిలింగంపల్లి జోన్ చూడనున్నది. ఈ రెండు జోన్లలో పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యాన్ని కల్గిస్తున్నది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 1700లకుపైగా రహదారులపై గుంతలు సైతం ఏర్పడ్డాయి. క్షేత్రస్థాయిలో వీటిని గుర్తించి మరమ్మతులకు ఇంజినీరింగ్ విభాగం చేపట్టినప్పటికీ....తగినంత పరిమాణంలో బీటీ మిక్స్ లభించలేదు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లపరిధిలో రహదారుల మరమ్మతులకు నిత్యం 100టన్నుల వరకూ బీటీ మిక్స్ అవసరం ఉంటుందని ఇంజినీరింగ్ విభాగం అధికారుల అంచనా. స్వంతంగా రెండు జోన్లకు కలిపి దీప్తిశ్రీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న బీటీ ప్లాంట్ ద్వారా నిత్యం 400 టన్నుల వరకూ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నాలుగు, కూకట్‌పల్లి జోన్ పరిధిలోని 4 సర్కిళ్లకు ఎంత పరిమాణంలో బీటీమిక్స్ కావాలన్న ఎగుమతి చేయగలిగే సామర్థ్యం ఈ ప్లాం ట్‌కు ఉంటుంది. ఇందుకోసం సుమారు 3 ఎకరాల స్థలాన్ని ప్లాంట్ ఏర్పాటుకు కూకట్‌పల్లి జోన్ అధికారులకు కేటాయించారు. టెండర్ ప్రక్రియ సైతం ముగియగా..మరో 15 రోజుల్లో ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...