హోమియోపతి వైద్యం స్నేహపూర్వకమైనది..


Mon,August 19, 2019 02:08 AM

తార్నాక/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హోమియోపతి వైద్యం భగవంతుడి వలే స్నేహపూర్వకమైన, సాద్వికమైన వైద్యవిధానమని, ఇది కేవలం శరీర తత్వానికే పరిమితం కాకుండా మానసిక విధానానికి కూడా అనుసంధానంగా పనిచేస్తుందని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. తార్నాకలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెమియోపతిక్ ఫిజిషియన్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతిక్ రెండో సదస్సుకు ఆయన ముఖ్యఅథితిగా విచ్చేశారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, ఐఐహెచ్‌పీ అధికార ప్రతినిధులు డాక్టర్ మధు వారణాసి, డాక్టర్ మహేశ్ పగడాల, డాక్టర్ సతీష్ కృష్ణలతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ ఆస్తికులు, నాస్తికులు అనే తేడా లేకుండా భగవంతుడు అందరినీ సమానంగా ఎలా చూస్తాడో అదే విధంగా హోమియోపతి ఔషధం కూడా ఫలితాలనిస్తుందన్నారు. అలోపతి తదితర ఇతర ఔషధాలు వినియోగిస్తున్నప్పటికీ హోమియోపతి ఔషధం వాడవచ్చని, దాని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండకపోవడమే హోమియో గొప్పతనమన్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి మాట్లాడుతూ ఆయుష్ విభాగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఈ క్రమంలోనే అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హోమియోపతి అనేది దేశంలో రెండో అతిపెద్ద వైద్యవిధానమన్నారు. గతంలో హోమియోపతికి రూ.82 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.120 కోట్లకు పైగా కేటాయించి హోమియో వైద్యాన్ని ప్రభు త్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఐఐహెచ్‌పీ అధ్యక్షుడు డా. మహేశ్ పగడాల మాట్లాడుతూ హెచ్‌ఐవీ, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులను హోమియో వైద్యంతో నయం చేయవచ్చన్నారు. డెంగ్యూ వంటి విషజ్వరాలను కేవలం మూడు గంటల్లో నయం చేసే గొప్పతనం హోమియోకు ఉందన్నారు. హోమియోపతి వైద్యవిధానంలో పలు నూతన ఔషధాలను కనిపెట్టిన డా. కేజీకే పేరుపైన ఈనెల 30న ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నట్లు డా.మధువారణాసి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా హోమియోపతి వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

పోటీ ప్రపంచంలో పరుగులు తప్పదు
కొండాపూర్: ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సొంతం చేసుకునే దిశగా ముందుకు సాగినప్పుడే విజయవంతం అవుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని శిల్పకళా వేధికలో నిర్వహించిన అరోర విద్యా సం స్థల స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిత్యం సరికొత్త అంశాలను నేర్చుకుంటూ లక్ష్యాలను ఎంచుకుని ముందుకుసాగాలన్నారు. ఇప్పటి వరకు చదివిన తర్వాత పరీక్షలు ఉండేవని, కానీ ఇకపై పరీక్షల తర్వాతే నేర్చు కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ప్రపంచంతో పాటు పరుగులు తీయాల్సిన అవసరం వచ్చిందని, విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు తెలిపారు. ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న అరోరా విద్యా సంస్థల యాజ మాన్యాన్ని అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ని అందజేశారు. దీంతో పాటుగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అరోర విద్యా సంస్థల ఛైర్మెన్ డాక్టర్ రమేష్ బాబు, శ్యామ్ సుంకర, విద్యా శంకర భారతీ స్వామిజీ, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్లు శ్రీలత, శ్రీకాంత్, అరోర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాధం బులుసు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


పోలీసు కుటుంబాల
ఆత్మీయ సమ్మేళనం
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 18 : పోలీసు యూనిఫాం అంటేనే కఠినశ్రమ, క్రమశిక్షణతో కూడుకున్నదని, అందుకే ఎంత కష్టమైనా విధులు నిర్వర్తిస్తుంటారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. అలాంటి క్రమశిక్షణ పోలీసు కుటుంబాల్లో కూడా రావాలని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్ కూడా సాధించాల్సిన అవసరముందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంజనీకుమార్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థకు ప్రస్తుతం చాలా తేడా ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు వ్యవస్థలో ఎంతో మార్పురావడం శుభపరిణామమన్నారు. నగర పోలీసులకు దేశవ్యాప్తంగా మం చి పేరు వచ్చిందని, ఈ ఘనత అంతా పోలీసు కుటుంబాలకు దక్కుతుందని పేర్కొన్నారు. నగర జనాభా కోటికి పైగా దాటిందని, ఇంత మందికి నగర పోలీసులకు భద్రత విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూడడం గొప్ప విషయమన్నారు. దేశంలోని పెద్ద నగరాల్లో పోటీ నెలకొందని, వాటిని దాటుకుని హైదరాబాద్ ప్రపంచంలోని పెద్ద కంపెనీలకు ద్వారాలు తెరిచిందన్నారు. గూగుల్, ఫేస్‌బుక్, వాల్‌మార్ట్, అమెజాన్ లాంటి అత్యుత్తమ కంపెనీలు రాజధాని కేంద్రంగా నెలకొల్పడం అమోఘమన్నారు. దీనికి అంతటికీ కారణం భద్రతాపరంగా నగరం అత్యుత్తమ స్థాయిలో ఉండడమేనన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లో తెల్ల గులాబీ మొక్కను, ఆయన సతీమణి వసుంధర జామ మొక్కను నాటారు. అనంతరం పోలీసుల చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ గోవింద్‌రెడ్డి, కాచిగూడ ఏసీపీ సుధాకర్, ఓయూ సీఐ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...