వినియోగదారుల్లో చైతన్యం వస్తేనే.. హక్కులకు రక్షణ


Sun,August 18, 2019 12:22 AM

ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 17 : వినియోగదారుల్లో చైతన్యం వస్తేనే వారి హక్కులకు రక్షణ కల్పించవచ్చని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల కమిషనర్ అకున్ సభర్వాల్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో వినియోగదారుల పరిరక్షణ చట్టం - 2019పై జాతీయ సదస్సు నిర్వహించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్సూమర్ ఆర్గనైజేషన్ (క్యాట్‌కో) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అకున్ సభర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సినీతారలు ప్రచారం చేస్తే ఉత్పత్తిలో లోపం ఉంటే ప్రచారకర్తలపై కూడా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు యువతను మరింత ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వినియోగదారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ మాట్లాడుతూ నూతన చట్టంలో ఉన్న లోపాలపై చర్చించారు. నూతన చట్టం ప్రకారం సుమోటోగా కేసులను స్వీకరించే అధికారం వినియోగదారుల కమిషన్‌కు లేదని చెప్పారు. వినియోగదారుల జిల్లా ఫోరం, రాష్ట్ర కమిషన్‌లలో ఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫోరం, కమిషన్‌లలో దాదాపు మూడు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ప్రతివాదులు అప్పీలు చేసుకునేందుకు యాభై శాతం జరిమానా చెల్లించాలని ఉందని, దీనిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, లా ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ పంతునాయక్, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, కో కన్వీనర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాధికాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...