వినాయక చవితికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి


Sun,August 18, 2019 12:20 AM

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : సెప్టెంబర్ 2న వినాయక చవితి, 12న నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో, ఉత్సవ కమిటీ సభ్యులతో గణేశ్ ఉత్సవాల, నిమజ్జన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి సెప్టెంబర్ 2న, వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 12న నిర్వహించడం జరుగుతుందన్నారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాటు నుండి నిమజ్జనం పూర్తయ్యేవరకు జిల్లా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వినాయకులను తరలించేందుకు సరియైన వాహనాలను సమకూర్చాలని, అనుమతించాలని ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో 24గంటల విద్యుత్ సరఫరా చేయాలని, అత్యవసర పరిస్థితులకు జనరేటర్లను ఏర్పాటు చేసుకోలని విద్యుత్ ఏఈని ఆదేశించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో జరుగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాలలో చెరువులు, కుంటల వద్ద బారీ కేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. బాలాపూర్, సరూర్‌నగర్ చెరువులతో పాటు ఇతర నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద గజ ఈత గాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖాధికారిని ఆదేశించారు. శానిటేషన్, తాగునీటి సౌకర్యం, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల వద్ద క్రేన్ల సౌకర్యం కల్పించాలన్నారు. బారికేడ్లు, ప్రాథమిక చికిత్స, అంబులెన్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూం, హెల్ప్ డెస్క్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.హరీశ్, డీఆర్‌ఓ ఉషారాణి, అడిషన్ డీసీపీ (ట్రాఫిక్) రాచకొండ ఎండీ తాజుద్దీన్ హమీద్, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కందుకూరు, షాద్‌నగర్ ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ భగవత్‌రావు, ఆర్.శశిధర్, వై.శ్రీధర్, బండి ప్రతాప్ రెడ్డి, బొక్క నర్సింహరెడ్డి, టీఎన్ మురారి, ప్రశాంత్, గిరిధర్, రాజేంద్రప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...