స్వరాష్ట్రంలోనే.. మైనార్టీల అభివృద్ధి


Sun,August 18, 2019 12:19 AM

సైదాబాద్, మాదన్నపేట (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. శనివారం కుర్మగూడ డివిజన్ పరిధిలోని సంతోశ్‌నగర్ చౌరస్తాలో రూ.5 కోట్ల వ్యయంతో ఎమ్మెల్సీ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు మైనార్టీలను విస్మరించారని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలను నెలకొల్పి ఉచితంగా చదువుకోవటానికి అవకాశాలను కల్పించిందన్నారు. అదే విధంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించటానికి రూ.20 లక్షల రుణాలను అందించి ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లిం మైనార్టీల కోసం అనేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడంతో అందులో వేలాది మంది చదువుకుంటున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.

పాతబస్తీలో విద్యావ్యాప్తికి కృషి చేస్తానని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని, చాలామంది చిన్నారులు ఫోన్లకు అంకితమై తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణ విశాలంగా ఉన్నందున ఇదే భవనంపై మరో అంతస్తు వేసి హైస్కూల్, కళాశాలను ఏర్పాటు చేసే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యాకుత్‌పురా ఎమ్మెల్యే పాషాఖాద్రీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి జరుగలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ జాఫ్రీ, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట నర్సమ్మ, సైదాబాద్ తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, మండల ఉప విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సామ స్వప్న సుందర్ రెడ్డి, తీగల సునరితారెడ్డి, సమీనాబేగం, ముజఫర్ ఖాన్, గ్రేటర్ టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజంఅలీ, యాకుత్‌పురా నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సామ సుందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు దర్శనం నర్సింగ్‌రావు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...