కోర్టుకెక్కిన కోతుల తంటా !


Sun,August 18, 2019 12:16 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కోతుల బెడద నుంచి రక్షించుకునేందుకు పలువురు అపార్ట్‌మెంట్ వాసులు ఏర్పాటుచేసుకున్న ఇనుప గ్రిల్స్ వివాదానికి దారితీసింది. గ్రిల్స్ తొలిగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీచేయడంతో హైదరాబాద్ న్యూబోయిగూడలోని ఎంఎన్కే విటల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్‌మెంట్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. కోతులను అరికట్టాలని తాముచేసిన విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోదని పేర్కొన్నారు. నోటీసులను రద్దుచేయాలని, కోతుల బాధ నుంచి విముక్తి కలిగించాలని బాధితులు వేర్వేరు పిటిషన్లు దాఖలుచేశారు. పద్మారావునగర్, బోయిగూడ ప్రాంతాల్లో ఖాళీ ప్రాంతంలో నివాసముంటున్న కోతులు నిత్యం తమ ఇండ్లపై దాడిచేస్తున్నాయని ఎంఎన్కే విటల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్‌మెంట్‌లోని కొంతమంది ఫ్లాట్ యజమానులు గ్రిల్స్ ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్లాన్‌కు విరుద్ధంగా గ్రిల్స్ ఏర్పాటుచేశారని అపార్ట్‌మెంట్ యాజమాన్య కమిటీ.. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. గ్రిల్స్ ఏర్పాటుచేసిన యజమానులకు అధికారులు నోటీసులు జారీచేశారు. దీనిపై కోతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత ఫ్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. జీహెచ్‌ఎంసీ నోటీసులను కొట్టేయాలని విజ్ఞప్తిచేశారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. మరోవైపు, కోతులను అరికట్టాలని వేసిన పిటిషన్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా దాఖలుచేయాలని సూచించింది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...