382 చెరువుల్లో 74లక్షల చేపపిల్లలు


Sat,August 17, 2019 04:46 AM

-ప్రణాళికలు రూపొందించిన జిల్లా మత్స్యశాఖ అధికారులు
-12 చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు
-ఇప్పటివరకు 1.50లక్షల చేప పిల్లలను వదిలిన అధికారులు

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా పరిధిలో మొత్తం 540వరకు చెరువులున్నప్పటికీ ఇందు లో సుమారు 382 చెరువుల్లో 74లక్షల చేప పిల్లలను వదిలేందుకు మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటి వరకు 12 చెరువుల్లో మాత్రమే పూర్తిస్థాయిలో నీరు వచ్చిందని, సుమారు 1.50లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ.రెడ్డి తెలిపారు. గతంలో కేవలం డిపార్ట్‌మెంట్ చెరువుల్లో మాత్రమే చేప పిల్లలను వదిలేవాళ్లమని, అయితే ఈ దఫా చేపలను పెంచేందుకు అనువుగా ఉన్న చెరువులన్నింటిలో చేప పిల్లలను వదిలాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు 382 చెరువుల్లోనూ చేపలను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కిందటేడాది 90 చెరువుల్లో 35 లక్షల చేప పిల్లలను వదలాలని నిర్ణయించినప్పటికీ పూర్తిస్థాయిలో చెరువులు నిండని కారణంగా కేవలం 64 చెరువుల్లో 22 లక్షల చేప పిల్లలను వదిలామన్నారు. ఈ ఏడాది కూ డా పూర్తిస్థాయిలో నీరు నిండిన చెరువులన్నింటిలోనూ చేప పిల్లలను వదులుతామని ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంట్ చెరువులు 52 ఉన్నప్పటికీ ఇందు లో కేవలం 38 చెరువులు మాత్రమే చేప పిల్లలను పెంచేందుకు అనువుగా ఉన్నాయని, మిగిలిన చెరువులు పూర్తిగా కలుషిత నీటితో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

చేపల చెరువులకు ఆర్థిక సాయం..
కేవలం మత్స్య కార్మికులే కాకుండా జిల్లాలో 2.20 ఎకరాల భూమితోపాటు సమృద్ధిగా నీటి వసతి (వరద, చెరువు కాలువ, సొంత బోరుబావి) ఉన్న అర్హులైన రైతులకు చేపల చెరువులను తొవ్వుకునేందుకు, చేప పిల్లలను, వాటికి ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 50శాతం సబ్సిడీతో రూ.6లక్షల ఆర్థిక సాయాన్ని ఇస్తుందని, చేప పిల్లలను, చేపలను భద్రపర్చేందుకు వినియోగించే ఐస్ బాక్సులను కొనుగోలు చేసేందుకు 50శాతం సబ్సిడీ రుణాలను ఇస్తున్నది. మత్స్యమిత్ర గ్రూపుల సభ్యులకు కూడా రుణాలను జారీ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుంది. ఆర్‌కేవీవై పథకం కిందఫిష్ మార్కెట్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చును. అలాగే సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ఈ ఏడాది రూ.5.6 కోట్ల వ్యయంతో మత్స్యకారులకు 75శాతం సబ్సిడీపై 472మోపెడ్‌లు, 43 లగేజీ ఆటోలు, 9సంచార చేపల వాహనాలు, 46వలలు వంటివి అందించామని, మహిళా మత్స్యకారులకు 11 యూనిట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మత్స్యకారులతోపాటు చిన్న, సన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ.రెడ్డి తెలిపారు.

మత్స్యశాఖ కుటుంబాలకు చక్కటి ఉపాధి : మంత్రి
కీసర : తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ కింద చెరువుల్లో చేపపిల్లల ద్వారా వారి కుటుంబాల్లో ఉపాధి నింపుతున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని కీసర మండల కేంద్రంలోని పెద్దమ్మ చెరువులో మొదటి విడుత కింద శుక్రవారం 45వేల చేప పిల్లలను వేశారు.జిల్లా పరిషత్ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, కీసర సర్పంచ్ మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ నారాయణశర్మ, సర్పంచ్ ఆకటి మహేందర్‌రెడ్డి, కీసర మత్స్యశాఖ అధ్యక్షుడు ఆనబోయిన జంగయ్య, సంఘం నాయకులు గంగదారి భిక్షపతి పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...