అబ్బురపరిచిన ఆవిష్కరణలు


Fri,August 16, 2019 01:29 AM

-l5 పైసలకే యూనిట్ విద్యుత్, హరిత ఇస్త్రీ పెట్టె
- ఇంటింటా ఇన్నోవేటర్‌లో ఆకట్టుకున్న ఎగ్జిబిట్లు
-ఆవిష్కర్తలకు ప్రశంసాపత్రాలు అందజేసిన హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్

5 పైసలకే యూనిట్ విద్యుత్..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విద్యుత్ లేనిదే దైనందిక జీవనం ముందుకు సాగని పరిస్థితి. నిమిషం పాటు పోయినా.. ఓర్చుకోలేనంతగా విద్యుత్ మన జీవితంతో పెనవేసుకుపోయింది. ఇలాంటి విద్యుత్‌ను చౌకగా అందించే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు నగరానికి చెందిన డా. శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. ైఫ్లెవీల్ పవర్ జనరేషన్ టెక్నాలజీ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిచేసే ప్రాజెక్ట్‌ను ఆయన తయారు చేశారు. నాలుగు బ్యాటరీలు, ఒక డీసీ మెటార్, మరో ఏసీ మెటార్, ైైఫ్లెవీల్‌ను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తిచేసి చూపిస్తున్నాడు. కేవలం 48 వోల్టుల విద్యుత్‌ను పంపించి,ై ప్లెవీల్ టెక్నాలజీ సాయంతో 440 వోల్టుల విద్యుత్‌ను తయారు చేసుకోవచ్చని ఆయన వివరిస్తున్నారు. థర్మల్ విద్యుత్, జల, సోలార్, పవన విద్యుత్ కంటే చౌకగా కేవలం 5 పైసలకే ఒక యూనిట్‌ను అందిచవచ్చని చెబుతున్నారు.

థర్మల్ విద్యుత్‌ను రూ. 3.70, సోలార్ విద్యుత్‌ను రూ. 2. 70లకు పీపీఏ చేసుకున్నామని, ైఫ్లెవీల్ టెక్నాలజీ విద్యుత్‌ను కేవలం 5 పైసలకే పీపీఏ చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. 1990 నుంచి తాను శ్రమించి క్రమంగా విజయం సాధిస్తూ ఇప్పటి వరకు 200 డిజైన్లను తయారు చేసి చర్లపల్లిలో ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నానన్నారు. ైఫ్లెవీల్‌టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించిందని, దీనిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, కో -ఆపరేటివ్ రంగంలో ప్రోత్సహిస్తే విద్యుత్‌ను ఆదా చేసుకోవడమే కాకుండా, చౌకగా పొందవచ్చని పేర్కొంటున్నారు.

నలుగురికి నచ్చినది..
నాకసలే నచ్చదురో.. నరులెవరు నడవడనిది ఆ రూట్లోనే నడిచెదరో అంటూ ఓ సినిమా పాట.. విభిన్నమైన వ్యక్తిత్వం గలవారి గురించి చెబుతుంది. ఇలా ప్రపంచం కొత్తదనం వెంట పరుగుపెడుతున్నది. నలుదిక్కులా ఎటు చూసినా.. వింతలు విశేషాలు. విభిన్నమైన వ్యక్తుల కలబోతే. నలుగురితో నేను నడిస్తే ఏం లాభం.. సృజనతో తమ మేధస్సుకు పదునుపెట్టి ఆద్భుతమైన ఆవిష్కరణకు అంకురార్పణ చేస్తున్నారు. ఎన్నో అపరిష్కృత సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. ఇలాంటి కొన్ని ఆవిష్కరణలు ఇంటిం టా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా వెలుగులోకి వచ్చాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్, సంయుక్త కలెక్టర్ గుగులోతు రవి సహా ఇతర అధికారులు ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌ను కలియతిరిగిన కలెక్టర్ స్టాల్స్ నిర్వాహకులతో మాట్లాడి.. ఆవిష్కరణల గురించి తెలుసుకొని, వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

హరిత ఇస్త్రీపెట్టె..
ఒకటి నుంచి రెండు జతలంటే ఇంట్లో ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెతో సరిపెట్టుకుంటాం. అంతకంటే ఎక్కువైతే లాండ్రీ షాపునాశ్రయించాల్సిందే. లాండ్రీ షాపుల్లో వాడేది బొగ్గుల ఇస్త్రీపెట్టె . ఒక ఇస్త్రీ పెట్టెకు గరిష్ఠంగా 12 గంటలకు 4 కిలోల బొగ్గు వాడతారు. కిలోకు రూ. 25 పెట్టి బొగ్గులను కొనుక్కోవాల్సిందే. 4 కేజీల బొగ్గులు తయారుకావాలంటే 16 కేజీల కట్టెలు కాల్చాలి. అంటే బొగ్గుల ఇస్త్రీ పెట్టె పర్యావరణానికి హానిచేయడంతో పాటు అధిక వ్యయం కూడా. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా గ్యాస్‌తో నడిచే హరిత ఇస్త్రీ పెట్టెను తయారు చేశాడు నగరంలోని యాప్రాల్‌కు చెందిన కె. లింగబ్రహ్మం. రోజులో 8 గంటలకు కేవలం 500 గ్రామలు గ్యాస్‌తో ఇస్త్రీ చేసుకోవచ్చని, ఇందుకు కేవలం రూ. 35 మాత్రమే ఖర్చవుతుందని, అదే బొగ్గు అయితే కిలోకు రూ. 25 చొప్పున రోజుకు రూ. 100 వెచ్చించాల్సి వస్తుందని లింగ బ్రహ్మం చెబుతున్నాడు. అగ్గిపుల్ల సాయం లేకుండానే, స్విచ్ ఆన్ చేస్తే ఇస్త్రీపెట్టెలో ఉండే ఫిలమెంట్ వెలిగి వేడిని ఉత్పత్తి చేస్తుందని, దీని వల్ల బట్టలు కాలిపోవడం, రంద్రాలు పడటంలాంటి వాటిని అరికట్టవచ్చని ఆయన చెబుతున్నాడు. ఇప్పటికే వాడుతున్న ఇస్త్రీ పెట్టెలను గ్యాస్‌తో నడిచేట్టుగా మార్చలేమని, తాము తయారు చేసిన దాంతోనే వీలవుతుందని ఆయన అంటున్నాడు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...