దీపూ గ్యాంగ్ చిక్కింది..


Thu,August 15, 2019 02:47 AM

-మరోసారి దృష్టి మళ్లించేందుకొచ్చి...
-పోలీసుల వలకు చిక్కారు...
-ప్రధాన సూత్రధారి దీపూతోపాటు మరో ముగ్గురు అరెస్టు
-3 నెలలపాటు నిరంతర నిఘా...
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వనస్థలిపురంలో మూడు నెలలక్రితం పట్టపగలే దృష్టి మళ్లించి రూ.58 లక్షలను ఎత్తుకెళ్లిన రాంజీనగర్ అలియాస్ దీపూగ్యాంగ్‌ను బుధవారం రాచకొండ ఎస్‌ఓటీ, సీసీపోలీసులు అరెస్టు చేశారు. మరోసారి హైదరాబాద్‌లో దృష్టి మళ్లించి దోచుకునేందుకు వచ్చిన ముఠాను ఎల్బీనగర్ ఆటోనగర్ వద్ద కారులో వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వలపన్నీ పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి దీపూతోపాటు మరో ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 7న జరిగిన అటెన్షన్ డైవర్షన్‌లో మొత్తం 14మంది పాల్గొన్నట్లు పట్టుబడినట్లు నిందితుల వాంగ్మూలం ద్వారా తెలిసింది. నేరేడ్‌మెట్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం...మే 7న హైదరాబాద్ వనస్థలిపురంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎమ్ వద్ద రైటర్స్ సేఫ్ గార్డు సంస్థ సిబ్బంది యాక్సిస్‌బ్యాంక్ ఏటీఎమ్‌లో రూ.58 లక్షల నగదును డిపాజిట్ చేసేందుకు సెక్యురిటీగార్డుతో వ్యాన్‌లో వచ్చారు. వచ్చిన వారిలో కొంతమంది నగదును తీసుకుని ఏటీఎమ్ కేంద్రంలోకి వెళ్లగా సెక్యురిటీ గార్డు వ్యాన్‌లో కూర్చోని ఉండగా దీపూ వచ్చి మీ నోట్లు కింద పడ్డాయని దృష్టి మళ్లించగానే సత్యరాజ్ వ్యాన్‌లో నుంచి రూ.58లక్షల నగదు బాక్సును తీసుకుని రోడ్డు దాటాడు.

అతనిని యోగరాజ్, సురేష్‌లు కవర్ చేస్తూ ఎవరు పట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతలో దీపూ రోడ్డు దాటి ఓ ఆటోను ఆపి అందరూ అందులో ఎక్కి ఎల్బీనగర్ వరకు వచ్చి అక్కడి నుంచి మరో ఆటోను తీసుకుని మలక్‌పేట్ వరకు సులభ్ కాంప్లెక్స్ లో బాక్సులో నుంచి రూ.58 లక్షల నగదును తీసుకుని హైదరాబాద్ వైపు వెళ్లిపోయారు. రైటర్స్ గార్డు సంస్థ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. సీపీ మహేష్ భగవత ఆదేశాలతో ఎస్‌ఓటీ, సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ద్వారా ఈ దృష్టి మళ్లించి నగదును దోచుకుంది తమిళనాడు రాంజీనగర్‌కు చెంది దీపూగ్యాంగ్‌గా తేల్చారు. అప్పటి నుంచి వారి కోసం గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. బుధవారం దీపూ, సత్యరాజ్, యోగరాజ్, సురేష్ కలిసి టాటా ఇండికా కారులో 15 కేజీల గంజాయిని తీసుకుని ఎల్బీనగర్ ఆటోనగర్‌కు వచ్చారు. ఈసారి ఏటీఎమ్‌ల వద్ద క్యాష్ వ్యాన్ ఆగగానే దోచుకుందామనే స్కెచ్‌లో ఉండగా పోలీసులు సమాచారం అందుకుని ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముఠా చాలా కరుడుగట్టిందని వెలుగులోకి వచ్చిం ది. ఈ ముఠా నుంచి రూ.4.10 లక్షల నగదు, 15 కేజీల గంజాయి, ఓ కారు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

వనస్థలిపురానికి వచ్చింది 14మంది
దీపూ గ్యాంగ్ ముందస్తు రెక్కీలు లేకుండానే వారు ఏటీఎమ్ కేంద్రాల వద్ద క్యాష్ వ్యాన్ కనపడితే చాలు దృష్టి మళ్లించి దోచుకుంటారు. కనీసం రూ.30 లక్షలు నగదు ఉంటే ఒకే సంఘటనతో ఆపేస్తారు. లేదంటే వరుసగా దృష్టి మళ్లిస్తూ దోచేస్తారు. మే 6వ దీపూగ్యాంగ్ మొత్తం 14మంది కలిసి రాంజీనగర్ నుంచి చన్నై వచ్చి అక్కడి నుంచి ప్రైవేటు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఆటోలలో ఎక్కి ఏటీఎమ్‌ల వద్ద క్యాష్ వ్యాన్‌లు ఉన్న ప్రాంతం కోసం వెదుకుంటూ వచ్చారు. 11 గంటల సమయంలో వనస్థలిపురం పనామా గోడౌన్ వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎమ్ వద్ద క్యాష్ వ్యాన్‌ను చూశారు. వెంటనే అందరూ దిగారు ఇందులో 10మంది కాలకృత్యాలు తీర్చుకునేందుకు అక్కడ ఉన్న సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లారు. మిగతా నలుగురు వ్యాన్‌లో క్యాష్‌ను చూసి దానిని కొట్టేశారు. ఆ తర్వాత ఫోన్‌ల ద్వారా సమాచారం ఇచ్చుకుని గ్యాంగ్ సభ్యులు విడిపోయారు. కొంతమంది కాచిగూడ రైల్వే స్టేషన్, మరికొంత మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మిగిలిన వారు నేరుగా లక్డికాపూల్‌కు వెళ్లి బస్సులో రాంజీనగర్‌కు వెళ్లిపోయారు. వారితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారని తెలుసుకున్న దీపూ రూ.58 లక్షల నగదును తన ఇంట్లో దాచి అందరూ కలిసి ఢిల్లీ, బెంగాల్‌కు పారిపోయారు.

ఈ ముఠాలో 11మంది రాంజీనగర్‌కు చెందిన వారు ఉండగా ముగ్గురు పశ్చిమబెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు. అప్పటినుంచి పోలీసులు 3 నెలల పాటు నిరంతరం నిఘా పెడుతూ చివరకు వారిని మరోసారి రెచ్చిపోయేందుకు వచ్చినప్పుడు ఎల్బీనగర్ ఆటోనగర్‌లో పట్టుకున్నారు. వీరందర్నీ మరోసారి కస్టడీలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయడంతోపాటు పీడీ యాక్ట్‌ను కూడా విధిస్తామని సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో రాంజీనగర్‌లో ఉన్న ముఠాలు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. ఈ కేసు మిస్టరీని చాకచక్యంగా చేధించినందుకు ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, అతని బృందం, సీసీఎస్ టీమ్‌లను ప్రత్యేకంగా అభినందించి పోలీసు కమిషనర్ వారికి రివార్డులను అందించారు. దీంతో వీరి పేర్లను మెరిటోరియస్ అవార్డు కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...