సాగర్‌కు కొత్త కళ..


Wed,August 14, 2019 12:43 AM

-నెక్లెస్ రోడ్‌లో రూ.15కోట్లతో ఎలివేటెడ్ వాక్‌వే పనులకు శ్రీకారం
-ప్రత్యేక ఆకర్షణగా 10 ఎకరాల్లో లేక్‌వ్యూ ఫ్రంట్ పార్కు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చారిత్రక హుస్సేన్‌సాగర్ తీరంలో హెచ్‌ఎండీఏ మరిన్ని కొత్తందాలను పరిచయం చేస్తున్నది. ఎత్తయిన బుద్ధుడు, బుద్ధుడి విగ్రహాన్ని మించి అతిపెద్ద జాతీయాపతాకం..చుట్టూ ఆహ్లాదాన్ని నింపే నందనవనాలు.. వెరసీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవ య్య పార్క్‌లతోపాటు లేజర్ షో..ఇలా దేనికదే ప్రత్యేకతగా ఉండడంతో ఇక్కడికి దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఆయా ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా వచ్చి ఇక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ తరుణంలోనే హుస్సేన్‌సాగర్‌కు మరింత కొత్త సొబగులను సమకూర్చాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. నెక్లెస్‌రోడ్ తీరంలోని జలవిహార్ పక్కనే ఉన్న సంస్థకు సంబంధించిన 10 ఎకరాల్లో ఈ లేక్‌వ్యూ ఫ్రంట్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తొలి విడుతలో రూ.15 కోట్లతో లక్నవరం వంతెన తరహాలో ఎలివేటెడ్ వాక్‌వే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ వంతెనపై నిల్చొని సాగర్ అందాలను ఆస్వాదించేలా ఈ వంతెన అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మూడు నెలల్లోగా ఈ పనులను పూర్తి చేసి ఎలివేటెడ్ వాక్ వేను వినియోగంలోకి తీసుకురానున్నామని ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. కుటుంబసమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు పనులు చేపడుతున్నారు. లక్నవరం తరహాలో వేలాడే వంతెన, లేక్ అందాలన్నీ కనబడే విధంగా లోకేషన్ తీరం, సాగర్ ఒడ్డు న కూర్చుని సేదతీరేలా, అబ్బురపరిచే ప్రవేశ ద్వారం, పాత్‌వేలు, పిల్లలకు కోసం ప్లేగ్రౌండ్, అందాలన్నీ ఆస్వాదించేలా అండర్‌పాస్, వాటర్ థీమ్ పార్కు, అలలపై నిలుచున్నట్లు గ్లాసు డెక్, ఫ్లోర్ స్క్రేప్, ఎలివేటెడ్ వాక్‌వేలు ఇలా ప్రత్యేకతలతో పర్యాటకులకు కనువిందు చేసేలా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. విడుతలవారీగా ఈ పనులను చేపట్టి పర్యాటకులను ఆకట్టుకునే దిశగా హెచ్‌ఎండీఏ చర్య లు చేపడుతుండడం గమనార్హం.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...