అరచేతిలో బటన్ నొక్కితే...వందల ఎకరాల్లో మొక్కలు


Tue,August 13, 2019 01:34 AM

-అడవుల్లో మొక్కల పెంపకానికి అధునాతన టెక్నాలజీ
-మనుషులు వెళ్ల్లలేని అడవుల్లో... డ్రోన్ సాయంతో విత్తనాలు
-ఖర్చు తక్కువ.. మొక్కలు ఎక్కువ
-మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్ల రిజర్వు ఫారెస్ట్‌లోప్రయోగాత్మకంగా అమలు
-నేడు లాల్‌గడి మలక్‌పేట్ రిజర్వు ఫారెస్ట్‌లో ప్రయోగం
-త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి ః జస్ట్ డ్రోన్ రిమోట్ బటన్ నొక్కారు. కాలు పెట్టేందుకు అవకాశం లేని కారడవిలోని వందల ఎకరాల్లో విత్తనా లు చల్లారు. అవి త్వరలోనే మొక్కలుగా ఎదుగనున్నాయి. అవును తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు అడవుల తరుగుదలను నియంత్రిచడంతోపాటు అడవుల్లో నూతన మొక్కలను నాటాలనే సంకల్పంతో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టిన సరికొత్త ప్రయోగానికి మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల రిజర్వు ఫారెస్ట్ వేదికైంది. మనుషులు అడుగుపెట్టలేని అడవుల్లోను నూతన మొక్కలను నాటాలనే లక్ష్యంతో భారీ వృక్షాలకు సంబంధించి విత్తనాలను సోమవారం డ్రోన్ సాయంతో రిజర్వు ఫారెస్ట్‌లోని వందల ఎకరాల్లో చల్లారు. అడవుల్లో చెట్లను మరింత వృద్ధిచేయాలనే సదుద్దేశంతో గతంలో ఎన్నడు వినని, చూడని విధంగా ప్రభుత్వం సంకల్పతరు అనే ఎన్‌జీఓ రాష్ట్ర కోఆర్డీనేటర్ నరేశ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగానికి నాంది పలికామని ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. తొలుత మర్రి, రావి, చింత, వేప విత్తనాలను ఈ విధానంలో చల్లామని మున్ముందు మరిన్ని రకాల మొక్కలను కూడా నాటుతామని అధికారులు పేర్కొంటున్నారు.

ఒక్కసారి నొక్కితే రెండున్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో..
డ్రోన్ బటన్‌ను ఒక్కసారి నొక్కితే సుమారు 500-600 గ్రాముల విత్తనాలు రెండున్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో డ్రోన్ కింది భాగంలోని బాక్సులోంచి విత్తనాలు వెదజల్లినట్లుగా పడతాయని అధికారులు రాజస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ ఆపరేటర్ ఉమేశ్ నమస్తే తెలంగాణకు తెలిపారు. గతంలో ఉత్తరాఖండ్, హిమాలయాల్లో మాత్రమే ఇలాంటి ప్రయోగం చేశామని, అక్కడ సత్ఫలితాలొచ్చాయని, దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా తెలంగాణలో ఈ విధానంలో అడవుల్లో మొక్కలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సాధారణంగా డ్రోన్‌కు కింది భాగంలో కెమెరా ఉంటుందని, అయితే ప్రస్తుతం ఫారెస్ట్‌లో మొక్కలను నాటేందుకు వినియోగిస్తున్న డ్రోన్ కింది భాగంలో సుమా రు 8 వందల గ్రాముల విత్తనాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన బాక్సు ఉంటుందని, విత్తనాలను ఈ బాక్సులో వేసి డ్రోన్‌కు సంబంధించిన రిమోట్ నొక్కిన ప్రతిసారి 10-25 గ్రాముల విత్తనాలు చల్లినట్లుగా పడుతాయని తెలిపారు. సుమారు రెండున్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో విత్తనాలను చల్లి డ్రోన్ మళ్లీ యధాస్థానానికి వస్తుందని ఉమేశ్ తెలిపారు.

పశువులు, మేకలు, పక్షుల ఎరువుల్లోంచి విత్తనాలు..
ప్రస్తుతం అడవుల్లో డ్రోన్ సాయంతో చల్లుతున్న విత్తనాలను పశువుల, మేకల, పక్షుల ఎరువుల్లోంచి సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ విత్తనాలను భూమి లోపల పాతకున్నా, కేవలం నేలపై విసిరేసినట్లుగా వేస్తేనే సులభంగా మొలకెత్తుతాయని జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్‌రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి శిరీష తెలిపారు. సాధారణంగా అడవుల్లోల కొన్ని సహజంగా పెరిగితే మరికొన్నింటిని పెట్టి చాలా సంవత్సరాలు కావొస్తుందని, దీంతో పురాతన మొక్కలలో కొన్ని ఎండిపోయాయని తెలిపారు. వీటి స్థానంలో కొత్త మొక్కలను నాటి అడవుల విస్తీర్ణం తగ్గడం సంగతి అలా ఉంచితే మరింత వృద్ధ్ది చేయాలనే ఉద్దేశంతో ఈ విధానంలో మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

నేడు లాల్‌గడి మలక్‌పేట్‌లో..
మేడ్చల్ జిల్లా పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్‌లోని రిజర్వు ఫారెస్ట్‌లో మంగళవారం డ్రోన్‌సాయంతో విత్తనాలను చల్లనున్నట్లు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి శిరీష తెలిపారు. అలాగే కీసర తదితర రిజర్వు ఫారెస్ట్‌ల్లోనూ ఈ విధానంలో మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా మేడ్చల్ జిల్లాలోనే అమలు చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రఘువీర్ తెలిపారు.

ఖర్చు చాలా తక్కువ..
మొక్కలను పెంచాలంటే లక్షలు వెచ్చించి విత్తనాలను కొనుగోలు చేసి వాటిని నర్సరీల్లో సమతూల్యమైన వాతావరణంలో సుమారు 2.5-3 ఫీట్ల ఎత్తు వరకు పెంచి పుట్టింగ్ మిషన్లతో గానీ, మనుషులతో గానీ గోతులు తవ్వి అందులో సారవంతమైన మట్టిని పోసి సేంద్రియ ఎరువులను అడుగుభాగంలో వేసి మొక్కలను నాటుతారు. ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి సుమారు ఆరు నుంచి 10 నెలల సమయం పడుతుందని, అలాగే ఒక్క మొక్కకు సుమారు రూ.5 వందల వరకు ఖర్చు అవుతుందన్నారు. డ్రోన్ సాయంతో విత్తనాలను చల్లితే కేవలం డ్రోన్, విత్తనాల కొనుగోలుకే ఖర్చు అవుతుందని, ఈ విధానం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో చల్లితే సాధారణ వాతావరణ పరిస్థితులకే పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...