నగరంలో గ్రీనరీపై బల్దియా ప్రత్యేక శ్రద్ధ


Sun,August 11, 2019 05:32 AM

-120 కోట్లతో 47థీమ్ పార్కుల అభివృద్ధి
-ఐదు చౌరస్తాలలో సుందరీకరణ పనులు
-17.75 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కులు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరవాసులకు నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక ఎకరం, అంతకన్నా ఎక్కువ వైశాల్యంలోని 47 ఖాళీ స్థలాలను గుర్తించగా, వాటిల్లో వివిధ రకాల థీమ్ పార్కులను ఆభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ. 120 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇవి కాకుండా జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా ఎనిమిది జంక్షన్లలో థీమ్ పార్కుల అభివృద్ధి ఇప్పటికే పూర్తి కాగా, మరో ఎనిమిదిచోట్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి.స్వచ్ఛ హైదరాబాద్ ఇతివృత్తానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించారు. స్వచ్ఛత పార్కులు ఆరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కులు ఆరు, ట్రాఫిక్ సంబంధిత థీమ్-6, చిల్డ్రన్ పార్కులు మూడు, తెలంగాణ కల్చర్-3, వేస్ట్ టూ వండర్స్ ఆఫ్ తెలంగాణ-2, ప్యాట్రియోటిక్ పార్కులు మూడు, యూనివర్సల్ థీమ్-3, టన్నెల్ గార్డెన్-1, డూ సైన్స్ పార్కులు రెండు, టోపియరీ మేజ్ పార్కులు రెండు, రెయిన్ ఫారెస్ట్ థీమ్ పార్కు ఒకటి, వాటర్ థీమ్ పార్కులు రెండు, ఎడ్వంచర్ థీమ్ పార్కులు రెండు కలిపి మొత్తం- 47 పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. స్వచ్ఛ థీమ్ పార్కుల్లో తడి, పొడి చెత్త సేకరణ, సేంద్రీయ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, డంప్‌యార్డ్‌ల క్యాపింగ్ పనులు, సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్‌లో చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలుసుకునే విధంగా ఈ పార్కుల నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గ్రేటర్‌లో ఇప్పటివరకు బాలల కోసం ప్రత్యేకంగా ఉద్యానవనం లేనందున ప్రస్తుతం 47పార్కుల్లో చిల్డ్రన్ థీమ్ పార్కుల నిర్మాణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. ప్రతి పార్కుచుట్టూ వర్షపునీరు నిల్వవుండేలా ప్రత్యేక కందకం ఏర్పాటు చేయాలని, దీనివల్ల భూగర్భజలాలు కూడా పెంపొందే అవకాశం ఉన్నది. పార్కులకు సమీపంలోని ఎస్‌టీపీల ద్వారా వచ్చే నీటిని ఉపయోగించుకునే విధంగా ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. థీమ్ పార్కులను సమీపంలోని పాఠశాలల విద్యార్థులు సందర్శించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై చైతన్యం కలిగించే విధంగా ఈ అంశంపై కూడా ఓ ప్రత్యేక థీమ్‌ను రూపొందించాలని నిశ్చయించారు. ప్రతి పార్కులో స్వచ్ఛత, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తెలిపే ఆడియో, విజువల్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటికి సంబంధించి ప్రస్తుతం డిజైన్లు రూపొందిస్తున్నారు. వారంరోజుల్లో ప్రణాళికలు సిద్ధంచేసి టెండర్ల ప్రక్రియ ద్వారా పనులు కేటాయించాలని నిర్ణయించారు.

పచ్చదనంతో జంక్షన్ల సుందరీకరణ
జంక్షన్ల సుందరీకరణలో భాగంగా తొమ్మిది జంక్షన్లలో పచ్చదనం అభివృద్ధి చేపట్టారు. ఇందులో భాగంగా శిల్పారామం, సుచిత్ర, మెట్టుగూడ, ఎల్బీనగర్ చెక్‌పోస్ట్ (చింతలకుంట చౌరస్తా), లక్డీకాపూల్, ఆరాంఘర్, ఉప్పల్, మూసాపేట్, బుద్ధభవన్ తొమ్మిదిచోట్ల జంక్షన్లలో థీమ్ పార్కుల అభివృద్ధి చేపట్టగా, సుచిత్ర, లక్డీకాపూల్, శిల్పారామం, నల్గొండ చౌరస్తా తదితర నాలుగు జంక్షన్లలో ఇప్పటికే పార్కులను ప్రారంభించారు. చింతలకుంట చౌరస్తాలో పనులు పూర్తికాగా, వారంరోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మెట్టుగూడ, ఆరాంఘర్, ఉప్పల్, మూసాపేట్ తదితర నాలుగుచోట్ల పనులు కొనసాగుతున్నాయి. సుందరీకరణలో భాగంగా స్థానిక జీవన సాంప్రదాయాల థీమ్‌తోకూడిన త్రీడీ చిత్రాల బొమ్మలను ఏర్పాటు చేశారు. చింతలకుంట చౌరస్తాలో రామోజీ ఫిల్మ్‌సిటీ, మహావీర్ హరిత వనస్థలి తదితర థీమ్‌లను ఇందులో పొందుపరిచారు. సుచిత్ర జంక్షన్‌లో హైదరాబాద్ జీవన విధానాన్ని తెలిపేవిధంగా డిజైన్ చేశారు. హైదరాబాద్ నగరం అనగానే గుర్తుకొచ్చే ఇరానీ చాయ్‌ను ప్రతిబింభించేలా ఈ జంక్షన్‌లో ఫౌంటెన్‌ను ఏర్పాటుచేయడం విశేషం.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...