కోఠి ఐఎంఏకు ఘన చరిత్ర


Sun,August 11, 2019 05:17 AM

సుల్తాన్‌బజార్, ఆగస్టు 10 : దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖల్లో అతి పురాతనమైనది కోఠి ఐఎంఏ శాఖ అని, ఆ శాఖలో 80వ వసంతాల వేడుకలకు తాను హాజరుకావడం గర్వంగా ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ శంతనుసేన్ పేర్కొన్నారు. ఈ మేరకు కోఠిలోని ఐఎంఏ హాల్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఐఎంఏ సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1939లో ఐఎంఏ సిటీ శాఖ ప్రారంభించబడిందని, తదనంతరం 1953లో ఐఎంఏ భవనాన్ని నిర్మించిన అనంతరం మొట్టమొదటి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌ను నిర్వహించడం జరిగిందంటే ఈ శాఖకు ఎంత ఘన చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలలో 1731 ఐఎంఏ శాఖలలో కోఠి ఐఎంఏ శాఖ అతి పురాతనంతో పాటు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. గత ఐదేండ్లుగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును రద్దు చేయాలని ఐఎంఏ ప్రధాన కార్యాలయమిచ్చిన పిలుపునకు తెలంగాణ రాష్ట్రంలో ఐఎంఏ రాష్ట్ర శాఖ, నగర శాఖ సమర్ధవంతంగా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల శాఖ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 80వ వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ వేడుకలకు ఐఎంఏ జాతీయ కమిటీ పూర్తి స్థాయిలో హాజరుకావడం అనందంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు రద్దుపై ఐఎంఏ ప్రధాన కార్యాలయం ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా రాష్ట్రంలో కార్యక్రమాలను నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌ఎంసీ బిల్లు రద్దు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఐఎంఏ, జూడాలతో ప్రత్యేకంగా చర్చించి కేంద్ర మంత్రితో స్వయంగా మాట్లాడి ఎన్‌ఎంసీ బిల్లు రద్దుకు, సవరణలు చేయడం పట్ల హామీనివ్వడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రవి వాంకేడ్‌కర్, డాక్టర్ వినయ్ అగర్వాల్, ఏఐజీ డైరెక్టర్ పద్మభూషణ్, డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ వేద ప్రకాశ్ మిశ్రా, ఐఎంఏ ప్రధాన కార్యలయ సెక్రెటరీ జనరల్ డాక్టర్ ఆర్వీ అశోకన్, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రాజేందర్, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి సంజీవ్‌సింగ్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జయలాల్, డాక్టర్ నర్సింగ్‌రావు, ఐఎంఏ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు మహ్మద్ గుప్తా, 80 వసంతాల వేడుకల ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...