కేటుగాళ్లు


Sat,August 10, 2019 04:35 AM

-షేర్ మార్కెట్‌లో లాభాలు ఇప్పిస్తామని మోసం
-నగరానికి చెందిన వ్యక్తి నుంచిరూ. 1, 81, 116 లక్షలు కాజేసిన నిందితులు
-నేషనల్ స్టాక్ రిసెర్చ్ కంపెనీ పేరుతో మోసం
-దేశంలోని పలువురి నుంచి రూ.70 లక్షల మేర వసూళ్లు
-ఇద్దరి అరెస్టు.. మరో నలుగురు పరారీలో..

మన్సూరాబాద్ :షేర్ మార్కెట్‌లో తమ కంపెనీ ద్వార పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వివిధ బ్రాండ్‌లకు చెందిన నాలుగు సీపీయూలు, ఒక ల్యాప్‌టాప్, మూడు స్టాంప్స్, రెండు ల్యాండ్‌ఫోన్స్, ఒక టీపీ లింక్ రూటర్, వివిధ బ్రాండ్‌లకు చెందిన నాలుగు సెల్‌ఫోన్లు, డీ మాట్ అకౌంట్ హోల్డర్స్ ఫోన్ నెంబర్స్ ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ స్రైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ, రాచకొండ క్రైమ్స్ డీసీపీ కె.నారాయణరెడ్డి వివరాలను తెలియజేశారు. బీహార్, పాట్నా, పుల్వారికి చెందిన రాహుల్ కుమార్ (27) బెంగళూరు సౌత్, బన్నర్‌గట్ట రోడ్డులోని అనుగ్రహ లేఅవుట్‌లో ఉంటూ బెంగళూరు, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, హెచ్‌ఎన్ టవర్స్‌లో నకిలీ నేషనల్ స్టాక్ రిసెర్చ్ కంపెనీని ఓపెన్ చేసి డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. రాహుల్‌కుమార్‌కు సహాయకులుగా ఏపీ, చిత్తూరు జిల్లా, బీరెడ్డిపల్లికి చెందిన బండ్లపల్లి అనంత సూర్యచైతన్య(26) ఉంటూ నేషనల్ స్టాక్ రిసెర్చ్ ఆఫీస్ ఫ్లోర్ ఇన్‌చార్జ్జిగా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో రాహుల్‌కుమార్, సూర్యచైతన్యలతో పాటు కొర్రి దీపక్, పీఆర్ చంద్రశేఖర్, విజయ్ రమేష్, నివేద్ నారాయణలు పనిలో కుదిరారు.

రెట్టింపు లాభాలు వస్తాయని
వీరి మాటలను నమ్మిన నగరంలోని ఉప్పల్, భరత్‌నగర్‌కు చెందిన శ్రవణ్ చిట్టిరెడ్డి ఎన్‌ఎస్‌ఆర్ డైరెక్టర్ రాహుల్‌కుమార్ అతని బృందాన్ని సంప్రదించారు. తమ ద్వార కొనుగోలు చేసిన షేర్లకు 28 రోజుల ట్రేడింగ్‌లో 5 నుంచి 11 టైమ్స్ లాభాలు వస్తాయని శ్రవణ్ చిట్టిరెడ్డిని నమ్మించారు. నకిలీ ఎన్‌ఎస్‌ఆర్ సంస్థను నమ్మిన చిట్టిరెడ్డి పేటీఎం ద్వారా 02-07-2019 నుంచి 08-07-2019 మధ్యలో రూ. 1,81,116 లక్షలు పంపాడు. డబ్బులు పంపిన అనంతరం వారం రోజులపాటు వేచి చూసిన చిట్టిరెడ్డికి ఎన్‌ఎస్‌ఆర్ కంపెనీ నుంచి షేర్ బాండ్లపై ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పలుమార్లు ఫోన్, మెయిల్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎన్‌ఎస్‌ఆర్ కంపెనీ ప్రతినిధుల నుంచి సమాధానం రాలేదు. షేర్ మార్కెట్‌లో లాభాలు ఇప్పిస్తామంటూ నేషనల్ స్టాక్ రిసెర్చ్ కంపెనీ మోసం చేసిందని శ్రవణ్ చిట్టిరెడ్డి గ్రహించాడు.

30.07.2019న ఎల్బీనగర్‌లోని రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్‌ఎస్‌ఆర్ కంపెనీ డైరెక్టర్ రాహుల్‌కుమార్, కంపెనీ ఫ్లోర్ ఇన్‌చార్జి బి.సూర్యచైతన్యలను గురువారం బెంగళూరులో అరెస్టు చేసి నగరానికి తరలించారు. నిందితులు ఇరువురిని శుక్రవారం రిమాండ్ తరలించారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు కొర్రి దీపక్, పీఆర్ చంద్రశేఖర్, విజయ్ రమేష్, నివేద్ నారాయణ పరారీలో ఉన్నారు. కాగా నేషనల్ స్టాక్ రిసెర్చ్ కంపెనీ పేరుతో షేర్ మార్కెట్‌లో అధిక లాభాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురి వద్ద నుంచి రూ.70 లక్షల మేర వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ సీఐలు కేవీ విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రకాష్ తదితరులు ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...