30 డే కేర్ సెంటర్లలో..వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు


Sat,August 10, 2019 04:24 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వృద్ధులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 88డే కేర్ సెంటర్లకుగాను 30 సెంటర్లను ఎంపికచేసి వాటిలో ఫీజియో థెరపీ, యోగా, పాలియేటివ్ కేర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. వృద్ధుల సంక్షేమానికి శుక్రవారం కమిషనర్ వాటర్‌బోర్డు కార్యాలయంలో ఆసరా కమిటీలు, సీనియర్ సిటిజన్ సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధులు ఆరోగ్యవంతంగా ఉంటే వారిపనులు వారే చేసుకునే వీలు కలుగుతుందని, ఇందుకు అనుగుణంగా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. వారిలో విశ్వాసం పెంపొందించడంతోపాటు తగిన గౌరవం ఇవ్వడం, మెరుగైన జీవన విధానం, మంచి ఆరోగ్యం తదితర సౌకర్యాలు కల్పించాలని నిశ్చయించారు. దీనివల్ల వారు ఇతరులపై ఆధారపడడం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే వృద్ధులకోసం ఏర్పాటుచేసే డే కేర్ సెంటర్లలో యోగా, ఫీజియోథెరపీ, ఉపశమన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వారానికి మూడురోజులు యోగా శిక్షణ, ఫీజియో థెరపీ కోసం నిపుణులను నియమిస్తామన్నారు. పాలియేటివ్ కేర్ సర్వీసులకోసం ప్రత్యేకంగా నాలుగు వాహనాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షలకు ప్రత్యేక తేదీల్లో వైద్యులను కూడా పంపాలని నిశ్చయించారు. అంతేకాకుండా వారికి ఈనెల 14వ తేదీన చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్, ఎల్బీనగర్‌లోని సచివాలయనగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10నుంచి సాయంత్రం మూడు గంటలవరకు చెస్, క్యారమ్, లెమన్ అండ్ స్పూన్, షటిల్, బ్రిస్క్‌వాకింగ్ తదితర అంశాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఔత్సాహికులు నేరుగా పోటీలకు హాజరుకావచ్చని కమిషనర్ వివరించారు. మొత్తం 182డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ అందులో 88 మాత్రమే పనిచేస్తుండగా, అందులో 30 కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...