భయపెడుతున్న పాత భవనాలు


Mon,July 22, 2019 01:20 AM

సికింద్రాబాద్: నగరంలో పురాతన కట్టడాలు భయపెడుతున్నాయి. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నోటీసులు ఇచ్చినా.. భవన యజమానులు స్పందించడం లేదు. దీనికి తోడు అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో తరుచూ పురాతన భవనాలు కూలిపోయి అనేక ప్రాణాలు పోయాయి. పురాతన కట్టడాలుగా గుర్తించినప్పటికీ అధికారులు వాటిపై కఠినంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. పురాతన భవనాలుగా గుర్తించిన వాటి వద్దకు వెళ్లి ఎప్పుడు ఖాళీ చేస్తారంటూ.. ఆరాలు తీయడం, నామమాత్రంగా నోటీసులు అందించడం తప్ప.. శ్రద్ధ పెట్టిందిలేదనే విమర్శలు ఉన్నాయి. సిటీలైట్ హోటల్ ఘటన తర్వాత ఇప్పటివరకు అలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో అధికారులు నోటీసుల పర్వాన్ని ప్రహాసనంగా కొనసాగించారు. తాజాగా రెజిమెంటల్‌బజార్‌లో ఇల్లు కూలడంతో అధికారులు అప్పటికప్పుడు మేల్కొన్నారు. తక్షణమే పురాతన భవనాలను కూల్చాలని నిర్ణయించారు. చిలకలగూడ సంఘటనలో మేల్కొన్న అధికారులు ఆగమేఘాల మీద పురాతన భవనాలను గుర్తించి నోటీసులు ఇచ్చారు. రెండుమూడు రోజుల్లోగా కూల్చివేస్తామని హెచ్చరించారు. కానీ రెండు సంవత్సరాలు కావొస్తున్నా..కూల్చాల్సిన విషయం మరిచారు. మళ్లీ ఆదివారం ఉదయం సీతాఫల్‌మండి మేడిబావి మరో ఇల్లు కూలి చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. పాప తల్లి తీవ్రగాయాలతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నది.

సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ....
జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో దాదాపు 250 పురాతన కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాలు దాదాపు 70 సంవత్సరాలకు ముందు నిర్మించిన భవనాలు కావడం గమనార్హం. వీటిల్లో చాలా వాటికి మరమ్మతులు జరుపుకున్నారు. కొన్ని భవనాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. తాజాగా సేకరించిన వివరాల ప్రకారం 34 భవనాలు కూలే దశలో ఉన్నాయి. ఇప్పటికే పురాతన కట్టడాలను గుర్తించి తాజాగా నెల రోజుల కిందటే నోటీసులు కూడా ఇచ్చాం. కోర్టు పరిధిలో కొన్ని భవనాలు ఉండడం వల్ల చర్యలు తీసుకోడానికి లేదు. ప్రస్తుతం కూలిన ఇల్ల్లు ముందు భాగంలో కొత్తగా కట్టారు. వెనకాల మాత్రమే పాత గది ఉంది. అదికూలి పాప చనిపోవడం బాధాకరం. త్వరలోనే భవనాలను కూల్చివేస్తాం. అని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ అన్నారు.

పాత కట్టడాన్ని..
సిటీబ్యూరో:సీతాఫల్‌మండి ఏరియాలో పాత కట్టడం కూలి ఒకరు మరణించి, ఇద్దరు గాయపడ్డ ఘటనలో సికింద్రాబాద్ జోన్ అధికారులు నివేదిక అందజేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ముందు భవన నిర్మాణం అడ్డుగా ఉన్నందు వల్ల పాత భవనాన్ని అధికారులు గుర్తించలేకపోయినట్లు నివేదికలో పేర్కొన్నట్లు జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సంఘటన జరిగిన విషయం తెలుసుకొని అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి శిథిలాలను తొలిగించినట్లు వివరించింది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...