బాలికలపై అఘాయిత్యం చేస్తే ఉరి తీస్తాం..


Mon,July 22, 2019 01:18 AM

ఖైరతాబాద్, జూలై 21 : దేశంలో మానవాళి తలదించుకునేలా చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఇక నుంచి వాటిని సహించేది లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఉరి శిక్ష విధిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బోనాల వేడుకల్లో భాగంగా ఆదివారం ఖైరతాబాద్‌లోని శ్రీ రాజరాజశ్వేర నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక బీజేపీ నేత ఎన్‌డీ నగేశ్ స్వగృహంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి సహాయ మంత్రిగా తాను పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన శాంతి భద్రతల బాధ్యతను తనకు అప్పగించారని, అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకువస్తానన్నారు. అలాగే ఈశాన్య రాష్ర్టాల్లో ఉగ్రవాద కర్యకలాపాలను అరికడుతామని, ఢిల్లీ పోలీస్ కూడా తమ నియంత్రణలోనే ఉంటుందని, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాల పర్యవేక్షణ, అంతర్గత భద్రత బాధ్యతను తనపై ఉంచారని, శాంతి భద్రతల పర్యవేక్షణలో రాజీ లేకుండా పాటుపడుతానన్నారు. నక్సల్స్, సైబర్ నేరాలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలాగే చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే వెంటనే వారికి ఉరి శిక్ష విధించేలా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. పసిపిల్లలకు స్టిరాయిడ్, హర్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి పది సంవత్సరాల అమ్మాయిలను 20 సంవత్సరాల వయస్సులా మారేలా చేస్తున్నారని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. కార్యకర్తలు బూత్‌ల వారిగా కమిటీలను నిర్మాణం చేసుకోవాలని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మల్లేశ్, రామ్మోహన్, ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...