సర్వే చేసి.. హద్దులు పాతండి


Fri,July 19, 2019 02:56 AM

మేడ్చల్ కలెక్టరేట్ : అటవీ భూములను గ్రామాల వారీగా సర్వే చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే చేయని అటవీ భూములను వెంటనే సర్వేచేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏడీ సర్వేయర్‌ను ఆదేశించారు. ఫారెస్ట్ భూములకు హద్దులను ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్షింగ్ వేసి పరిరక్షించాలని జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్‌రెడ్డికి సూచించారు. చెరువులను సర్వే చేసి ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ణయించాలని, ఇప్పటి వరకు జిల్లాలో సర్వే చేయగా మిగిలిన 9 చెరువులకు వెంటనే సర్వే పూర్తి చేసి రెవెన్యూ రికార్డుల ప్రకారం రికాన్సిలేషన్ చేయాలని జిల్లా ఇరిగేషన్ అధికారిని ఆదేశించారు. జిల్లాలోని అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, మండల పరిధిలో ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ, తహసీల్దార్లు, జిల్లా స్థాయిలో డీపీఓ, ఆర్‌డీఓ జాయింట్ సంతకాలతో అక్రమ లేఅవుట్ల లిస్ట్‌ను నోటిఫై చేసి వాటి వివరాలను జిల్లా రిజిస్టార్, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్టార్‌కు, సీసీఎల్‌ఏ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులలో అక్రమ లేఅవుట్ల లిస్ట్‌ను ప్రదర్శించాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల వారీగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యార్థం, జనాభా ప్రాతిపదికన కొత్త మీసేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మండలాల వారీగా కావాల్సిన కొత్త మీ సేవా కేంద్రాల నివేదికను సమర్పించాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రతి మీ సేవా కేంద్రాల్లో టైమ్‌చార్టి, రేట్‌చార్జి ప్రదర్శించాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మీ సేవా కేంద్రాలు పనిచేయాలని, మీ సేవా కేంద్రాలను తహసీల్దార్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, ఆర్‌డీఓలు లచ్చిరెడ్డి, మధుసుదన్, జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్‌రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి మంజుల, డీపీఓ రవికూమార్, తహసీల్దార్లు, ఈఓపీఆర్‌డీలు తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...