యూఎల్‌సీ తహసీల్దార్‌కు.. షోకాజ్ నోటీసులు


Fri,July 19, 2019 02:55 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యూఎల్‌సీ తహసీల్దార్ లావణ్యకు మేడ్చల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మేడ్చల్ యూఎల్‌సీలో అనధికారిక కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వేతనాలను జారీ చేస్తున్న వ్యవహారంపై మేడ్చల్ యూఎల్‌సీలో అంతా నా ఇష్టం శీర్షికతో నమస్తే తెలంగాణలో గురువారం కథనం ప్రచురించిన సంగతి విధితమే. ఈ వ్యవహారంపై కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అనధికారికంగా నియామకం చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే తొలగించాలని, వారికి ఇచ్చిన వేతనాలను రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. యూఎల్‌సీలో జరుగుతున్న వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన కలెక్టర్ బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్లను ఏ నిబంధనల ప్రకారం తీసుకున్నారు, ఏ నిబంధనల ప్రకారం వేతనాలు ఇచ్చారో విచారణ చేసి తనకు రికార్డులను సమర్పించాలని యూఎల్‌సీ ఏవోను ఆదేశించారు. తహసీల్దార్ లావణ్యకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణ నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్ల స్థానంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి నూతనంగా అర్హత కల్గిన వ్యక్తులను కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...