జంట జలాశయాల ద్వారా నీటి తరలింపు


Fri,July 19, 2019 02:53 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటి నిల్వలు శరవేగంగా అడుగంటుతున్నాయి. గ్రేటర్ తాగునీటి సరఫరాలో కృష్ణా, గోదావరి జలాలే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోజూ 460 మిలియన్ గ్యాలన్ల(ఎంజీడీల) నీటి సరఫరాలో కృష్ణా మూడు దశల ద్వారా 270, గోదావరి 172 ఎంజీడీలు నీటిని తరలిస్తున్నారు. సింగూరు, మంజీరా నీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో అప్పటి వరకు స్టోరేజీకి పరిమితమైన జంట జలాశయాల నుంచి నీటిని సేకరిస్తూ పాతనగరంలోని పలు ప్రాంతాలకు అందిస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ నుంచి రోజూ 18 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 8 ఎంజీడీల మేర నీటిని గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే జంట జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుతుండడంతో అత్యవసర పంపింగ్‌కు సిద్ధమవుతున్నారు. మూడు 100 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న నీటిని అత్యవసర పంపింగ్ ద్వారా రాబోయే రెండున్నర నెలల వరకు నీటిని తరలించవచ్చని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.24లక్షల అంచనాతో అత్యవసర పంపింగ్‌కు సంబంధించి వారం రోజుల్లోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉస్మాన్‌సాగర్‌లో గరిష్ట స్థాయి నీటి మట్టం 1790 అడుగులు ఉండగా, గతేడాది 1777.900 ఉంటే, ఈసారి 1765.100 మాత్రమే ఉన్నది. హిమాయత్‌సాగర్‌లో 1763.500 గరిష్ట స్థాయి నీటి మట్టం కాగా, గతేడాది ఇదే సమయానికి 1753.200 అడుగులు ఉంటే, ఈసారి 1742.100 వరకు నీటి నిల్వలు చేరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శరవేగంగా నీటి నిల్వలు అడుగంటుతుండడంతో అత్యవసర పంపింగ్ అనివార్యమైందని అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటి నిల్వలు రాబోయే మూడు నెలల వరకు వస్తాయని, నీటి సరఫరాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...