అవమానాల్లోంచి... ఆవిష్కరణ దిశగా...


Thu,July 18, 2019 03:29 AM

(వినయకుమార్ పుట్ట-చందానగర్, నమస్తే తెలంగాణ) అవమానాల్లోంచి పుట్టిన కసి, పట్టుదల మనిషిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళుతుంది. కుటుంబం చిన్నచూపు చూసిందని... బంధువులు హేళన చేశారని... సమాజం వెలేసిందని... కుమిలిపోతూ కూర్చుంటే జీవితానికి అక్కడే ఫుల్‌స్టాప్ పడిపోతుంది. అవే అవమానాలను చాలెంజ్‌గా తీసుకొని అడుగు ముందుకు వేస్తే గేళి చేసిన వారే నీ గెలుపు సంబురాల్లో గంతులేసేలా చేస్తుంది. అలాంటి అవమానాల్లోంచే ఓ తెలంగాణ బిడ్డ ప్రపంచానికి పనికొచ్చే ఓ పరికరాన్ని ఆవిష్కరించాడు. దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే కోట్లు వస్తాయని తెలిసినా.. ప్రజలకే అది ఉపయోగపడాలని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. అతని మేధస్సు, అతని దేశభక్తికి మెచ్చిన కేంద్ర ప్రభుత్వం రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రూ.10 లక్షల రివార్డుతో అతడిని సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకి ఆ పరికరం ఏంటి.. ఆ తెలంగాణ తేజం ఎవరో తెలుసుకుందాం...

రెండు సార్లు విఫలమైనా..
ఖమ్మం జిల్లా, ఏనుకూరు మండలం, నూకలంపాడు గ్రామానికి చెందిన దమ్మాలపాటి అప్పారావు, లక్ష్మి అనే రైతు దంపతుల రెండో కుమారుడు దమ్మాలపాటి బాబు ట్రిపుల్ ఈ చేసి ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అయితే బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన బాబు స్నేహితులతో కలిసి సరదాలకు అలవాటు పడి రెండేండ్ల పాటు జులాయిగా తిరిగాడు. ఉద్యోగం చేస్తున్నానంటూ.. ఇంట్లో వారిని నమ్మించి దొరికిన చోట్ల అప్పు చేస్తూ.. కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు తమ దగ్గరి బంధువుల అమ్మాయితో 2018 ఏప్రిల్ 4న వివాహం జరిపించారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో గొడవలు మొదలై నాలుగు నెలలకే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టేంత వరకు దారితీశాయి. తన భార్యకు బాబు నుంచి రక్షణ లేదని, జీవిత భద్రతకోసం కొంత నగదు, కొంత భూమి ఆమె పేరిట రాసివ్వాలని పెద్దమనుషులు తీర్పు చెప్పారు. భార్యను ఇంటి దగ్గరే ఉంచేసి తాను మాత్రం నగరంలోని మియాపూర్‌లో నివాసముంటూ ఉద్యోగం చేస్తున్నాడు. రూ.10 వేల జీతంతో మొదలు పెట్టి ఎనిమిది నెలల్లో రూ.25 వేల జీతానికి చేరుకున్నాడు. ఉద్యోగరీత్యా కొంత రాణిస్తున్నప్పటికీ కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం, ఇతర కొన్ని మనస్పర్థలతో బాబూపై ప్రతికూల భావనతో ఉన్న భార్య, వారి కుటుంబం కొన్ని ఒప్పందాలతో విడాకులు తీసుకునేలా పెద్దమనుషుల సమక్షంలో అవగాహన కుదుర్చుకున్నారు. ఇక కోర్టు నుంచి అధికారికంగా విడాకులు మంజూరవ్వడమే తరువాయి.

సాఫ్ట్‌వేర్ మిత్రుల సహకారంతో..
ఎలక్ట్ట్రికిల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో తనకు నాలెడ్జ్ ఉన్నప్పటికి ప్రోగ్రామింగ్ కోసం తన సాఫ్ట్‌వేర్ మిత్రుల సహకారం తీసుకున్నాడు బాబు. ఆటోక్యాడ్‌లో డిజైనింగ్ చేసి, కెపాసిటర్లు, డయోడ్‌లు, సిటీ కాయిల్స్, సెన్సార్లు, యాంటినా ఇతర అనేక పరికరాల ఆధారంగా అడ్వాన్స్‌డ్ సునామీ అలర్ట్ డివైజ్‌ను రూపొందించాడు. దాన్ని గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్‌తో అనుసంధానం చేశాడు. అంటే సునామీ అలర్ట్‌ను డివైజ్‌లో తెలుసుకోవడంతో పాటు అందులో పొందుపరిచిన ఫోన్ నంబర్‌కు సమాచారం వెళ్లేలా ప్రోగ్రాం సెట్ చేశాడు. సిగ్నల్ టెస్టర్ ద్వారా సమాచారాన్ని చేరవేసేలా ఒక ప్రత్యేకమైన చిప్పును రూపొందించి బాబు తను తయారు చేసిన డివైజ్‌కు అనుసంధానం చేశాడు. అయితే చిత్రలహరి సినిమాలో హీరో ప్రమాదంలో చిక్కుకుంటే ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా ఒక డివైజ్‌ను తయారు చేస్తాడు. అయితే సమాచారం చేరవేసేందుకు లింక్ చేసిన ఫోన్ స్విచ్ఛాఫ్ అయితే పరిస్థితి ఏంటని సినిమాలో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాంటి సమస్య రాకుండా సిగ్నల్ టెస్టర్ ద్వారా సమచారాన్ని చేరవేసేలా ఒక ప్రత్యేకమైన చిప్‌ను రూపొందించాడు బాబు . తను తయారు చేసిన డివైజ్‌కు అనుసంధానం చేశాడు. బాబు తయారు చేసిన అడ్వాన్స్‌డ్ సునామీ అలర్ట్ డివైజ్ ఖచ్చితమైన వార్నింగ్స్‌ను 12 గంటల ముందే తెలియజేస్తుంది. ఆ డివైజ్‌ను సముద్ర తీరం దగ్గర 10 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సునామీ వచ్చే దాదాపు 12 గంటల ముందే బాబు డివైజ్ అలారం మోగుతుంది. ఆ డివైజ్‌కు అనుసంధానం చేసిన ఫోన్ నంబర్‌కు సమాచారమూ వెళుతుంది. దీంతో అ మధ్య సమయంలో సముద్ర తీర ప్రాంతాలను మొత్తం ఖాళీ చేయించి ప్రాణ నష్టాన్ని పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంటుంది.

రూ.కోట్లు వదులుకోని... భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు...
బాబు తను తయారు చేసిన ప్రాజెక్ట్ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే రూ.కోట్లు వస్తాయని తెలిసినా తన డివైజ్ పూర్తి హక్కులను ప్రభుత్వానికి రాసిచ్చేశాడు. డివైజ్ తయారీ చేస్తున్న సమయంలోనే గచ్చిబౌలిలోని మహాసముద్ర సమాచార సేవా కేంద్రం డైరెక్టర్, సివిల్ సర్వీస్ అధికారి డాక్టర్ సతీశ్‌కు(కేరళ) తన ప్రయోగం గురించి వివరించాడు. ఆయన, వారి సిబ్బంది సహకారంతో డివైజ్‌ను పూర్తిచేసి అందుకు సంబంధించిన పూర్తి ప్రయోగ పత్రాలను, డివైజ్‌ను వారికే అందజేశారు. దీంతో బాబు ప్రయోగాన్ని పరిశీలించిన మహా సముద్ర సమాచార సేవా కేంద్రం టెక్నికల్ టీం ఆ రిపోర్టును కేంద్రంలోని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు పంపింది. దీంతో బాబు సేవలను మెచ్చిన కేంద్ర ప్రభుత్వం రానున్న ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రూ.10 లక్షల రివార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని ఇవ్వనున్నారు. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాబును సత్కరించనున్నారు.

ఎవరినీ తక్కువ అంచనా వేసుకోకండి...
నేను చేసిన చిన్న తప్పులు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపాయి. నన్ను ఎన్నో అవమానాలకి గురిచేశాయి. నేను కృంగిపోతున్న సమయంలో మా బాబాయి వెంకటేశ్వర్లు చూపిన ఔదార్యం, తను ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎన్నటికీ మరిచిపోను. నేను దేనికి పనికిరాను అని వదిలేసుకుంటున్న నా భార్యకు, నన్ను హేళన చేసిన సమాజానికి ఈ రోజు నమస్తే తెలంగాణ ద్వారా నేను చెప్పదలచుకున్నది ఒక్కటే ఎవరనీ తక్కువ అంచనా వేసుకోకండి అని.
-దమ్మాలపాటి బాబు-ఎలక్ట్రికల్ ఇంజినీర్, అడ్వాన్స్‌డ్ సునామీ అలర్ట్ డివైజ్ ఆవిష్కర్త.

నూతన ఆవిష్కరణకు శ్రీకారం..
ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో తనకున్న విశేష పరిజ్ఞానంతో ఏదో ఒక నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలనుకున్నాడు. అప్పటికే సునామీల వల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ధన, ప్రాణ నష్టాలపై అతని దృష్టి మళ్లింది. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్జితో సునామీ అలర్ట్ అడ్వాన్స్‌డ్ డివైజ్ తయారీపై ఫోకస్ పెట్టాడు. నగరంలోని అప్డీ టెక్నాలజీలో ఉద్యోగం చేసుకుంటూనే వారి ప్రోత్సాహంతో ఈ డివైజ్ రూపకల్పనకు సిద్ధమయ్యాడు. తనకు వచ్చిన జీతంలో ఖర్చులు పోను మిగిలిన డబ్బు ప్రయోగానికి సరిపోదు. దీంతో బయట చిన్న చిన్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పనులు చేస్తూ డబ్బులు కూడ పెట్టాడు. ఒక్క ప్రయత్నానికి రూ.35 వేల చొప్పున ఖర్చు చేసినా.. రెండు సార్లు ప్రయోగం విఫలమైంది. అయినా పట్టువదలకుండా మూడోసారి డివైజ్‌కు అవసరమైన వస్తు పరికరాల సామర్థ్యాన్ని పెంచి రూ.70 వేల ఖర్చుతో ప్రయోగాన్ని సక్సెస్ చేశాడు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...