రూ.23 కోట్లతో సహాయక బృందాలు..


Wed,June 26, 2019 01:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో విపత్తుల నివారణకు రూ. 23కోట్ల వ్యయంతో మాన్సూన్ రిలీఫ్, ఇన్‌స్టెంట్ రిలీఫ్ బృందాలను, ఇతర అత్యవస టీంలను ఏర్పాటుచేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. అలాగే, ముంపునకు గురయ్యే 120 ప్రాంతాలను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్ అధికారులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. వర్షాలవల్ల తలెత్తే సమస్యలు, ఇతర అంశాలపై మంగళవారం ఆయన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏ క్యాటగిరీలో గుర్తించిన 31ముంపు ప్రాంతాల వద్ద 10 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు పవర్ మోటర్లను ఏర్పాటుచేసి వర్షం సమయంలో నీటిని ఎత్తిపోయనున్నట్లు తెలిపారు. వీటితోపాటు బీ, సీ విభాగాలుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి మొబైల్ మోటర్లను ఏర్పాటుచేశామన్నారు. ప్రతి ముంపు ప్రాంతానికి ఒక అధికారిని సర్కిల్ స్థాయిలో నియమించినట్లు, వీరందరిపై పర్యవేక్షణకు కమిషనర్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు, చీఫ్ ఇంజినీర్లను సూపర్‌వైజరీ అధికారులుగా నియమించామన్నారు. హైదరాబాద్‌లో 48రోజులపాటు వర్షాలు కురుస్తాయని, అందులో 20నుంచి 25రోజులు భారీవర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ భారీ వర్షాలు కురిసే సందర్భంలోనే నగరవాసులకు ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా పనిచేయాల్సివుంటుందన్నారు. ప్రతి వర్షాకాల సంబంధిత సమస్యలను ఎదుర్కోడానికి ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటుచేసి మూడు షిఫ్టులుగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేయాలని ఆదేశించామన్నారు. క్యాచ్‌పిట్‌లు, డ్రైనేజీ కవర్లు, నాలాలపై కప్పులపై ప్రతిరోజు పేరుకుపోయిన ప్లాస్టి క్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...