ముంపు నివారణ మరింత పకడ్బందీగా..


Tue,June 25, 2019 01:04 AM

-రోడ్లపై నిలిచే నీటిని తోడేందుకు శాశ్వత మోటర్లు
-ఖాళీ ప్రదేశాల్లో భారీ ఇంకుడు గుంతలు
-ఉద్యోగులంతా ఒకేసారి రాకుండా కంపెనీల సహకారం
సిటీబ్యూరో:నగరంలో కేవలం రెండు సెంటీమీటర్ల సామర్థ్యం గల వరదనీటి పారుదల వ్యవస్థ మాత్రమే ఉండగా, వర్షపాతం తక్కువ సమయంలో అత్యధికంగా ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలతోపాటు సత్వర ఉపశమనానికి సాధ్యమైనన్ని తాత్కాలిక, శాశ్వత చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. ఇప్పటికప్పుడు రూ. 5000 కోట్లతో వరదనీటి పారుదల వ్యవస్థను ఆధునీకరించే వీలు లేదు కనుక తాత్కాలిక చర్యల ద్వారా ముంపు లేకుండా చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. వర్షాలు వచ్చినప్పుడు ఆయా సంస్థల ఉద్యోగులు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ సమస్యను మరింత జటిలం చేయకుండా సహకరించాలి. అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు.

వర్షాలు బాగాపడుతుండడం సంతోషకరం..
నగరంలో గత శుక్రవారం వచ్చిన భారీ వర్షానికి ఏర్పడిన ముంపు సమస్య నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను సోమవారం కమిషనర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆరంభం ఆలస్యమైనా వర్షాలు భారీగా పడుతుండడం సంతోషదాయకమని, దీంతో నగరంలో భూగర్భ జలాలు ఉప్పొంగి నీటి సమస్య తగ్గుతుందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం శేరిలింగంపల్లిలో 11.4 సెంటీమీటర్ల వర్షం కురువగా, చందానగర్‌లో 8.7, ఖైరతాబాద్ 6.5సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు. రెండు గంటలముందు నుంచే మేఘాలు ఉండడంతో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు, అయినా ఆశించినదానికన్నా భారీ స్థాయిలో వర్షం రావడంతో ఇబ్బందులు తప్పలేదన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్, చెత్త, డెబ్రిస్ వంటికి మ్యాన్‌హోళ్లు, డ్రెయిన్‌ల్లోకి నీరు వెళ్లేచోట చిక్కుకొని నీరు నిలిచి ముంపు సమస్య ఏర్పడిందన్నారు. శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఎనిమిది అనేక చెరువులు ఉన్నప్పటికీ చుట్టూ నిర్మాణాలు రావడంవల్ల వాటిల్లోకి చేరాల్సిన నీరు రోడ్లపై నిలిచిపోయిందన్నారు.
కిలోమీటరు వరకూ చెత్తలేకుండా చర్యలు....
ముంపు ప్రాంతాల్లో చుట్టూ ఒక కిలోమీటరు వరకు చెత్త లేకుండా చేయాలని రెస్పన్స్‌టీమ్‌లను ఆదేశించినట్లు కమిషనర్ చెప్పారు. చెత్త, డెబ్రిస్, ప్లాస్టిక్ లేకుండా చేయాలని ఆదేశించామన్నారు. 153 మొబైల్ రెస్పాన్స్ టీములు ఉన్నాయన్నారు. ముంపు ప్రాంతాలను మ్యాపింగ్ చేయిస్తున్నట్లు, అందులో సమీపంలోని వరదనీటి కాలువ, చెరువు తదితరవాటని గుర్తించాలని ఆదేశించామన్నారు. అంతేకాకుండా రోజూ ఆయా ప్రాంతాలకు వెళ్లి నీరు వెళ్లేందుకు అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. పంపులు పెట్టినా పది సెంటీమీటర్ల వర్షం వస్తే ప్రయోజనం ఉండదని, అందుకే నీటిని సమీపంలోని కాలువల్లోకి మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఆయా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ నీటిని మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. ఉదాహరణకు ఎల్బీనగర్‌లో ఒక బాక్స్ కల్వర్టు నిర్మించాలని, అలాగే శేరిలింగంపల్లిలో రెండుచోట్ల 30మీటర్ల లోతు 26 మీటర్ల వెడల్పు గల ఇంకుడు గంతలను నిర్మించాలని నిశ్చయించామన్నారు. అవకాశమున్న ప్రాంతాల్లో నీరు వెంటనే ఇంకే విధంగా ప్రభుత్వ, జీహెచ్‌ఎంసీ స్థలాల్లో ఇంకుడు గుంతలను నిర్మించాలని నిశ్చయించామన్నారు. అలాగే, శేరిలింగంపల్లిలో 12చోట్ల పంపులు పెట్టిస్తున్నామన్నారు. అలాగే, రెండు కొత్త ట్రాఫిక్ జంక్షన్‌లు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ పద్ధతిలో వీటిని నిర్మించాలని నిర్ణయించామని, ట్రాఫిక్ సమస్య దృష్ట్యా గుర్తించిన ప్రాంతాల్లో యూటర్న్‌లు తగ్గిస్తున్నామన్నారు.

తాత్కాలిక డ్రెయిన్‌ల నిర్మాణానికి చర్యలు......
ప్రస్తుతం నగరంలో వివిధ శాఖలకు చెందిన 495మాన్‌సూన్ యాక్షన్ టీములు పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ జీపీఎస్ ద్వారా అనుసంధానం చేస్తామని కమిషనర్ చెప్పారు. అన్నింటికీ జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ ప్రక్రియ వచ్చే మూడు రోజుల్లో ముగిస్తామన్నారు. సహాయక సామగ్రితో కూడిన ఎనిమిది టీమ్‌లు ఉండగా, వాటికి అదనంగా మరో ఎనిమిది ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ బృందాలకు గ్రీన్ యూనిఫాంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జేఎన్‌టీయూకి చెందిన ప్రొఫెసర్. లక్షణ్‌రావు రూ. 5000 కోట్లతో ముంపు నివారణ ప్రతిపాదన చేసినట్లు, కాగా, తక్కువ ఖర్చుతో వెంటనే చేసేవి ఏమైనా చెప్పమని కోరామన్నారు. అలాగే, లొకేషన్‌వారీగా 30-40 లక్షలతో తాత్కాలిక డ్రైయిన్‌లను నిర్మించాలని నిర్ణయించినట్లు, అంతేకాకుండా లేబర్‌ను కూడా మాటిమాటికీ మార్చకుండా ఆయా ప్రాంతాల వారీగా శాశ్వత లేబర్‌ను ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా, ముంపు ప్రాంతాలకు కనీసం అరకిలోమీటరు దూరం వరకు ఎటువంటి నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడికమన్ను, ఇతర వ్యర్థాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. నీరు నిలిచే ప్రాంతాల వద్ద ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ ఇంకుడు గుంతలను నిర్మించాలని నిర్ణయించినట్ల్లు కమిషనర్ దానకిశోర్ చెప్పారు. నీరు నిలిచే ప్రాంతాలకు సమీపంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించామన్నరు. ఎస్‌ఆర్‌డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ఇప్పటికే 45 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. వార్డుకు ఒకటి చొప్పున 150 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. 56 వాహనాలు పనుల్లో ఉండగా, మిగిలినవి త్వరలోనే సమకూర్చుతామన్నారు.

మొత్తం 197 ముంపు ప్రాంతాల్లో..
నగరంలో మొత్తం 197 ప్రాంతాల్లో ముంపు సమస్య తలెత్తుతుండగా, అందులో 36 ప్రాంతాల్లో ముంపు లేకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు, మరో 40చోట్ల ప్రమాద తీవ్రత తగ్గించినట్లు పేర్కొన్నారు. ఇంకా సుమారు 127 ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉందన్నారు. రోడ్లపై నీరుతోడే పంపులు 10చోట్ల ఉండేవని, ఇప్పుడు అంతటా శాశ్వత మోటర్లు పెట్టాలని ఆదేశించామన్నారు. ముంపు ప్రాంతాలను ఏ,బీ,సీలుగా మూడు కేటగిరీలుగా చేశామన్నారు. అందులో 32ఏ కేటగిరీలో ఉండగా, వాటివద్ద 10హెచ్‌పీ పంపులు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతోపాటు బీ,సీ కేటగిరీల్లో కూడా పంపులు సమీపంలోని ఇండ్లు, ఆఫీసుల్లో సిద్ధంగా ఉంచాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా ఒక్కో పంపుకి ఒక ఏఈని ఇన్‌చార్జిగా నియమించినట్లు, అలాగే, మొత్తం 130 ముంపు ప్రాంతాల్లో అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించామన్నారు. లొకేషన్‌కు ఒకరు చొప్పున వీరు ఇన్‌చార్జిలుగా ఉంటారన్నారు.

వాహనాలన్నీ ఒకేసారి రాకుంటే మేలు....
వర్షం సందర్భంగా వాహనదారులు కాస్త సంయమనంతో వ్యవహరించాలని కమిషనర్ విజ్ఞప్తిచేశారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడుతున్నందున నీరు వెళ్లే దారిలేక రోడ్లు జలమయం అవుతున్నాయని, ఈ సందర్భంగా కంపెనీలనుంచి వచ్చే వాహనాలు ఒకేసారి కాకుండా కొంత సమయం ఆగి బయటకు వస్తే బావుంటుందన్నారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయం ఉన్నవారు వర్షాల సందర్భంగా ప్రధాన రోడ్లకు బదులు ప్రత్యామ్నాయ రోడ్లను ఆశ్రయిస్తే ట్రాఫిక్ సమస్య కొంతైనా తగ్గుతుందని చెప్పారు. అలాగే, ఆయా కార్యాలయాలు సైతం వర్షం వచ్చినప్పుడు అందరినీ ఒకేసారి కాకుండా దశలవారీగా ఉద్యోగులను బయటకు పంపితే ఒకేసారి రోడ్లపై వాహనాల తాకిడి తగ్గి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఉండే వీలు కలుగుతుందని కమిషనర్ వివరించారు.


విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
కేపీహెచ్‌బీ కాలనీ: వర్షాకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ దానకిశోర్ అన్నారు. సోమవారం కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట సర్కిల్‌లో వరదముంపు ప్రాంతాలను ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ శాఖాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మూసాపేట బస్టాప్, కైత్లాపూర్ డంపింగ్ యార్డు, కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ ఆర్‌యూబీ బ్రిడ్జి, అంకురా వైద్యశాల రోడ్డులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ మూసాపేట సర్కిల్ పరిధిలో వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలు 22 ఉన్నాయని, భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ ప్రాంతాల్లో అత్యవసర బృందాలతో పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు. మూసాపేట బస్టాప్‌లో నీరు నిలిచే అవకాశమున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కైత్లాపూర్ మాదాపూర్ బ్రిడ్జి పనులను ప్రారంభించేలా ల్యాండ్‌ను సేకరించాలన్నారు. వార్డుకు ఒకటి చొప్పున అత్యవసర బృందాలను సిద్ధం చేయాలని ఏఈ స్థాయి అధికారికి వార్డు బాధ్యతలు అప్పగించి నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ ఆర్‌యూబీ బ్రిడ్జి వద్ద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎనిమిల్ కేర్ సెంటర్ చుట్టూ గోడను నిర్మించాలని, కాలనీ 7వ ఫేజ్ ఆర్వోబీ బ్రిడ్జి నుంచి ఫోరంమాల్ చౌరస్తా వరకు రోడ్డుకిరువైపులా సర్వీస్ రోడ్డును అభివృద్ధి చేయాలని, ఆర్వోబీ బ్రిడ్జి కింద రోటరీని ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు విభాగం అధికారులకు సూచించారు. నర్సాపూర్ చౌరస్తాను పరిశీలించి నీరు నిల్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ సీఈ జియాఉద్దీన్, ప్రాజెక్టు సీఈ శ్రీధర్, సీసీపీ దేవేందర్‌రెడ్డి, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, ఎస్‌ఈ రవీంద్రనాథ్, డీసీలు వి.మమత, సామ్రాట్ అశోక్, డీఈలు నాగేందర్ యాదవ్, శ్రీధర్, డీఈలు, ఏఈలు, టౌన్‌ప్లానింగ్ ఏఈపీ శ్రీనివాస్‌దాస్, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ యాదగిరి, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ అంతరాయలకు చెక్ పడనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో మరో పది రోజుల్లో మూడు స్విచింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో శిల్పరామం, నానక్‌రామ్‌గూడ, ట్రిపుల్‌ఐటీ ప్రాం తాల్లోనే ఈ మూడు స్విచింగ్ స్టేషన్లను దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తుండడం గమనార్హం. అభివృద్ధిపరంగా హైదరాబాద్ మహానగరం దేశానికే తలమానికంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తం గా విద్యుత్ రెవెన్యూ విషయంలో గ్రేటర్‌దే సింహభాగం. నగరం నుంచి దాదాపు 70 శాతం రెవెన్యూ విద్యుత్ శాఖకు సమకూరుతోంది. ఇందులో ఐటీ రంగం విస్తరించిన సైబర్ సిటీలో అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. ఈ తరుణంలో అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే విద్యుత్ విషయంలో ఇకపై ఎలాంటి అంతరాయాలు లేకుండా టీఎస్‌ఎస్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే శిల్పరామం, నానక్‌రామ్‌గూడ, ట్రిపుల్‌ఐటీ ప్రాంతాల్లో స్విచింగ్ స్టేషన్లను నిర్మాణాలను చేపట్టింది. ఇప్పటికే ఈ నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. మరో వారం పది రోజుల్లో స్విచింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
స్విచింగ్ స్టేషన్లు ఇవీ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సైబర్ సిటీ సర్కిల్‌లో మూడు స్విచింగ్ స్టేషన్లను 33 కేవీ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో శిల్పరామం, నానక్‌రామ్‌గూడ, ట్రిపుల్ ఐటీ స్టేషన్లు ఉన్నాయి. శిల్పరామం స్విచింగ్ స్టేషన్‌కు మాదాపూర్ 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి, నానక్‌రామ్‌గూడ స్టేషన్, ట్రిపుల్ ఐటీ స్విచింగ్ స్టేషన్లకు గచ్చిబౌలిలోని 220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఇన్‌కమింగ్ విద్యుత్ సరఫరా అవుతుంది. ఒక్కో స్విచింగ్ స్టేషన్ పరిధిలో 4 కిలోమీటర్ల యూజీ కేబుల్ నిర్మాణం, 15 కిలోమీటర్ల మేర బహిరం గ లైన్లను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ స్విచింగ్ స్టేషన్ల పరిధిలో 33కేవీ స్విచింగ్ గేర్లు, టవర్ల నిర్మాణం, హెచ్‌టీఎల్‌ఎస్ కండక్టర్లు, సివిల్ వర్క్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మరో పది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి.

స్విచింగ్ స్టేషన్లు పనిచేసేదిలా..
సాధారణంగా విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే.. ప్రత్యామ్నాయ లైన్(మరో ఫీడర్‌కు లైన్‌ను మార్చడం) ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ఇలా ఫీడర్‌ను మార్చాలంటే.. దాదాపు గంటకు పైగా సమయం పడుతుంది. అందుకోసం 15 మంది విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. కొత్తగా అందుబాటులోకి రానున్న స్విచింగ్ స్టేషన్లలో అంతరాయం ఏర్పడితే.. సెకన్ల వ్యవధిలోనే మరో ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది శ్రమించాల్సిన అవసరం లేకుండా.. ఆటోమెటిక్‌గా ఫీడర్ మారి విద్యుత్ సరఫరా పునరుద్ధరణవుతుంది. ఈ స్విచింగ్ స్టేషన్ల వల్ల వినియోగదారులకు ఇబ్బందులు తప్పడంతో పాటు సంస్థకు రెవెన్యూ పరంగా లబ్ధి చేకూరుతుంది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసే మూడు స్విచింగ్ స్టేషన్లను రూ.50 కోట్ల వ్యయంతో టీఎస్‌ఎస్పీడీసీఎల్ నిర్మిస్తోంది. హైటెక్ సిటీలోని ఫీడర్స్‌ను శిల్పరామం స్విచింగ్ స్టేషన్‌కు ఇంటర్ లింక్ కేబుల్స్‌ను రూ.1.40 కోట్లు వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా శిల్పరామం స్విచింగ్ స్టేషన్ నుంచి రహేజా ఫీడర్స్‌కు కేబుల్ నిర్మాణానికి మరో రూ.1.90 కోట్లు వ్యయం చేశారు. దీంతో పాటు రూ.13.31 కోట్లతో శిల్పరామం పరిధిలో కొత్తగా 24 ఫీడర్లను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు 10 ఫీడర్లను ప్రత్యామ్నాయ మార్గాల కోసం నిర్మాణం చేశారు. వీటికి అదనంగా మరో 9 ఫీడర్లను కొత్తగా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.

సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సర్కిళ్లలో విద్యుత్ విషయంలో రెవెన్యూ వసూళ్లు అధికంగా ఉండే వాటిల్లో సైబర్ సిటీ ఒకటి. ఈ సర్కిల్ పరిధిలో 55 సబ్‌స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 58, 11కేవీ ఫీడర్లు 250 ఉన్నాయి. సర్కిల్ పరిధిలో ఎల్‌టీ కనెక్షన్లు 5.23 లక్షలు కాగా, ఇందులో గృహ వినియోగదారులు 4.27 లక్షలు, కేటగిరీ-1, కేటగిరి-2 కనెక్షన్లు మిగతావి ఉన్నాయి. ఇదీగాక 1100 మంది హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. ఈ సర్కిల్ పరిధిలో ప్రతినెలా దాదాపు రూ.90.48 కోట్ల రెవెన్యూ వస్తుంది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...