అంగీకారం..అదే పనిగా ఆలస్యం


Tue,June 25, 2019 12:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించే సబ్సిడీ రుణాల జారీలో బ్యాంకు లు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రుణాలకు కాన్సెంట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో లబ్ధ్దిదారులంతా బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. జిల్లాలో నిరుద్యోగ యువత స్వశక్తిమీద ఆధారపడేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరాలంటే బ్యాంకర్ల పాత్ర కీలకం. కాని జిల్లాలో కొన్ని బ్యాంకులు సంక్షేమ రుణాల గ్రౌండింగ్‌లో ఆలసత్వం వహిస్తున్నాయి. కాన్సెంట్లు జారీకాకపోవడంతోజిల్లాలో చాలామటుకు యూనిట్లు గ్రౌండింగ్ కాకపోవడం గమనార్హం. ఇందుకు ఎస్సీ కార్పొరేషన్ తార్కాణంగా నిలుస్తున్నది. కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం సుమారుగా 4 వేల దరఖాస్తులు రాగా, బ్యాంకులు మాత్రం కేవలం 500 యూనిట్లకే కాన్సెంట్లు జారీచేశాయి. వివరాల్లోకి వెలితే.. జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 2,287 దరఖాస్తులు వచ్చాయి. 2017-18 సంవత్సరానికి చెందిన 1,663 దరఖాస్తులు క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. మొత్తంగా 3,950 దరఖాస్తులు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 500 యూనిట్లకు మాత్రమే బ్యాంకులు కాన్సెంట్లు జారీచేశాయి. మిగతావన్ని కాన్సెంట్లు లేకపోవడంతో పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాన్యానాయక్‌ను వివరణ కోరగా, దరఖాస్తుదారుల జాబితాను బ్యాంకులకు పంపించామని, బ్యాంక్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

జూలైలో ఎంపిక
కాన్సెంట్లు పొందిన వారికి ఎంపిక ప్రక్రియను జూలైలో చేపట్టేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. ఇంత కాలం ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటంతో గ్రౌండింగ్ ప్రక్రియకు అంతరాయం కలగగా, తాజాగా కోడ్ ముగియడంతో గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తిచేసి, అర్హులైన వారిని తేల్చి, వారందరికీ రుణాలను అందజేయనున్నారు. అయితే యూనిట్ల ఎంపికలో నైపుణ్యతలతో కూడి ఉన్న యూనిట్లకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. మొత్తం యూనిట్లలో 50 శాతం యూనిట్లను నైపుణ్యత గల వాటికే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. అయితే యూనిట్ల గ్రౌండింగ్ చేయడంలో భాగంగా లబ్ధిదారులకు ధనరూపేణా ఇవ్వమని, వస్తు రూపేణా మాత్రమే ఇస్తామని అధికారులు వెల్లడించారు. గ్రౌండింగ్ సమయంలోనే యూనిట్లను లబ్ధిదారుల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపైనే తాము కసరత్తు అధికారులు తెలిపారు. బ్యాంక్‌లతో సమన్వయం చేసుకుని గ్రౌండింగ్ మేళాలను నిర్వహించబోతున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు గ్రౌండింగ్ మేళాల సమాచారాన్ని చేరవేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...