లైంగిక దాడుల నిర్మూలనకు మరో ఉద్యమం రావాల్సిందే..


Tue,June 25, 2019 12:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లైంగిక దాడుల నిర్మూలనకు మరో ఉద్యమం రావాల్సిందే అని పలువురు వక్తలు నినాదించారు. చైల్డ్ సేఫ్టీ - ప్రివెన్షన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ సెక్స్ క్రైమ్స్ పేరిట సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ఆర్గనైజేషన్లకు సంబంధించిన ప్రతినిధులు, నేతలు, అధికారులు, అనధికారులు విచ్చేశారు. వారిలో పలువురు మాట్లాడుతూ, చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు జరుగడం సమాజ పురోభివృద్ధికి ఇదో గొడ్డలి పెట్టని, ఆధునిక సమాజంలో దూసుకుపోతున్నామనడానికే సిగ్గుచేటని, మనం ఎలాంటి వాతావరణంలో బతుకుతున్నామో.. ఒక్కసారి తల్చుకుంటేనే ఒంటిలోంచి వణుకు పుడుతుందన్నారు. ఇదీ.. ఎదుగుతున్న మన సమాజం అని చెప్పుకోవడానికి మాటలు రావడం లేదని, ఇరుగు పొరుగు వారే కాకుండా.. ఇంటిలోని వారు, బంధువులు కూడా ఇలాంటి వాటికి ఒడి కడితే.. ఇంకా రక్షణ కోసం ఎక్కడికి పరుగు పెట్టాలి? ఏమిటీ రాక్షస, ఆటవిక ధోరణి అని పలువురు వక్తలు పలు ప్రశ్నలను సభాముఖంగా లేవనెత్తారు.

చిన్నారులపై లైంగిక దాడులేలా ?
బాల కార్మిక వ్యతిరేక కార్యకర్త, మామిడిపూడి వెంకట రంగయ్య (ఎమ్వీ) ఫౌండేషన్ చైర్మన్, విశ్రాంత ప్రొఫెసర్ శాంతా సిన్హా మాట్లాడుతూ నెలల పిల్లల నుంచి వృద్ధుల మీద కూడా దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఇంటి వారు, ఇరుగు పొరుగు వారు చిన్నారుల పట్ల అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. కొత్త వారెవరూ ఇలాంటి వాటికి పాల్పడటం లేదు. మన అనుకున్న వాళ్లే ఇటువంటి దుర్మార్గాలకు ఒడి గడుతున్నారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఉపాధ్యాయురాలికి చెప్పుకోవాలంటే ఎలాంటి వొకాబులరి వాడుతారు? ఇలాంటి వాటి గురించి మాట్లాడాలన్నా అసహ్యం వేస్త్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన, భయంకరమైన అంశం. ఆడ, మగ పిల్లలను సమానత్వంతో చూడాలి. పిల్లల్లో, తల్లిదండ్రులలో లింగ పరమైన అవగాహన రావాలి. సివిల్ సోసైటీ, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఇందులో ప్రధానంగా ఉండాలి. త్వరితగతిన ఇలాంటి దురాగతాలను నిర్మూలించాలన్నారు.

మార్పు రావాలి..
ప్రభుత్వ విధానాల్లో మార్పులు త్వరితగతిన రావాలి. తరతరాలుగా అణచివేతకు గురవుతున్న మహిళల మీద, వారికి అనుకూలంగా చట్టాలు రావాలి. వాటి అమలుకు పూర్తి బాధ్యతగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మత్తు పానీయాలను పూర్తిగా నిషేధించాలి. ఇలాంటి అరాచక దాడులపై ప్రభుత్వం త్వరితగతిన ప్రక్షాలన చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- పి.నర్సింహా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బాలల హక్కుల ప్రజా వేదిక

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...