అందాల నిర్మాణం నిలువునా పచ్చదనం


Mon,June 24, 2019 04:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. మెట్రో నగరంలో విలాసవంతంగా నివసించాలనుకునే వారి కోసం ప్రత్యేక థీమ్ బేస్డ్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. గృహమే కదా స్వర్గ సీమ అన్న సూక్తిని నిజం చేయడానికి నిర్మాణ సంస్థలు నడుం బిగించాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా, నూతన హంగులతో, అత్యాధునిక మౌలిక వసతులతో మినీ నగరాలను నెలకొల్పుతున్నారు. ప్రధానంగా ఆరోగ్య, ఆహ్లాదకర వాతావరణానికి పెద్దపీట వేస్తూ నిర్మాణంలో దాదాపు 75 శాతం మేర పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కాంక్రీట్ వనంగా మారిన నగరంలో పచ్చదనం చూడలేకుండా పోతున్న వారికి వర్టికల్ గార్డెన్‌తో కూడిన నిర్మాణాలు సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుండటం గమనార్హం. పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించడం సవాల్‌గా మారిన పరిస్థితుల్లో ప్రతి అపార్ట్‌మెంట్ అటవీ ప్రాంతం తలపించేలా నిర్మాణాలతో ముందుకు రావడం శుభపరిణామని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అందరికీ స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించే నిర్మాణాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలోనే క్వాలిటీ ఆఫ్ లివింగ్ నగరాల్లో హైదరాబాద్ నంబర్ 1గా నిలవడం, ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో వృద్ధి, ప్రపంచ స్థాయి సదస్సులకు వేదికగా నిలవడం, సుస్థిరమైన ప్రభుత్వం.. ఇవన్నీ ఘన చరిత్ర గల మన నగరానికి ఉన్న అదనపు బలాలు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో హైదరాబాద్ రియల్ రంగం క్రమంగా విస్తరిస్తున్నది. దీన్ని గుర్తించిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కమర్షియల్‌తో పాటు రెసిడెన్షియల్ విభాగాలను లక్ష్యంగా చేసుకొని ఈ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. మెట్రోనగరంలో విలాసవంతంగా నివసించాలనుకొనే వారికోసం ప్రత్యేక థీమ్ బేస్డ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి. గచ్చిబౌలి, తెల్లాపూర్, నార్సింగి, కోకాపేట, గండిపేట, మణికొండ, శంషాబాద్, ఆదిభట్ల, రాయదుర్గం తదితర ప్రాంతాలలో ఆకాశహార్మ్యాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. హై రేంజ్ టౌన్‌షిప్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలాకు డిమాండ్ పెరిగిపోతున్నది. భవిష్యత్తులో వీటికి పెరిగే డిమాండ్‌ను మందే ఊహించిన నిర్మాణ సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ప్రస్తుతం వర్టికల్ గార్డెన్‌తో కూడిన అపార్ట్‌మెంట్ల ట్రెండ్ కొనసాగుతుందని, అందుకే ఈ తరహా నిర్మాణాల వైపు నిర్మాణ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.

వర్టికల్ గార్డెన్ అపార్ట్‌మెంట్లకు ఆదరణ
విశ్వనగరానికి తగ్గట్టుగా గృహ నిర్మాణం విస్తరిస్తున్నది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టౌన్‌షిప్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం వర్టికల్ గార్డెన్ నిర్మాణాలకు క్రేజీ ఉన్నది. ఈ తరహా భవనాలతో బాహ్యగోడలు, ఇంటి లోపల ప్రదేశాలలో వేడి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కి అన్ని అంతస్తుల్లో ప్రత్యేకమైన మొక్కలను పెంచే అవకాశం ఉంటుంది. గాలిలో కార్బన్ విడుదలను అరికట్టవచ్చు. పచ్చదనంతో మానసిక, శారీరక ఒత్తిడులు కూడా దరిచేరవు, మొక్కలు ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేసి శబ్ద, వాయు కాలుష్యాన్ని ఆరికట్టి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.
- జైపాల్ రెడ్డి, అర్కిటెక్ట్

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...