నీరు నిల్వకుండా ఎత్తిపోస్తారు


Mon,June 24, 2019 04:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:నగరంలో ముంపు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జీహెచ్‌ఎంసీ చర్యలకు ఉపక్రమించింది. ముంపు ప్రాంతాలను ఏ, బీ, సీ మూడు వర్గాలుగా వర్గీకరించి ప్రత్యేక ప్రణాళికతో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో 197 ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి అందులో 37 ప్రాంతాలను ముంపు లేకుండా శాశ్వతంగా సమస్య పరిష్కరించగా , మిగిలిన 160 పాయింట్లను తీవ్రతను బట్టీ వర్గీకరించారు. ఏ కేటగరి కింద నగరంలోని గుర్తించిన ముంపు ప్రాంతాలకు శాశ్వతంగా మోటార్ పంపులు ఏర్పాటు చేయడమే కాకుండా మ్యాన్‌పవర్‌ను కూడా కేటాయించి వర్షం పడగానే నీటిని ఎత్తిపోస్తారు. బీ కేటగిరి కింద వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాల వద్ద పంపులు బిగించి ప్రత్యేక బృందాలను ఉపయోగించి నీటిని తోడేస్తారు. డీఆర్‌ఎఫ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాల వంటి వివిధ శాఖలకు చెందిన 500 బృందాలు వీటి కోసం పనిచేసేలా సిద్ధమయ్యాయి. ఈ మేరకు జేఎన్‌టీయూ ప్రొఫెసర్ లక్ష్మణ్‌రావు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, ఇతర అధికారులు సిబ్బందితో కలిసి ఆదివారం వర్షం నీటిపై సమీక్ష చేసి ఐటీ కారిడార్ ప్రాంతాలతో పాటు ఇతర ముంపు ప్రాంతాలను కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షం నీరు పోకుండా అడ్డుగా ఉన్న అక్రమ కేబుళ్లను తొలిగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. సీడీ మెటీరియల్‌ను నిబంధలకు విరుద్ధంగా డంప్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని భారీ మొత్తంలో జరిమానా విధించాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజల భద్రత దృష్ట్యా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

వర్షం పడుతున్నప్పుడు బయటకు రావద్దు బల్దియా కమిషనర్ దానకిశోర్
వర్షాలు కురిసినప్పుడు ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటకు రావద్దని కమిషనర్ దానకిశోర్ సూచించారు. ఐటీ కారిడార్‌లో 5 లక్షల మంది పనిచేస్తున్నారని ఒకే సారి బయటకు వస్తే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతాయన్నారు. విడుతల వారీగా బయటకు రావడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వర్షం ఆగిన గంట తర్వాత వస్తే ఇబ్బందులు ఉండవన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...