వలలో పడి.. మోసపోకండి


Mon,June 24, 2019 04:40 AM


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. గతంలో మాదిరిగా భారీగా డబ్బు లాగకుండా వేలల్లో డబ్బు దోచేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని అమాయకులను మోసం చేస్తున్న ఈ ముఠాలు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా టార్గెట్ చేస్తున్నాయి. సినీ హీరోలతో సోషల్‌మీడియా వేదికగా హైదరాబాద్ పోలీసులు సైబర్ మోసాలపై అవగాహనకు సంబంధించి ప్రచారం చేయించారు. తద్వారా చాలా వరకు ఉద్యోగాలకు సంబంధించిన మోసాలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి ఏడు డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకు వచ్చేవారు, కొత్తగా ఉద్యోగాల వేటలో ఉంటారు. ఆ సమయంలో త్వరగా ఉద్యోగంలో చేరిపోవాలనే ఆలోచనతో రిజిస్ట్రేషన్ ఫీజే కదా అంటూ రూ.2వేలు ముందుగా చెల్లిస్తూ, తీరా సైబర్‌చీటర్ల చేతిలో చిక్కిపోతున్నారు. ఉద్యోగం అంటే కష్టపడితేనే వస్తుందనే విషయాన్ని విస్మరించి, అంతో ఇంతో డబ్బు చెల్లించి ఉద్యోగం కొట్టేద్దామనే భ్రమలో ఉండే వారు ఇలాంటి మోసాలకు గురవుతున్నారు.
వారం రోజుల్లో సైబర్‌ఠాణాకు వచ్చిన ఘటనలు..
n డ్రైవర్‌గా పనిచేస్తున్న సుదర్శన్‌కు ఈ నెల 7వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు రాజు ప్రసాద్ యాదవ్ అని, రైల్వే డిపార్టుమెంట్‌లో ఉద్యోగాలున్నాయంటూ నమ్మించాడు. నీకు ఉద్యోగం కావాలంటే.. జస్ట్ రూ.2వేలు చెల్లించి తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తరువాత ఉద్యోగానికి సంబంధించి ప్రాసెసింగ్ చేస్తామని చెప్పడంతో ఆ డబ్బు చెల్లించాడు. ఇలా ఉద్యోగం వస్తుందంటూ నమ్మిస్తూ పలు దఫాలుగా రూ.33వేలు కాజేశాడు. తనకొచ్చిన ఫోన్‌కాల్ విషయం తెలిసిన వారి వద్ద ప్రస్తావించడంతో అదంతా ఫ్రాడ్ అని తేలింది. దీంతో సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
n ఓరాకిల్‌లో ఉద్యోగమంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నమ్మించి సైబర్ చీటర్లు రూ.1.10లక్షలు బురిడీ కొట్టించారు. చదువు పూర్తైన తరువాత శ్రీధర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, లింక్‌డిన్‌లో ఓ ప్రొఫైల్ చూసి అతని సలహాలు తీసుకున్నాడు. తాను బెంగళూర్‌లో విమ్‌వేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానంటూ నమ్మించి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నాడు. టెలీఫోనిక్ ఇంటర్వ్యూ చేయిస్తానంటూ నమ్మించి సమయాన్ని లాగదీస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఇదంతా మోసమని పోలీసులు చెప్పడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
n కువైట్‌లో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి ఉన్నవారు తమను ఆశ్రయించాలని, పూర్తి వీసా చేసి పంపిస్తామంటూ వాట్సాప్‌లో కంప్లీట్ వీసా కన్సల్టెన్సీ పేరుతో వచ్చిన ఓ ప్రకటనను యాకుత్‌పురాకు చెందిన హుస్సేన్ చూసి సంప్రదించాడు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కొరియర్ ద్వారా పంపించమన్నారు. ఆ తరువాత మెడికల్ టెస్ట్‌లు చేయించారు. పాస్‌పోర్టుతోపాటు ఇతర సర్టిఫికెట్లు కొరియర్‌లో పంజాబ్ చిరునామాకు పంపించారు. ఆ తరువాత మీ ప్రాసెసింగ్ జరుగుతున్నదని, రూ.40వేలు చెల్లించాలంటూ సూచించారు. దీంతో ఆ డబ్బును హుస్సేన్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయడంతోనే.. అవతలి వ్యక్తులు తమ ఫోన్లను స్వీచ్ఛాఫ్ చేశారు. దీంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...