శిల్పారామం.. అందాల నిలయం


Sun,June 23, 2019 06:12 AM

ఉప్పల్, నమస్తే తెలంగాణ: సెల్ఫీలతో పోటీపడ్డారు.. ఆహ్లాద పరిసరాలను చూసి చిన్నారులు గెంతులు వేశారు.. పెద్దలు తమ ప్రాంతంలో వచ్చిన టూరిజాన్ని చూసి మురిసిపోయారు. కుటుంబసభ్యులతో తరలివచ్చి శిల్పారామం అందాలను ఆస్వాదించారు. పల్లె వాతావరణం, ఆహ్లాదకర పరిసరాలు, ముచ్చటగొలిపె కళాకృతులతో ఉప్పల్‌లో శిల్పారామం కొలువుదీరింది. సందర్శకులకు ఆహ్వానం పలుకుతూ కళాతోరణం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళలు, హస్తకళలు, పచ్చదనం పరుచుకున్న గార్డెనింగ్, సాంస్కృతిక కళావేదిక చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సకల సౌకర్యాలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ప్రకృతితోపాటు 35 అడుగుల పొడవైన ఆకట్టుకునే వాటర్‌ఫాల్స్, గ్రీన్‌రూం, హైమాస్ట్‌లైట్లతో కొత్తవెలుగులు పంచుతున్నది.

ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
ప్రారంభోత్సవం సందర్భంగా కళాకారులు చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు, డోలు వాయిద్యాలు, సంగీత కళాకారుల ప్రతిభ చూపరులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యప్రదర్శనలను ముఖ్యఅతిథులతోపాటు, సందర్శకులు తిలకించారు. విభన్నరూపాలతో కళాకారుల చేసిన ప్రదర్శనలు అబ్బురపరిచాయి.

ఆహ్లాదం..ఆనందం.. సందర్శకుల తాకిడి
ఉప్పల్‌లో రూ.5 కోట్ల వ్యయంతో ఏడున్నర ఎకరాలలో శిల్పారామం నిర్మించారు. గతంలో మున్సిపల్ శాఖామంత్రిగా ఉన్న కేటీఆర్ శంకుస్థాపన చేసి, నిర్మాణానికి పునాది వేశారు. కొద్దికాలంలో నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. శిల్పారామంలో 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫుడ్‌కోర్టు, తాగునీరు, చిల్డ్రన్ ప్లేగ్రాండ్, వాటర్ ఫాల్స్, పచ్చని పరిసరాలు, గార్డెనింగ్‌తో ఆహ్లాదకరంగా నిర్మించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు టూరిజానికి వేదికగా మారుతున్నది. ప్రజలకు ఆటవిడుపుతోపాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచనున్నది. రెండో విడుతలో భాగంగా మరో రూ.5 కోట్లతో మినీ మ్యారేజ్‌హాల్, విలేజ్ మ్యూజియం, రివర్ బోటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఎలాంటి దుర్వాసన రాకుండా త్వరలోనే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...