నగరం పులకరించింది


Sat,June 22, 2019 01:03 AM

ఎల్బీనగర్/కంటోన్మెంట్/బంజారాహిల్స్/మాదాపూర్/ఖైరతాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఓ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు జలమయయ్యాయి. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బల్దియాకు చెందిన మాన్‌సూన్ యాక్షన్ టీంలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి చందానగర్ సర్కిల్‌లో అత్యధికంగా 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్‌లలో 52.8, హయత్‌నగర్‌లో 49.8 మి.మీ. ల వర్షపాతం నమోదు కాగా, సరూర్‌నగర్‌లో అత్యల్పంగా 21.0, షేక్‌పేట్‌లో 21.3, చార్మినార్‌లో 22.0మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఓల్డ్‌సిటీ, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, తార్నాక, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

భారీ వర్షంతో రహేజా మైండ్‌స్పేస్, జేఎన్‌టీయూ నుంచి సైబర్‌టవర్స్, నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ, ఎన్‌సీబీ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్, మలేషియా టౌన్‌షిప్ నుంచి టీసీఎస్, ఐకియా, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడకక్కడే నిలిచిపోయింది. హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు రావడానికి కొందరికి రెండు గంటల సమయం పట్టింది. ట్రాఫిక్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వర్షంవల్ల కంటోన్మెంట్, తార్నాక, రామంతపూర్, ముషీరాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని సుమారు 120 ప్రాంతాల్లో నీరు నిలుస్తుందని గుర్తించిన జీహెచ్‌ఎంసీ వర్షసూచన వెంటనే సహాయక బృందాలను ఆయా ప్రాంతాలకు తరలించింది. దీంతో వర్షంపడిన వెంటనే వారు రోడ్లపై నిలిచిన నీటిని మ్యాన్‌హోల్ కవర్లు తెరిచి పైప్‌లైన్ల ద్వారా తరలించారు. ట్రాఫిక్ పోలీసులు సోషల్‌మీడియా ద్వారా వాహనదారులకు సమాచారం ఇస్తూ, ఫలాన రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఉందని, ఒక గంట పాటు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ సూచనలిచ్చారు. అయితే భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు పదింటికల్లా అదుపు చేశారు.

మెట్రోను ఆశ్రయించిన సినీహీరో నితిన్
ఆకస్మాత్తుగా మెట్రో రైళ్లకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి తదితర మెట్రో స్టేషన్లలో ఉహించని రద్దీ పెరిగింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న సినీ హీరో నితిన్ కూడా మెట్రో రైల్ ఎక్కాడు.. ట్రాపిక్ రద్దీ కారణంగా తాను మెట్రోను ఆశ్రయించానని ట్విట్ చేశాడు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...