కాళేశ్వరం భాగ్యనగరానికి జలవరం


Fri,June 21, 2019 01:22 AM

-తాగునీటికి ఇబ్బందులు లేకుండా 30 టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్‌కు శాశ్వత భరోసా
-10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కేశవాపూర్ జలాశయం
-ఎల్లంపల్లి నుంచి మరో పది టీఎంసీలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చారిత్రక హైదరాబాద్ నగరం... ఆరు దశాబ్దాలుగా తాగునీటి కోసం తండ్లాటే. మూసీ అదిపోతే మంజీరా... చాలకపోతే కృష్ణా... అయినా గొంతెండుతుంటే గోదావరి! ఒకటా... రెండా!! ఎప్పటికప్పుడు గుక్కెడు మంచినీటి కోసం వెతుకులాటే. దూరదృష్టిలేని పాలకులతో వేలాది కోట్ల రూపాయలు తాగునీటి పథకాల కోసం వెచ్చించినా శాశ్వత పరిష్కారానికి నోచుకోని గ్రేటర్ హైదరాబాద్ మంచినీటి సరఫరా వ్యవస్థకు శాశ్వత పరిష్కారం లభించింది. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో కలికితురాయిగా నిలిచిన కాళేశ్వరం గ్రేటర్ భావి తరాలకూ తాగునీటి భరోసాను కల్పించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మెట్రోపాలిటన్ నగర తాగునీటి డిమాండ్ ఎంత పెరిగినా... అందుకు అనుగుణంగా గోదావరి జలాలను అందించేలా కేశవాపురం రూపంలో డెడికేటెడ్ రిజర్వాయర్ సాక్షాత్కరించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా పది టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కేశవాపురం రిజర్వాయర్‌కు ఏడాది పాటు జలాలను తరలించేందుకు అవకాశం ఉంది. దీంతో ఇక హైదరాబాద్ నగరం ఎంత విస్తరించినా... జనాభా పెరుగుదలతో మరింత కళకళలాడినా... మండు వేసవిలోనూ రక్షిత తాగునీటిని అందించేందుకు నేడు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరామరక్షలా మారనునన్నది.

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రయోజనాలు..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు హైదరాబాద్‌కు పుష్కలంగా లభించనుంది. నగరానికి సరఫరా అవుతున్న నీటికి ప్రధాన వనరు ఎల్లంపల్లి బరాజ్. ఇక్కడ 365 రోజులూ నీటి లభ్యత ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోస్తారు. దీంతో ఈ ఎల్లంపల్లి బరాజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లా పనిచేస్తుంది. దీంతో ఎల్లంపల్లి ద్వారా నగరానికి వచ్చే గోదావరి పథకం శాశ్వతంగా నీటి కొరతను అధిగమించేందుకు దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వందేండ్ల వరకు భరోసా కేశవాపురం
హైదరాబాద్ తాగునీటి కోసం వందల కిలోమీటర్ల నుంచి తరలిస్తున్న నదీజలాలను నిల్వ చేసేందుకు భారీ రిజర్వాయర్ లేని దుస్థితి. ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఒక్కరోజు నీటి వనరు నుంచి తరలింపు నిలిచిపోతే గ్రేటర్ హైదరాబాద్‌వాసులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా సింగూరు, మంజీరా రిజర్వాయర్ల నీటి నిల్వలు ప్రతి ఏటా ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్‌కు డెడికేటెడ్ రిజర్వాయర్లు ఉండాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు అధికారులు ఇటు కృష్ణా... అటు గోదావరి నదీజలాలను నిల్వ చేసేందుకుగాను భారీ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికల్లో తొలుత కేశవాపూర్‌ను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఏకంగా పది టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసేందుకుగాను కేశవాపురం దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రిజర్వాయర్ నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు పైపులైన్ విస్తరణ చేపట్టి అక్కడి నుంచి సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పైపులైన్లకు అనుసంధానం చేసి నీటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటికి శాశ్వత ప్రాజెక్టుగా ప్రభుత్వం సుమారు రూ.4777 కోట్లతో చేపడుతుండగా, ప్రస్తుతం భూ సేకరణ వడివడిగా జరుగుతుంది. ప్రభుత్వ, అసైన్డ్, ఫారెస్ట్, దేవాదాయశాఖ, పట్టా భూముల సేకరణ జరగుతుంది.

ప్రాజెక్టు ప్రత్యేకతలు
శామీర్‌పేట సమీపంలోని కేశవాపూర్‌కు 16 కి.మీల దూరంలో సముద్రమట్టానికి 623 అడుగుల ఎత్తులో కొండపోచమ్మ సాగర్‌ను 17 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం జలాలతో నింపనున్నారు. సీజన్‌లో రెండు అడుగుల మేర గోదావరి జలాలు ఈ జలాశయంలో చేరినప్పటికీ , అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోని కేశవాపూర్ రిజర్వాయర్‌కు పైసా ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా సరఫరా చేసేందుకు 3,600 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైపులైన్‌లను రెండు వరుసల్లో ఏర్పాటు చేయనున్నారు. సమీపంలోని బొమ్మరాస్‌పేట నీటి శుద్ది కేంద్రంలో 172 మిలియన్ గ్యాలన్ల (10టీఎంసీల) నీటిని శుద్ధి చేసి శామీర్‌పేట్, సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైపులైన్‌కు నీటిని పంపింగ్ చేయనున్నారు. సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల నీటి సరఫరాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా హైదరాబాద్ తాగునీటి సరఫరాకు డోకా ఉండదు.

కేశవాపూర్ రిజర్వాయర్ విశేషాలు
-ప్రాజెక్టు వ్యయం - సుమారు రూ.4777 కోట్లు l సామర్థ్యం 10 టీఎంసీలు
-ఫుల్ లెవల్ 596 మీటర్లు l లోడ్ వాటర్ లైన్ లెన్త్ -540 మీటర్లు
-కొండపోచమ్మ సాగర్ (పాములపర్తి) నుంచి కేశవాపురం రిజర్వాయర్ వరకు 3600 ఎంఎం డయా వాటర్ గ్రావిటీ పైపులైన్ విస్తరణ l బొమ్మరాసి పేట వద్ద 750 ఎంఎల్‌డీ మేర వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ , పంపుహౌజ్‌లు, ఎలక్ట్రో మెకానికల్ పరికరాలు, క్లియర్ వాటర్ రిజర్వాయర్ l బొమ్మరాసిపేట నుంచి ఘన్‌పూర్ మాస్టర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ వరకు 3000 ఎంఎం డయా పైపులైన్ విస్తరణ
- ఘన్‌పూర్ వద్ద 80 ఎంఎల్ సామర్థ్యంతో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

గోదావరి జలాల తరలింపు ఇలా (78 కోట్ల లీటర్లు)
-ఎల్లంపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఇన్‌టేక్ చానల్ (కాల్వ) నుంచి 53 కి.మీ దూరంలో ఉన్న బొమ్మకల్‌కు 121 మీటర్ల ఎత్తున లిఫ్టు ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు.
-ఇక్కడ నుంచి 48 కి.మీ దూరంలో ఉన్న మల్లారం నీటి శుద్ధి కేంద్రానికి 133.5 మీటర్ల ఎత్తున ఉన్న లిప్టు ద్వారా పంపింగ్ చేస్తున్నారు.
-మల్లారం వద్ద గోదావరి జలాలను శుద్ధి చేసి అక్కడి నుంచి 27 కి.మీ దూరంలో ఉన్న కొండపాకకు 141 మీటర్ల ఎత్తున ఉన్న లిఫ్టు ద్వారా తరలిస్తున్నారు. ఇక్కడ మరోసారి నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి 58 కి.మీ దూరంలో ఉన్న ఘన్‌పూర్ రిజర్వాయ నగర శివార్లకు.. 120 మీటర్ల ఎత్తున ఉండే లిఫ్టు ద్వారా పంపింగ్ చేస్తున్నారు.
-అక్కడి నుంచి రెండు భారీ రింగ్ మెయిన్ పైపులైన్ల ద్వారా నగరం నలుమూలలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు.
లబ్ధి పొందుతున్న ప్రాంతాలు : కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, అల్వాల్, కాప్రా, పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, మేడ్చల్, కీసర, అమీన్‌పూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలు గోదావరి నీటితో లబ్ధి పొందనున్నాయి

ఔటర్ చుట్టూ జల వలయం
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జలమండలి రోజూ 200 కోట్ల లీటర్లకు పైగా తాగునీటిని అందిస్తున్నది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి వనరుల నుంచి నగరానికి సురక్షిత జలాలను తరలిస్తున్నారు. ప్రస్తుత నగర దాహార్తిలో జీవనదులైన కృష్ణా, గోదావరి జలాలనే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన కృష్ణా, గోదావరి నదుల్లో ఏ ఒక్కదాంట్లో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ఆ ప్రభావం ఊహించలేం. సుదూర ప్రాంతాల నుంచి నీటి తరలింపు ప్రక్రియలో బ్రేక్ డౌన్ (అంతరాయం) ఏర్పడిన పరిస్థితి గందరగోళం. ఇక్కడే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోర్స్ (నీటి వనరు) ఫెయిల్యూర్ అయినా? నీటి తరలింపులో అంతరాయాలు ఏర్పడిన ఏ ప్రాంతంలోనూ నీటి కష్టాలు ల్లేకుండా చేసేందుకు తెరపైకి భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఆరు జలాశయాలను, ప్రధానంగా గోదావరి- కృష్ణా సరఫరా వ్యవస్థలను అనుసంధానం చేసి నీటి కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది .రాజధాని మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి 3000ఎంఎం డయా వ్యాసార్థం గల పైపులైన్ నిర్మాణ పనులను చేపట్టేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది. టాటా కన్సల్టెన్సీ ద్వారా డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించారు. 158 కిలోమీటర్ల మొత్తంలో భారీ పైపులైన్, 12 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ. 4765.00 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

గ్రేటర్ తాగునీటి ముఖచిత్రం
-జలమండలి పరిధిలో మొత్తం నల్లా కనెక్షన్లు -9.80 లక్షలు
-రోజువారీగా సరఫరా చేస్తున్న నీరు -210 కోట్ల లీటర్లు
-అక్కంపల్లి కృష్ణా మూడు దశల ద్వారా 124 కోట్ల లీటర్లు
-ఎల్లంపల్లి గోదావరి ద్వారా 73 కోట్ల లీటర్లు
-ఉస్మాన్‌సాగర్ 8 కోట్ల లీటర్లు
-హిమాయత్‌సాగర్ నుంచి 3.6 కోట్ల లీటర్లను తరలిస్తున్నారు
-జీహెచ్‌ఎంసీ ఏరియాలో 180 కోట్ల లీటర్లు
-జీహెచ్‌ఎంసీ అవతల 28 కోట్ల లీటర్ల సరఫరా జరుగుతుంది
-కోర్ సిటీలో 98 శాతం (150 ఎల్ పీసీడీ), శివార్లలో 80 శాతం (130ఎల్ పీసీడీ) నీటి సరఫరా జరుగుతుంది.
-వెలువడుతున్న మురుగునీరు 1700 ఎంఎల్‌డీ, ఎస్టీపీలతో శుద్ధి చేస్తున్న మురుగునీరు కేవలం -750 ఎంఎల్‌డీలు
-సర్వీస్ ఏరియా (ఓఆర్‌ఆర్ వరకు) 1400 స్కేర్ కిలోమీటర్లు
-నెలవారీ నిర్వహణ ఖర్చులు -114 కోట్లు
-నెలవారీ సంస్థ రాబడి - 91కోట్లు
-సంస్థ పరిధిలో మొత్తం ఉద్యోగుల సంఖ్య -4631

నీటి కొరతకు శాశ్వత పరిష్కారం
కేశవాపూర్ రిజర్వాయర్ గ్రేటర్ తాగునీటికి శాశ్వత ప్రాజెక్టుగా నిలువనుంది. నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలుంటుంది. నిరంతరం ప్రజలకు సమృద్ధిగా నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రికార్డు సమయంలో హడ్కో, ఓఆర్‌ఆర్ తాగునీటి పథకం పనులను పూర్తి చేసి ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారం చూపాం. ఇదే స్ఫూర్తితో కేశవాపురం భారీ రిజర్వాయర్, ఔటర్ చుట్టూ భారీ రింగు మెయిన్ పైపులైన్ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. త్వరలోనే పనులను ప్రారంభించనున్నాం.
- ఎం. దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...